గర్భిణులకు కరోనా వ్యాక్సిన్.. మార్గదర్శకాలివే! - centre issues operational guidelines for vaccinating pregnant women against covid-19
close
Published : 11/07/2021 12:25 IST

గర్భిణులకు కరోనా వ్యాక్సిన్.. మార్గదర్శకాలివే!

మొన్నటిదాకానేమో గర్భిణులకు కూడా టీకా వస్తే బాగుండేది అనుకున్నాం.. తీరా వచ్చాక ఇది వేయించుకోవడం మంచిదో, కాదోనన్న సందేహం చాలామంది కాబోయే తల్లుల్లో నెలకొంది. ఒకవేళ వ్యాక్సిన్‌ తీసుకుంటే లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లవుతుందేమో, పుట్టబోయే బిడ్డకు ఏమవుతుందో ఏమోనన్న భయమే దీనికి ప్రధాన కారణం. అయితే టీకా తీసుకోని గర్భిణుల కంటే తీసుకున్న గర్భిణులు వైరస్‌ ముప్పును చాలావరకు తప్పించుకోవచ్చని చెబుతోంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ క్రమంలో కడుపుతో ఉన్న మహిళలు వ్యాక్సిన్‌ ఎందుకు వేయించుకోవాలి? ఈ క్రమంలో ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయి? వైరస్‌ గర్భిణులపై ఎలా ప్రభావం చూపుతుంది? వంటి విషయాల గురించి తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అవేంటో తెలుసుకుందాం రండి..

 

వ్యాక్సిన్‌ వజ్రాయుధం!

* వైరస్‌ బారిన పడిన గర్భిణుల్లో చాలామందికి లక్షణాలు కనిపించట్లేదు.. మరికొంతమందిలో స్వల్ప లక్షణాలుంటున్నాయి. అలాగని దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే గర్భిణుల ఆరోగ్యం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. వైరస్‌ ప్రభావంతో ఒక్కోసారి వారి ఆరోగ్యం క్షీణించచ్చు.. అంతేకాదు.. కడుపులో ఉన్న బిడ్డ పైనా దీని ప్రభావం పడచ్చు. అందుకే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో తమను తాము కాపాడుకోవడం చాలా ముఖ్యం. కరోనా టీకా తీసుకోవడం కూడా అందులో ఓ భాగమే!

* ప్రెగ్నెన్సీ కొవిడ్‌ ముప్పును పెంచదు. అయితే సాధారణ మహిళలతో పోల్చితే కొంతమంది గర్భిణులు వైరస్‌ కారణంగా తీవ్ర అనారోగ్యాల్ని ఎదుర్కొంటున్నట్లు కొన్ని ఆధారాలు రుజువు చేస్తున్నాయి.

* కొవిడ్‌ సోకిన గర్భిణుల్లో నెలలు నిండక ముందే బిడ్డ పుట్టే అవకాశాలు ఎక్కువ! దీంతో సి-సెక్షన్‌ డెలివరీ కావడం, పుట్టే బిడ్డ బరువు బాగా తక్కువగా ఉండడం.. వంటివి జరగచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డ కడుపులో ఉండగానే లేదంటే డెలివరీ సమయంలో చనిపోయే ప్రమాదమూ లేకపోలేదు.

* గర్భిణులకు కొవిడ్‌ టీకా సురక్షితమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ముఖ్యంగా వైరస్‌కి అధికంగా ఎక్స్‌పోజ్‌ అయ్యే వారు, ఒకటి కంటే ఎక్కువ అనారోగ్యాలున్న గర్భిణులకు టీకా మంచిదని చెబుతోంది.. కాబట్టి ఇలాంటి గర్భిణులందరూ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలంటోంది.

 

ముప్పు ఎవరికి ఎక్కువ?!

* వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందితో పాటు అత్యవసర విభాగాల్లో (ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌) పని చేసే గర్భిణులు..

* ఎక్కువమంది ఉన్న చోట విధులు నిర్వర్తించేవారు..

* తరచూ బయటి వ్యక్తుల్ని కలవాల్సి వచ్చేవారు..

* ఇంటా బయటా ఒకేచోట ఎక్కువమంది ఉండి.. సామాజిక దూరం పాటించడానికి వీల్లేని వారు..

* 35, అంతకంటే ఎక్కువ వయసులో గర్భం దాల్చిన మహిళలు..

* బీఎంఐ ఎక్కువగా ఉన్నవారు, డయాబెటిస్‌, అవయవ మార్పిడి చేయించుకున్న వారు, COPD, Asthma, Cystic Fibrosis.. వంటి దీర్ఘకాలిక శ్వాస సంబంధిత సమస్యలున్న వారు, Immuno suppression Therapies (రోగనిరోధక శక్తిని తగ్గించే చికిత్స) తీసుకుంటున్న వారు, దీర్ఘకాలిక కిడ్నీ-గుండె సంబంధిత సమస్యలతో బాధపడే గర్భిణులపై వైరస్‌ ముప్పు తీవ్రంగా ఉంటుంది.

కాబట్టి ఇలాంటి గర్భిణులు టీకా వేసుకోవడం అత్యవసరం. అయితే ఇప్పటికే కొవిడ్‌ బారిన పడి కోలుకున్న గర్భిణులు.. ప్రసవం తర్వాత టీకా తీసుకోవచ్చు. అలాగే బాలింతలు/పాలిచ్చే తల్లులు కూడా కొవిడ్‌ టీకా వేయించుకోవాలి.

 

గర్భిణులపై కరోనా ప్రభావం ఇలా!

* వైరస్‌ బారిన పడిన గర్భిణుల్లో.. 90, అంతకంటే ఎక్కువ శాతం మంది ఆస్పత్రి అవసరం లేకుండానే కోలుకుంటున్నారు. అతి తక్కువమందిలోనే వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంటోంది.

* వైరస్‌ లక్షణాలు కనిపించిన గర్భిణుల్లో.. కొంతమందిలో వ్యాధి తీవ్రత అధికంగా ఉంటోంది.

* వైరస్ లక్షణాలు లేని గర్భిణులతో పోల్చితే లక్షణాలతో వైరస్‌ బయటపడిన గర్భిణుల్లో కొంతమంది ఐసీయూలో చేరాల్సి రావడం, నెలలు నిండక ముందే కాన్పు కావడం, రక్తపోటు పెరిగిపోవడం.. వంటి ప్రమాదకర సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

* ఇక కడుపుతో ఉన్నప్పుడు కరోనా బారిన పడిన వారిలో 95, అంతకంటే ఎక్కువ శాతం మంది మహిళలు ఆరోగ్యవంతులైన బిడ్డలకు జన్మనిస్తున్నారు. అయితే కొన్ని కేసుల్లో నెలలు నిండకుండానే జన్మించిన శిశువులకు కొన్నాళ్ల పాటు ఇంక్యుబేటర్‌ (నియోనాటల్‌ కేర్‌) అవసరం రావచ్చు.

 

ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

* అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. అందరిలాగే వ్యాక్సిన్‌ తీసుకున్న గర్భిణుల్లోనూ స్వల్ప దుష్ప్రభావాలు కనిపించే అవకాశాలే ఎక్కువ. ఈ క్రమంలో తేలికపాటి జ్వరం, టీకా తీసుకున్న చోట నొప్పి, మొదటి మూడు రోజులు నీరసంగా అనిపించడం.. వంటివి సర్వసాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే టీకా వల్ల ఇటు తల్లికి గానీ, అటు గర్భంలో ఉన్న బిడ్డకు గానీ ఇతర దీర్ఘకాలిక దుష్ప్రభావాలు తలెత్తినట్లు ఎక్కడా ఆధారాలు లేవు.

* చాలా అరుదుగా.. అంటే దాదాపు లక్ష నుంచి ఐదు లక్షల మందిలో ఒకరికి టీకా తీసుకున్న 20 రోజుల్లోపు ఈ కింది లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. అవేంటో తెలుసుకొని అలర్ట్‌గా ఉండడం మంచిది.

- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం

- ఛాతీలో నొప్పి

- చేయి/కాల్లో నొప్పి, ఒత్తిడిగా అనిపించడం, వాపు రావడం

- టీకా ఇచ్చిన చోట గుండు సూదంత ఎర్రటి మచ్చలా ఏర్పడడం

- పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి (ఈ క్రమంలో వాంతులవ్వచ్చు/కాకపోవచ్చు)

- గత వైద్య చరిత్రతో సంబంధం లేకుండా సీజర్స్‌ (ఫిట్స్‌) రావచ్చు.. (ఈ క్రమంలో వాంతులవ్వచ్చు/కాకపోవచ్చు)

- గతంలో మైగ్రెయిన్‌/దీర్ఘకాలిక తలనొప్పి.. వంటి సమస్యలతో సంబంధం లేకుండా.. ఇప్పుడు దీర్ఘకాలిక తలనొప్పి వేధించడం (ఈ క్రమంలో వాంతులవ్వచ్చు/కాకపోవచ్చు)

- శరీరం ఒకవైపు బలహీనంగా మారిపోయి పక్షవాతం రావడం

- అకారణంగా వాంతులవడం

- చూపు మందగించడం/కళ్లు నొప్పిగా అనిపించడం..

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించి.. సకాలంలో వైద్య చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు.

సో.. ఇదంతా చదువుతుంటే వైరస్‌ బారిన పడకూడదంటే గర్భిణులూ టీకా తీసుకోవాలన్న విషయం అర్థమవుతోంది కదూ.. కాబట్టి మీ గైనకాలజిస్ట్‌ని ఓసారి సంప్రదించి త్వరగా టీకా తీసుకుంటే.. పొంచి ఉన్న మూడో దశ వైరస్‌ ముప్పు నుంచి చాలావరకు తప్పించుకోవచ్చు..!

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని