'కాఫీ'తో సౌందర్య ప్రయోజనాలెన్నో..! - beauty benefits of coffee in telugu
close
Published : 24/10/2021 11:59 IST

'కాఫీ'తో సౌందర్య ప్రయోజనాలెన్నో..!

'కొంచెం కాఫీ తాగితే ఎంత హాయిగా ఉంటుందో..!' కాఫీ ప్రియులు తరచుగా చెప్పే మాట ఇది. ఆరోగ్యపరంగా కాఫీ ఎంతో మేలు చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. మరి కాఫీ పొడి/గింజల వల్ల ఎన్నో సౌందర్యపరమైన ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? నమ్మశక్యంగా లేదు కదా..! అయితే ఇది చదివేయండి మరి..

స్క్రబ్‌గా..

కాఫీపొడి చర్మానికి మంచి స్క్రబ్‌గా పనిచేస్తుంది. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను సులభంగా తొలగిస్తుంది. ఫలితంగా నిగనిగలాడే మేని మెరుపు సొంతమవుతుంది. ఏంటీ?? కాఫీపొడిని స్క్రబ్‌గా ఎలా ఉపయోగించాలా అని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్ అండీ.. స్నానం చేసే సమయంలో కాఫీపొడిని నేరుగా చర్మంపై రుద్దుకుంటే సరిపోతుంది. స్క్రబింగ్ కోసం కాఫీ గింజలను సైతం వాడచ్చు.

ముడతలు పడకుండా..

చర్మం ముడతలు పడకుండా అందాన్ని కాపాడుకోవాలని ప్రతి మహిళా భావిస్తుంది. దానికోసం యాంటీ ఏజింగ్ క్రీంలను కూడా ఉపయోగించడం సహజం. ఇలాంటి వారికి కాఫీ మంచి యాంటీ ఏజింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. దీనికోసం మనం చేయాల్సిందల్లా.. రెండు కప్పుల కాఫీ గింజలకు ఒక కప్పు నీటిని, కొన్ని చుక్కలు టీట్రీ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లెండర్‌తో బాగా కలిపి, బ్రష్‌తో ముఖానికి రాసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు చర్మం మీద పేరుకున్న మృతకణాలను కూడా తొలగిస్తుంది.

కళ్ల విషయంలో..

నిద్ర తక్కువ కావడం, ఒత్తిడికి లోనవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు వస్తూ ఉంటాయి. వాటి కోసం సహజమైన ఉత్పత్తులతో పాటు మార్కెట్లో దొరికే వాటిని కూడా వాడుతూ ఉంటాం. అయితే వాటికి బదులు ఒకసారి కాఫీపొడిని ప్రయత్నించి చూస్తే ఫలితం మీకే తెలుస్తుంది. కాఫీలో ఉన్న ఔషధ గుణాలు ఒత్తిడిని తగ్గించడంతో పాటు, నిద్ర లేకపోవడం వల్ల అలసటకు గురైన కళ్లను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తాయి. అలాగే కళ్ల కింద వచ్చే నల్లటి వలయాలను తగ్గించుకోవడానికి మనం ఉపయోగించే క్రీంలో మెత్తగా ఉండే కాఫీపొడి కొద్దిమొత్తంలో కలిపి రాసుకోవాలి. ఫలితం మీకే తెలుస్తుంది. అయితే ఎప్పుడూ కాఫీ పొడిని నేరుగా మాత్రం కళ్ల కింద రాసుకోకూడదు.

కురుల ఆరోగ్యాన్ని పెంచేలా..

జుట్టును సంరక్షించుకోవడానికి మనం అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తుంటాం. మరి కాఫీ వల్ల జుట్టుకి కలిగే ప్రయోజనమేంటి అనుకుంటున్నారా? ఇది మంచి కండిషనర్‌గా పనిచేసి జుట్టును మృదువుగా అయ్యేలా చేస్తుంది. దీనికోసం కాఫీపొడిని నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత దీనిని ఒక గిన్నెలోకి వడపోయాలి. ఈ నీటిని జుట్టుకు అప్త్లె చేసి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. కాఫీపొడి జుట్టుకు కలరింగ్ ఏజెంట్‌లా కూడా పనిచేస్తుంది.

చూశారుగా.. కాఫీ పొడి/గింజల వల్ల ఎన్ని సౌందర్యపరమైన ప్రయోజనాలున్నాయో! మీరు కూడా వీటిని ప్రయత్నిస్తారు కదూ..! అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే కాఫీ డికాషన్ దిగిన తర్వాత అడుగున మిగిలిపోయే పొడిని కూడా పైన చెప్పిన రీతిలో ఉపయోగించవచ్చు.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం