బరువు తగ్గించే బూడిద గుమ్మడి! - health benefits of ash gourd in telugu
close
Published : 23/07/2021 16:55 IST

బరువు తగ్గించే బూడిద గుమ్మడి!

బూడిద గుమ్మడికాయ.. ఏ దిష్టి తగలకూడదని చాలామంది తమ ఇళ్ల గుమ్మాలకు వీటిని వేలాడదీస్తుంటారు. మరికొందరు దీంతో వివిధ రకాల వంటకాలు చేసుకుంటుంటారు. అయితే దీన్ని తరచుగా తినే వారు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారని చెప్పచ్చు. కానీ ఇలా అప్పుడప్పుడూ కాకుండా.. రోజూ బూడిద గుమ్మడిని ఆహారంలో చేర్చుకోమంటున్నారు నిపుణులు. తద్వారా ఇందులోని బోలెడన్ని ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. నీటి శాతం అధికంగా ఉండే దీన్ని తీసుకోవడం వల్ల అధిక బరువుతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలకు సైతం చెక్‌ పెట్టచ్చట!

ఆయుర్వేద మందుల్లోనూ!

‘వింటర్‌ మిలన్‌’, ‘చైనీస్‌ వాటర్‌ మిలన్‌’, ‘వ్యాక్స్‌ గార్డ్‌’, ‘సఫేద్‌ కద్దూ’.. ఇలా వివిధ పేర్లతో పిలిచే బూడిద గుమ్మడికాయలో ఔషధ గుణాలతో పాటు ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి. అందుకే దీన్ని గత కొన్ని శతాబ్దాలుగా చైనీయులు తమ సంప్రదాయ వైద్యం, ఆయుర్వేదిక్‌ మందుల్లో విరివిగా వాడుతున్నారట. మరి ఈ కాయలో ఉండే ఆ ఔషధ గుణాలు, పోషకాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

ఇమ్యూనిటీ పెంచుతుంది!

* బూడిద గుమ్మడికాయలో క్యాలరీలు అతి తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల కాయ నుంచి శరీరానికి అందేవి కేవలం 13 క్యాలరీలే.

* పుచ్చకాయ లాగే ఇందులో కూడా నీటిస్థాయులు అధికంగా ఉంటాయి. సుమారు 96 శాతం నీటితో నిండి ఉండే గుమ్మడి డీహైడ్రేషన్‌ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో శక్తి స్థాయుల్ని సైతం పెంచుతుంది.

* ఫైబర్‌ పుష్కలంగా ఉండడం వల్ల కడుపులో మంట, ఉబ్బరం, మలబద్ధకం లాంటి జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

* శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపించే డీటాక్సిఫై ఏజెంట్‌గా ఇది పనిచేస్తుంది.

* బూడిద గుమ్మడిలోని విటమిన్‌-సి, నియాసిన్‌, థయామిన్‌, రైబోఫ్లేవిన్‌.. లాంటి విటమిన్లు.. ఐరన్‌, పొటాషియం, జింక్‌, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి.

* కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కూడా దీనిలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.

* ఇది గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

* మెదడు పనితీరును మెరుగుపరచుకోవాలంటే దీనిని తరచుగా డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* వీటి గింజల్లో కూడా బోలెడన్ని ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే వీటిని వివిధ మందులు, చర్మ సంరక్షణ నూనెల తయారీలోనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

కూరలు, సూప్‌లు, సలాడ్లు, జ్యూస్‌లు, స్మూతీలు.. ఇలా ఏ విధంగానైనా బూడిద గుమ్మడిని ఆహారంలో చేర్చుకోవచ్చు. ఈ సందర్భంగా తమిళులకు బాగా ఇష్టమైన గుమ్మడికాయ కూటు వంటకాన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి.

 

గుమ్మడికాయ కూటు

కావాల్సిన పదార్థాలు

* బూడిద గుమ్మడి కాయలు - 750 గ్రాములు

* పసుపు- పావు టీస్పూన్‌

* ఉప్పు- రుచికి సరిపడినంత

మసాలా పేస్ట్‌ కోసం కావాల్సినవి

* తురిమిన కొబ్బరి - అర కప్పు

* జీలకర్ర – టేబుల్‌ స్పూన్‌

* పచ్చి మిర్చి- 4

* నల్ల మిరియాలు - ఒక టీస్పూన్‌

* బియ్యం - ఒకటిన్నర టీస్పూన్‌

తాలింపు కోసం కావాల్సినవి

* ఆవాలు- ఒక టీస్పూన్‌

* ఎండు మిరపకాయలు- 2

* మినపగుండ్లు - ఒక టీస్పూన్‌

* కరివేపాకు- 10 నుంచి 12 రెబ్బలు

* ఇంగువ- పావు టీస్పూన్‌

* నువ్వుల నూనె- 2 టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం

గింజలు తీసిన బూడిద గుమ్మడిని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. మసాలా పేస్ట్‌ కోసం సిద్ధం చేసిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు రెండు కప్పుల నీళ్లలో గుమ్మడికాయ ముక్కలను బాగా ఉడికించాలి. అనంతరం అందులో ఉప్పు, పసుపు వేయాలి. కొద్ది సేపయ్యాక మసాలా పేస్ట్‌ను కూడా జతచేసి బాగా కలపాలి. ఇప్పుడు వేరొక ప్యాన్‌లో నూనె పోసి పైన చెప్పిన పదార్థాలతో తాలింపు వేస్తే రుచికరమైన గుమ్మడికాయ కూటు రడీ!

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని