మీరు స్వేచ్ఛగా, స్వతంత్రంగానే జీవిస్తున్నారా? - how to be independent in telugu
close
Published : 15/08/2021 09:29 IST

మీరు స్వేచ్ఛగా, స్వతంత్రంగానే జీవిస్తున్నారా?

ప్రతి మనిషి స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధించినట్లు. ప్రత్యేకించి మహిళల విషయానికొస్తే ప్రస్తుతం పురుషులతో సమానంగా స్త్రీలు కూడా సంపాదిస్తున్నారు. అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వారికి వారు స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అయితే డబ్బు, కెరీర్... ఇలాంటి వాటిలోనే కాదు.. జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ స్వతంత్రంగా జీవించగలిగితేనే మనం కోరుకునే సంతృప్తి లభిస్తుంది. ఈ క్రమంలో స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవించడానికి దోహదపడే కొన్ని అంశాలేంటో ఒక్కసారి చూద్దాం...

ఆత్మవిశ్వాసంతో ముందుకు..

ఏ విషయంలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మన సొంతమవుతుందనే విషయం తెలిసిందే. అయితే కొన్ని విషయాల్లో లోపల ఏదో భయం, బెరుకు మనల్ని వెంటాడుతూ స్వేచ్ఛగా జీవించకుండా అడ్డుపడుతూ ఉంటుంది. ఉదాహరణకు.. మీకు పాటలంటే చాలా ఇష్టం.. మీ గొంతు కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది. కానీ స్టేజి మీద పాడమంటే మాత్రం చాలా భయం. దీని వల్ల మీకున్న అవకాశాలను కోల్పోవడమే కాదు.. మీలోని ప్రతిభను నలుగురికీ చూపే అవకాశాన్నీ చేజార్చుకుంటారు. దీనికి బదులుగా కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతే విజయం మీ వెంటే ఉంటుంది. అయితే దారిలో అపజయాలు ఎదురైనా సరే మనోధైర్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. దీనివల్ల స్వేచ్ఛగా మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నామో అవన్నీ చేసే అవకాశం మనకు లభిస్తుంది.

ఆర్థిక స్వేచ్ఛ..

మీరు నిజంగా ఎవరిమీదా ఆధారపడకుండా.. స్వతంత్రంగా జీవించాలంటే మీ సంపాదన మీకే ఉండాలి. అయితే సంపాదించే డబ్బును విచ్చలవిడిగా కాకుండా అవసరమున్న సందర్భాల్లో ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. అంతేగానీ మా డబ్బు.. మా ఇష్టం.. దేనికైనా ఖర్చు పెట్టుకుంటామంటే.. భవిష్యత్తు అవసరాలకు డబ్బు మిగలదు. దీనివల్ల ఇతరులపై ఆధారపడే పరిస్థితులు ఎదురుకావచ్చు. ఇలా ఇతరుల మీద ఆధారపడటం వల్ల మనకు స్వాతంత్య్రం లేకుండా పోయే సందర్భాలు కూడా ఎదురవుతాయి. అందుకే ఎవరిమీదా ఆధారపడకుండా మన భవిష్యత్తుకు తగ్గట్టుగా మనమే ప్లాన్ చేసుకొని పొదుపు చేస్తే ఆర్థికంగానూ ఎవరిమీదా ఆధారపడకుండా స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో జీవించగలుగుతాం.

మాట్లాడే స్వేచ్ఛ

అందరితో మనసులోని భావాలను స్వేచ్ఛగా వెల్లడించే గుణం అలవాటు చేసుకోవడం మంచిది. ఇతరులతో మాట్లాడటానికి భయపడితే మనలోని భావాలన్నీ లోపలే మిగిలిపోతాయి. అలా భావాలన్నీ గూడుకట్టుకొని మిగిలిపోయినప్పుడు జీవితంలో అసంతృప్తి మాత్రమే మిగులుతుంది. మీ జీవితం అలా కాకుండా ఉండాలంటే ఎంతమంది ముందైనా మీ మనసులోని మాట చెప్పడానికి వెనకడుగు వేయొద్దు. ఎదుటివారు మీకంటే వయసులోనో, హోదాలోనో పెద్దవారని భయపడాల్సిన అవసరం లేదు. మీ అభిప్రాయాలు తప్పు కానంత వరకూ మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇతరులు మీ మీద అభాండాలు వేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కూడా మర్చిపోవద్దు.

మీకు నచ్చిందే..

స్వతంత్రంగా బతకడానికి మంచి నడవడిక, విద్యాబుద్ధులు కూడా చాలా అవసరం. వీటివల్ల భవిష్యత్తుకు ఉపయోగపడే నైపుణ్యాలు అలవడతాయి. అలాగే ప్రపంచంలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్‌డేట్ చేసుకోవడమూ ముఖ్యమే. ఇవన్నీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు దోహదపడతాయి. అయితే చదువు, ఉద్యోగం విషయంలో వేరొకరి మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మనసు చెప్పిన రంగాన్ని ఎంచుకోవడం వల్ల ఆ వృత్తిలో మీరు ఉన్నత స్థానాలకు ఎదగగలుగుతారు. అలా కాకుండా ఎవరో చెప్పారని మీ కెరీర్‌ని ఎంచుకుంటే మీకు నచ్చని వృత్తిలో మిగిలిపోవాల్సి రావచ్చు..

 

మీరే బెస్ట్!

మీ మనసు స్వతంత్రంగా ఆలోచించాలంటే మిమ్మల్ని మీరు ఇంకొకరితో పోల్చుకోవడం మానేయాలి. ఒకరితో పోల్చుకుంటూ ఉండటం వల్ల వాళ్ల దగ్గర ఉన్నదాన్నే మనసు కోరుకుంటూ ఉంటుంది. జీవితంలో మీకు ఎందులో అసలైన ఆనందం లభిస్తుందో మీ మనసు మీకు సూచించలేకపోతుంది. అందుకే ప్రతి విషయంలోనూ మీరే బెస్ట్ అనుకోండి. ఇతరులతో పోల్చుకోవద్దు. నెగెటివ్ ఆలోచనలను మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వద్దు. ఇతరులతో పోలిక వల్ల అసూయ, ద్వేషం లాంటి నెగెటివ్ ఫీలింగ్స్‌కి మీరు దగ్గరవుతారు. అందుకే మీలో ఉన్న మంచి లక్షణాలను తెలుసుకోండి. ఏదైనా సందర్భంలో ఇతరులతో పోల్చుకున్నా దాన్ని నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా తీసుకొని వారిలోని మంచి గుణాలను మీరూ అలవర్చుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఉంటుంది.

 

శరీరం పట్ల శ్రద్ధ

ఇంకొకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం అవసరం. అలా ఉన్నప్పుడే మనం ఇంకొకరి మీద ఆధారపడకుండా జీవించగలుగుతాం. అందుకే ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మంచి ఆహారం తినడం, వేళకు పడుకోవడం.. ఇవన్నీ అలవాటు చేసుకోవాలి.

 

మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి!

అన్నింటికంటే ముఖ్యమైన సంగతి.. జీవితంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించాలనుకుంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీకు ఏం అవసరమో గుర్తించి, దాన్ని మీకు మీరే అందించుకోండి. మీ శరీరానికి ఆరోగ్యాన్నందించే అలవాట్లు చేసుకోండి. మీ మనసును మీరే ఇబ్బంది పెట్టకుండా నడుచుకోండి. ఈ క్రమంలో ఇతరులను గౌరవించి, వారిని ప్రేమించడమూ ముఖ్యమే.. అయితే దానికంటే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని