సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడి

ప్రధానాంశాలు

సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడి

ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీల ఐకాస హెచ్చరిక

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: స్థానిక ప్రజాప్రతినిధులుగా తాము ఉత్సవ విగ్రహాలుగా మారామని.. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించకుంటే రానున్న శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీల ఐకాస (ఐక్య కార్యాచరణ సమితి) హెచ్చరించింది. ప్రభుత్వం పల్లెప్రగతి ప్రకటించినా నిధులు మాత్రం కేటాయించలేదని, దాంతో సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్థానిక ప్రజాప్రతినిధుల నిధులు, విధుల విషయంలో స్పందన లేకపోవడంతోనే మూడు సంఘాలు కలసి ఐకాసగా ఏర్పడినట్లు ప్రకటించారు. శనివారం లక్డీకాపూల్‌లోని పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త పంచాయతీ చట్టం తెస్తుందంటే గ్రామాభివృద్ధి జరుగుతుందని ఆశించామని, దానిద్వారా గ్రామాల నుంచి వచ్చే నిధులన్నీ ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా తమ ఖజానాలో వేసుకుంటోందని విమర్శించారు. తాము ఎవరికీ వ్యతిరేకం, అనుకూలం కాదని.. తమ ఆత్మగౌరవ సమస్యల పరిష్కారం కోసమే పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెల్లం శ్రీనివాస్‌, భరత్‌ ప్రసాద్‌, ఎంపీటీసీల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శైలజారెడ్డి, గుట్టయ్యలు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని