తెరాస, భాజపా శ్రేణుల ఘర్షణ

ప్రధానాంశాలు

తెరాస, భాజపా శ్రేణుల ఘర్షణ

దళిత బంధుకు వ్యతిరేకంగా ఈటల బావమరిది పోస్టులంటూ వైరల్‌
తెరాస కార్యకర్తల నిరసన
కావాలని ఫేక్‌ పోస్టులు సృష్టించారన్న రాజేందర్‌ భార్య జమున
హుజూరాబాద్‌లో పోటాపోటీ నినాదాలు, తోపులాట

హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గురువారం అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట భాజపా, తెరాస కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ తోసుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు పరస్పర ఆందోళనలతో ఉద్రిక్తత నెలకొంది. భాజపా నాయకుడు, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ బావమరిది మధుసూదన్‌రెడ్డి దళితబంధుకు వ్యతిరేకంగా ఎస్సీలను కించపరుస్తూ వాట్సప్‌ ఛాటింగ్‌ చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవగా అది వివాదానికి మూలమైంది. ఉదయం తొలుత ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో తెరాస కార్యకర్తలు మధుసూదన్‌రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. దళితులను కించపరిచిన ఆయనపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఈటల సతీమణి జమున, ఆమె సోదరుడు మధుసూదన్‌రెడ్డి భాజపా శ్రేణులతో కలిసి అంబేడ్కర్‌ కూడలి వద్దకు చేరుకున్నారు. తెరాస కార్యకర్తలు ఫేక్‌ పోస్టులు సృష్టించి వైరల్‌ చేశారని ధ్వజమెత్తారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఇదే సమయంలో కొందరు తెరాస కార్యకర్తలు దళితద్రోహి ఈటల రాజేందర్‌ అంటూ నినాదాలు చేస్తూ అక్కడికి చేరుకున్నారు. దీంతో కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా శ్రేణులు ప్రతినినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఇరుపార్టీల కార్యకర్తలు ప్రధాన రహదారిపై బైఠాయించి పోటాపోటీగా నినాదాలు చేశారు. ఆ తర్వాత కొందరు భాజపా మహిళా కార్యకర్తలు ఈటలకు మద్దతుగా అక్కడకు చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొన్నారు. ఆ తర్వాత వారు మరోచోటికి వెళ్లి దహనం చేశారు. ఇలా దాదాపు రెండు గంటల సేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ నేపథ్యంలో హుజూరాబాద్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాజా ఘటనలతో కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా తెరాస, భాజపా శ్రేణులు పోటాపోటీగా నిరసనలకు దిగారు.

దళితజాతిని కించపరిచే వారిపై చర్యలు తీసుకోవాలి:  బండ శ్రీనివాస్‌  
ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితుల సంక్షేమం కోసం తెలంగాణ దళితబంధు పథకాన్ని రూపొందించిన నేపథ్యంలో ఈటల బావమరిది మధుసూదన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో దళితజాతి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వచ్చే ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతో ఈటల కుటుంబసభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సామరస్య వాతావరణం ఉండాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తుంటే దళితులను రెచ్చగొట్టే విధంగా భాజపా నాయకులు ప్రయత్నిస్తున్నారు.


కేసీఆర్‌ కుట్రలో భాగంగానే తప్పుడు ప్రచారం
జమున సోదరుడు మధుసూదన్‌రెడ్డి

ళితబంధుకు వ్యతిరేకంగా నేను వాట్సప్‌ ఛాటింగ్‌ చేశాననే ప్రచారం కేసీఆర్‌ కుట్రలో భాగమే. అదంతా కృత్రిమ సృష్టి. మా పరువుకు భంగం కలిగిస్తూ సమాజంలో కుల విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టింగ్‌లను సృష్టించిన వారిపై మూడ్రోజుల్లో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. లేకపోతే కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తాం. దళితులంటే మాకు అపారమైన గౌరవం ఉంది. దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అమలు చేయడంతో పాటు వారికి మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం.


మధుసూదన్‌రెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఈటల రాజేందర్‌ బావమరిది మధుసూదన్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (టీఎస్‌జీసీసీ) మాజీ ఛైర్మన్‌ ధారవత్‌ మోహన్‌ గాంధీ గురువారం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈటల పౌల్ట్రీ భాగస్వామితో దళితులను కించపరిచేలా మధుసూదన్‌రెడ్డి వాట్సప్‌ చాట్‌ చేశారని అందులో పేర్కొన్నారు. రాజేందర్‌ కుటుంబంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలని ఆయన డీజీపీని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని