విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి

ప్రధానాంశాలు

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి

పూర్తిస్థాయి వ్యాక్సిన్‌ తీసుకున్న కేటగిరీ-ఏ దేశాల ప్రయాణికులకు హోం క్వారంటైన్‌ ఉండదు
కేంద్రం నూతన మార్గదర్శకాలు

ఈనాడు, దిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల కోసం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 25 నుంచి అమల్లోకి వచ్చే వీటి ప్రకారం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదిత టీకాలను పరస్పరం గుర్తించేలా భారత్‌తో ఒప్పందం చేసుకున్న 11 దేశాల(కేటగిరీ-ఏ) నుంచి వచ్చే ప్రయాణికులు పూర్తిస్థాయి వ్యాక్సిన్‌ తీసుకున్నట్లయితే వారు ఇకపై ప్రయాణ అనంతరం హోం క్వారంటైన్‌లో ఉండడం కానీ, కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం కానీ ఉండదు. ఇంట్లోనే 14 రోజులపాటు స్వీయ ఆరోగ్య పర్యవేక్షణ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వారికి వ్యాక్సినేషన్‌ పూర్తై 15 రోజులు దాటి ఉండాలి. కేటగిరీ-ఏలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఉక్రెయిన్‌, బెల్జియం తదితర దేశాలున్నాయి. దీంతోపాటు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ ప్రయాణానికి ముందు స్వీయ ధ్రువీకరణ పత్రం(సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారం), బయల్దేరడానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ నెగటివ్‌ సర్టిఫికెట్‌ను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో ప్రయాణానికి ముందే అప్‌లోడ్‌ చేయాలని ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ సర్టిఫికెట్‌ అధీకృతమేనని పేర్కొంటూ ప్రయాణికులు డిక్లరేషన్‌ ఇవ్వాలని, అది తప్పని తేలితే నేరవిచారణకు బాధ్యులవుతారని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. భారత్‌కు వచ్చిన తర్వాత హోం క్వారంటైన్‌/స్వీయ ఆరోగ్య పర్యవేక్షణలో ఉంటామని మరో అండర్‌టేకింగ్‌ లెటర్‌ ఇవ్వాలని తెలిపింది. పాక్షికంగా వ్యాక్సిన్‌ వేయించుకున్నవారు, అసలు వ్యాక్సిన్‌ తీసుకోనివారు, కేటగిరీ-ఏ మినహా ఇతర దేశాల నుంచి వచ్చేవారు ఎయిర్‌పోర్టులోనే కొవిడ్‌ టెస్ట్‌కు నమూనాలు ఇచ్చి, ఏడురోజులపాటు ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది. భారత్‌కు వచ్చిన 8వ రోజు మళ్లీ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. నెగటివ్‌ వస్తే మరో ఏడురోజులపాటు స్వీయ పరిశీలన చేసుకోవాలని పేర్కొంది. పాజిటివ్‌ వచ్చిన వారు వెంటనే ఏకాంతంలోకి వెళ్లి, సమీప ఆరోగ్యకేంద్రానికి సమాచారం ఇవ్వడం లేదా 1075 నేషనల్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌చేసి చెప్పాలని తెలిపింది. భూ, సముద్రమార్గాలో వచ్చే ప్రయాణికులకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. విదేశాల్లోని విమానయాన సంస్థలు ప్రయాణికుల వద్ద ఆర్‌టీపీసీఆర్‌ నెగటివ్‌ సర్టిఫికెట్లు ఉన్నాయో లేదో ధ్రువీకరించుకోవాలని, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ సమర్పించిన వారినే ప్రయాణానికి అనుమతించాలని సూచించింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని