డెంగీపై ఏటా చెప్పాలా?

ప్రధానాంశాలు

డెంగీపై ఏటా చెప్పాలా?

ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

ఈనాడు, హైదరాబాద్‌:  డెంగీ వంటి వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏటా చెప్పాలా అంటూ ప్రభుత్వాన్ని మంగళవారం హైకోర్టు ప్రశ్నించింది. వర్షాకాలంలో దోమల వ్యాప్తి ఎక్కువై డెంగీ వంటి జ్వరాలు ప్రబలే విషయం అందరికీ తెలుసని, అలాంటప్పుడు ముందస్తుగా ప్రభుత్వమే ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించింది.  హైకోర్టు ఆదేశాలతో గత ఏడాది ఏర్పాటైన కమిటీ ఎన్నిసార్లు సమావేశమైంది? ఏం సిఫారసులు చేసింది? వాటి అమలు వివరాలేమిటి అని కోర్టు ప్రశ్నించింది.. డెంగీ నియంత్రణకు తీసుకునే కార్యాచరణ ప్రణాళికను ఈనెల 25లోగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను 29వ తేదీకి వాయిదా వేసింది. డెంగీ ప్రబలుతున్నా నివారణ చర్యలు చేపట్టకపోవడంపై గత ఏడాది దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.పవన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ ప్రస్తుత వర్షాలకు దోమలు పెరిగి డెంగీ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు ఈ కేసులో కోర్టు సహాయకుడిగా వ్యవహరిస్తున్న సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గతంలో ఇదే హైకోర్టు ఉన్నతాధికారులతో ఏర్పాటైన కమిటీ సమావేశ వివరాలు తెలియడంలేదన్నారు. అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ డెంగీతోపాటు విషజ్వరాల నివారణపై సీఎం సమావేశం నిర్వహించారని చెప్పగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఇలాంటి వ్యవహారాల్లో సీఎం స్థాయి వ్యక్తి ఎందుకు చెప్పాలని, యంత్రాంగమే ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలంది. కాఫీలు తాగి సమావేశాలు ముగించొద్దంది. స్థానిక సంస్థలు, వైద్యఆరోగ్యశాఖ సమన్వయంతో నివారణకు తీసుకుంటున్న చర్యలు చెప్పాలని ఆదేశించింది. ఫాగింగ్‌ చేయడం లాంటి అమలుకాని సూచనలను ఇవ్వలేమని స్పష్టం చేసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని