ఈ ఆసనంతో ఆక్సిజన్‌ స్థాయులు పెంచుకోవచ్చట! - mandira bedi suggests this yoga pose for boosting oxygen levels
close
Updated : 22/06/2021 19:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ఆసనంతో ఆక్సిజన్‌ స్థాయులు పెంచుకోవచ్చట!

కరోనా మహమ్మారి నేరుగా ఊపిరితిత్తుల పైనే దాడి చేస్తోంది.. దీంతో ఎంతోమందిలో ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోవడం, ఆస్పత్రి పాలవడం.. మనం చూస్తూనే ఉన్నాం. దీనికి తోడు తమకు ఏమవుతుందో ఏమోనన్న ఒత్తిడి, ఆందోళనలు వారిని మానసికంగానూ దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి కొవిడ్‌ సమస్యల్ని దూరం చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గముందంటోంది బాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ మందిరా బేడీ. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌.. వంటి విషయాల్లో ఎక్కువ దృష్టి సారించే ఈ ముద్దుగుమ్మ.. తాను పాటించే ఫిట్‌నెస్‌/హెల్దీ టిప్స్‌ని ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంటుంది. అలా తాజాగా తాను ఓ ఆసనం వేసిన చిన్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది మందిర. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆక్సిజన్‌ స్థాయుల్ని క్రమబద్ధీకరించుకోవడం/పెంచుకోవడం ఎంతో అవసరమని, అందుకోసం ఈ ఆసనం తోడ్పడుతుందంటూ క్యాప్షన్‌ పెట్టిందీ ఫిట్‌నెస్‌ బ్యూటీ. మరి, ఏంటా ఆసనం? తెలుసుకుందాం రండి..

వయసు పెరుగుతోన్నా తానింత ఫిట్‌గా, చలాకీగా ఉండడానికి నిత్యం చేసే వ్యాయామాలే కారణమంటూ తన వీడియోల ద్వారా చెప్పకనే చెబుతుంటుంది బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీ మందిర. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, అందం, ఫ్యాషన్‌.. ఇలా ప్రతి విషయంలోనూ తన అభిమానుల్లో స్ఫూర్తి నింపుతుంటుంది. ఈ క్రమంలో తన ఫిట్‌నెస్‌ టిప్స్‌, వాటి ద్వారా చేకూరే ప్రయోజనాల గురించి సైతం వివరిస్తుంటుంది. అలా ఇటీవలే మరో షార్ట్‌ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాలో పంచుకుందీ ముద్దుగుమ్మ. అందులో చక్రాసనం (బ్యాక్ బెండ్‌ యోగా పోజ్‌) వేసిన ఆమె.. దానివల్ల చేకూరే ప్రయోజనాల గురించి చిన్న క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

అన్నింటికీ ఒకే మందు!

కరోనా ప్రతి ఒక్కరినీ అటు శారీరకంగా, ఇటు మానసికంగా కుంగదీస్తోంది. దీంతో చాలామందిలో ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతున్నాయి.. ఇక వైరస్‌ సోకిన వారి ఊపిరితిత్తులపై ప్రతికూల ప్రభావం పడి క్రమంగా ఆక్సిజన్‌ స్థాయులు పడిపోతున్నాయి. ఇలాంటి వారు చక్రాసనం వేయడం వల్ల ఆక్సిజన్‌ స్థాయులు పెంచుకోవచ్చంటోంది మందిర.

‘ఆక్సిజన్‌ స్థాయులు పెంచుకోవాలన్నా, మానసిక ఆందోళనల్ని తగ్గించుకోవాలన్నా, వెన్నెముక-భుజాలను దృఢంగా మార్చుకోవాలన్నా.. ఇవన్నీ చక్రాసనంతోనే సాధ్యమవుతాయి..’ అంటూ క్యాప్షన్‌ పెట్టిందామె. సాధారణంగా ఆక్సిజన్‌ స్థాయులు 95-100 మధ్య ఉంటే ఆరోగ్యవంతులుగా, 91-94 మధ్య ఉన్న వారిని మోడరేట్‌గా, అంతకంటే దిగువకు పడిపోతే ప్రమాదకరంగా పరిగణిస్తున్నారు. అయితే మోడరేట్‌ దశలో ఉన్న వారు, ఇప్పటికే కరోనా నుంచి కోలుకొని ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని/ఆక్సిజన్‌ స్థాయుల్ని పెంచుకోవాలనుకునే వారికి ఈ వ్యాయామం చక్కగా ఉపయోగపడుతుందని తన పోస్ట్‌తో చెప్పకనే చెప్పిందీ బ్యూటిఫుల్‌ మామ్‌. ఈ క్రమంలో ఈ వ్యాయామం చేసే వారు బలవంతంగా కాకుండా, శరీరానికి సౌకర్యవంతంగా ఉంటేనే చేయాలి.. అది కూడా గతంలో యోగా ప్రాక్టీస్‌ ఉండి.. నిపుణుల సలహా తీసుకున్నాకే దీన్ని సాధన చేయడం మంచిది.

ఎలా చేయాలి?

* ముందుగా యోగా మ్యాట్‌పై వెల్లకిలా పడుకొని.. మోకాళ్లను మడిచి పాదాలను నేలకు ఆనించాలి.

* ఇప్పుడు చేతుల్ని వెనక్కి మడిచి (ఈ క్రమంలో చేతి వేళ్లు భుజాల వైపు చూసేలా ఉండాలి) తలకు ఇరువైపులా నేలకు తాకించాలి.

* ఆపై రెండు చేతుల్ని కిందికి నెడుతూ శరీర పైభాగాన్ని నెమ్మదిగా పైకి లేపాలి. ఇలా చేతులు నిటారుగా వచ్చేంత వరకు మీ శరీరాన్ని పైకి లేపాలి. ఈ భంగిమలో కేవలం కాళ్లు, చేతులు మాత్రమే నేలకు తాకి ఉంటాయి.. మిగతా శరీరమంతా గాల్లోనే ఉంటుంది. ఇది చూడ్డానికి ‘తిరగేసిన ‘U’ మాదిరిగా ఉంటుంది.

* ఈ భంగిమలో చేతులు, భుజాలు, కాళ్ల పైనే శరీర భారమంతా పడుతుంది. ఇలా ఈ పోజ్‌లో ఉన్నప్పుడు శ్వాస పైనే ధ్యాస పెట్టాలి. ఇలా 5-10 సార్లు శ్వాస తీసుకోవడం, వదలడం చేసేంత వరకు ఉండాలి.

* ఆ తర్వాత వెన్నెముకను నెమ్మదిగా కిందికి తీసుకొస్తూ నేలకు ఆనించాలి. ఆపై రెండు చేతుల్ని యథాస్థానానికి తీసుకురావాలి. ఇలా ఈ ఆసనం వేశాక కొన్ని నిమిషాల పాటు అలాగే యోగా మ్యాట్‌పై రిలాక్సవడం మంచిది.

ప్రయోజనాలెన్నో!

* వయసు పెరిగే కొద్దీ వెన్నెముక పటుత్వం కోల్పోవడం, తద్వారా శరీర పైభాగం వంగిపోవడం సహజమే! అయితే చక్రాసనం వేయడం వల్ల ఈ సమస్య రాదంటున్నారు నిపుణులు. ఇది వెన్నెముకకు చురుగ్గా కదిలే సామర్థ్యాన్ని (ఫ్లెక్సిబులిటీ) అందిస్తుంది. తద్వారా శరీర పైభాగం ముందుకు వంగిపోకుండా నిటారుగా ఉంటుంది.

* చక్రాసనం వేసే క్రమంలో పొట్ట కండరాలపై ఒత్తిడి పడుతుంది. తద్వారా ఆ భాగంలో పేరుకున్న అనవసర కొవ్వు కరిగిపోతుంది. తరచూ ఇది సాధన చేస్తే పొట్ట చుట్టూ కొవ్వు కరిగించుకొని నాజూకైన నడుమును సొంతం చేసుకోవచ్చు.

* ఈ ఆసనం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయులు పెరుగుతాయి. తద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

* చక్రాసనం వల్ల థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథులు ప్రేరేపితమవుతాయి. ఎండార్ఫిన్లు (హ్యాపీ హార్మోన్లు) విడుదలవుతాయి. ఫలితంగా మనలోని ఒత్తిడి, ఆందోళనలు మటుమాయమవుతాయి. దాంతో నాడీ వ్యవస్థ కూడా రిలాక్సవుతుంది.

* గుండె ఆరోగ్యానికి, శరీరంలో నిద్రాణమై ఉన్న శక్తిని మేల్కొల్పడానికి ఈ వ్యాయామం చక్కటి మార్గం.

* చక్రాసనం వేసే క్రమంలో చేతులు, భుజాలు, మణికట్టు, తొడ కండరాలు, పిరుదులపై ఒత్తిడి పడుతుంది. తద్వారా ఆయా భాగాల్లోని కండరాలకు వ్యాయామం అంది అవి దృఢంగా మారతాయి.

* జీర్ణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యానికీ ఈ ఆసనం మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.

వీళ్లు చేయొద్దు!

* వ్యాయామం అలవాటు లేని వారికి, యోగాసనాలు ఇప్పుడిప్పుడే సాధన చేస్తున్న వారికి (బిగినర్స్‌) ఇది కష్టమైన ఆసనమనే చెప్పాలి. అందుకే అలాంటి వారు వార్మప్‌ లేకుండా, నిపుణుల సలహా లేకుండా నేరుగా దీన్ని ప్రాక్టీస్‌ చేయకూడదు. ఒకవేళ బలవంతంగా చేస్తే గాయాలయ్యే ప్రమాదముంది.

* వెన్నెముకకు సంబంధించిన సమస్యలు, గాయాలు అయిన వారు; బీపీ సమస్యలున్న వారు; భుజాల్లో నొప్పి/గాయం ఉన్నట్లయితే.. అలాంటి వారు సైతం ఈ యోగాసనానికి దూరంగా ఉండాలి.

* గర్భిణులు, వయసు పైబడిన వారు ఈ ఆసనం అస్సలు వేయకూడదు.

* ఈ ఆసనంతో ఆక్సిజన్‌ స్థాయులు పెరగడం వాస్తవమే అయినా.. కరోనా నుంచి కోలుకునే బాధితులు శరీరాన్ని బలవంత పెట్టకుండా సౌకర్యవంతంగా అనిపిస్తేనే వ్యాయామం చేయాల్సి ఉంటుంది.. అది కూడా నిపుణులు, డాక్టర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తేనే!

* అలాగే ఆక్సిజన్‌ స్థాయులు మోడరేట్‌గా (91-94 మధ్య) ఉండి.. స్వల్ప లక్షణాలతో హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్న కొవిడ్‌ బాధితులు వారి శరీరం సహకరిస్తేనే ఈ ఆసనం వేయాలి. అది కూడా వైద్యుల సలహా మేరకే అని గుర్తుపెట్టుకోండి!


మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని