ఇలాంటప్పుడు బ్రేక్ తీసుకోవాల్సిందే! - reasons you need to take a break from career in telugu
close
Published : 03/10/2021 13:47 IST

ఇలాంటప్పుడు బ్రేక్ తీసుకోవాల్సిందే!

జీవితం, కెరీర్‌.. ఈ రెండూ తమకు రెండు కళ్లలాంటివి అంటున్నారు ఈతరం మహిళలు. అందుకే వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే ఎంత పకడ్బందీగా ప్లాన్‌ చేసుకున్నా.. కొన్ని కారణాల వల్ల ఒక్కో దశలో ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేయడం కుదరకపోవచ్చు.. అయినా అయిష్టంగానే ముందుకు సాగడం వల్ల దాని ప్రభావం ఇటు వ్యక్తిగత జీవితంపై, అటు కెరీర్‌పై.. రెండింటి పైనా పడుతుంది.. తద్వారా దేన్నీ పూర్తిగా ఆస్వాదించలేం. అదిగో అలాంటప్పుడే కెరీర్‌ నుంచి కాస్త బ్రేక్‌ తీసుకోమంటున్నారు నిపుణులు. ఈ విరామమే మనలో కొత్త ఉత్సాహాన్ని నింపి.. తిరిగి ఉద్యోగానికి మనల్ని సంసిద్ధం చేస్తుందని చెబుతున్నారు. మరి, ఇంతకీ ఎలాంటి సమయంలో కెరీర్‌ నుంచి కాస్త బ్రేక్‌ తీసుకోవడం అవసరమో తెలుసుకుందాం రండి..

కెరీరే జీవితం కాదు!

కెరీర్‌ అనేది జీవితంలో ఒక చిన్న భాగం.. అంతేకానీ అదే మన జీవితం అనుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. అయితే కొంతమంది మాత్రం రోజంతా ఆఫీస్‌లోనే గడిపి, ఇంటికొచ్చినా అదే పనిలో నిమగ్నమవుతుంటారు. ఏంటని అడిగితే.. వర్క్‌ బిజీ, అదనపు బాధ్యతలు అని చెబుతుంటారు. దానివల్ల వ్యక్తిగత జీవితానికి దూరం కావడం, కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరగడం, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. ఇలా మానసిక ప్రశాంతతే కరువవుతుంది. దీని ప్రభావం కెరీర్ పైనా పడుతుంది.. ఉత్పాదకత లోపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఎన్ని గంటలు పనిచేసినా వృథానే! కాబట్టి ఇలా అటు కెరీర్‌ను, ఇటు ఇంటిని బ్యాలన్స్‌ చేయలేకపోతే మాత్రం కొన్నాళ్లు కెరీర్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

ఈ క్రమంలో ఇన్నాళ్లూ పని పని అంటూ ఏం కోల్పోయారో, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎంతలా మిస్సయ్యారో.. అనే అంశాలపై దృష్టి సారించాలి. వాళ్లతో మరింత సమయం గడిపే ప్రయత్నం చేయాలి. వీలైతే విహార యాత్రలకూ ప్లాన్‌ చేసుకోవచ్చు. ఇలా మీకు కావాల్సినంత సమయం మీ వ్యక్తిగత జీవితానికి కేటాయిస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.. శరీరం పునరుత్తేజితమవుతుంది. ఇదే ఊపుతో తిరిగి అదే ఉద్యోగంలోనైనా చేరచ్చు.. వీల్లేకపోతే కొత్త ఉద్యోగాన్నైనా వెతుక్కోవచ్చు.. ఏది చేసినా విజయమే కానీ అపజయం ఉండదు.. కావాలంటే ప్రయత్నించి చూడండి!

ఆరోగ్య సమస్యలా?

శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉత్సాహంగా పనిచేయగలం. కానీ ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ పనులతో ప్రస్తుతం చాలామంది మహిళలు విపరీతమైన అలసటకు గురవుతున్నారు. కొంతమందైతే సమయం లేదనో, బయటి ఆహారం తీసుకోవడం వల్లనో లేనిపోని అనారోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారు. మధుమేహం, స్థూలకాయం, పీసీఓఎస్‌.. వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలూ మరికొంతమందిని వేధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కెరీర్‌ కంటే ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అందుకే ముందు ఆరోగ్యంపై దృష్టి పెట్టడంలో భాగంగా కొన్నాళ్లు కెరీర్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టమంటున్నారు. ఈ క్రమంలో మీ ఆరోగ్య సమస్యను బట్టి నిపుణుల్ని సంప్రదించి చక్కటి జీవన విధానం అలవర్చుకోవడం, పోషకాలున్న ఆహారం తీసుకోవడం.. వంటివి చేస్తే త్వరలోనే కోలుకోవచ్చు.. లేదంటే సమస్యనైనా అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఇక ఆపై రెట్టింపు ఉత్సాహంతో తిరిగి ఉద్యోగంలో కొనసాగచ్చు. అయితే ఆ తర్వాత కూడా ఈ ఆరోగ్య నియమాలు పాటించడం మాత్రం తప్పనిసరి అన్న విషయం గుర్తుపెట్టుకోండి.

ఇది మీ లక్ష్యం కానప్పుడు..!

కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఇతర కారణాలు/ఒత్తిళ్ల రీత్యా కొన్నిసార్లు నచ్చకపోయినా అదే ఉద్యోగంలో కొనసాగాల్సి రావచ్చు. దీనివల్ల పనిపై పూర్తి దృష్టి పెట్టలేం.. మరోవైపు అంతిమ లక్ష్యం వైపు అడుగులేద్దామంటే అంత సమయం ఉండకపోవచ్చు. మీరూ ఇదే డోలాయమానంలో ఊగిసలాడుతున్నారా? అయితే తప్పకపోయినా, కాస్త కష్టమైనా కొన్నాళ్లు కెరీర్‌కు బ్రేక్‌ ఇవ్వడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే మీ అంతిమ లక్ష్యం అది కానప్పుడు ఎన్నాళ్లు అందులో కొనసాగినా వృథానే! పైగా కెరీర్‌లోనూ అభివృద్ధి సాధించలేరు. కాబట్టి మరీ కుదరని పక్షంలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగమైనా చేస్తూ.. మీరు అనుకున్న కెరీర్‌పై దృష్టి సారించడం, లేదంటే పూర్తిగా మీ లక్ష్యంపై ఏకాగ్రత పెట్టడం.. వంటివి చేస్తే తప్పకుండా సక్సెసవుతారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతారు.

ప్రోత్సాహం కరువైందా?

మహిళలు ఇంటా, బయటా రాణించాలన్నా; వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోవాలన్నా.. ఇటు కుటుంబం, అటు సంస్థలు తమ తోడ్పాటునందించాలి. అయితే చాలా కుటుంబాలు ఈ విషయంలో వెనకబడిపోతున్నాయనే చెప్పాలి. అందుకు మహిళలు ఎంచుకున్న కెరీర్‌, సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు, కుటుంబ కట్టుబాట్లు.. ఇలాంటి కారణాలు వారి కెరీర్‌ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయి. నిజానికి వారి చుట్టూ ఉన్న ఇలాంటి నిరుత్సాహకరమైన వాతావరణమే వారిని వెనక్కి లాగుతుందని చెప్పాలి. అయితే వీటిని అధిగమిస్తూ విజయవంతంగా ముందుకు సాగితే సరేసరి.. లేదంటే మాత్రం కొన్నాళ్ల పాటు కెరీర్‌ నుంచి విరామం తీసుకొని ఆయా అంశాలపై దృష్టి పెట్టడం మంచిది. ఒకవేళ కుటుంబ సభ్యులే మీ అభివృద్ధికి అడ్డుపడుతుంటే.. ఈ బ్రేక్‌ టైమ్‌లో వారికి నచ్చజెప్పి ఒప్పించే ప్రయత్నం చేయచ్చు.. మీరు కూడా ఉద్యోగం చేయడం కుటుంబానికి ఎంత ప్రయోజనకరమో వారికి వివరించండి. ఇలా మీ మాటలు వారిలో తప్పకుండా మార్పు తీసుకొస్తాయి. తద్వారా ఏ ప్రోత్సాహమైతే మీరు కరువైందనుకున్నారో.. అది అంది మీరు రెట్టింపు ఉత్సాహంతో మీరు అనుకున్న లక్ష్యం వైపు దూసుకెళ్లగలుగుతారు. అయితే ఇలా చుట్టూ ఉన్న వాళ్ల ప్రోత్సాహమే కాదు.. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగడం కూడా ఇక్కడ ముఖ్యమే!

ఇలా మీ మీ సమస్యలను బట్టి కెరీర్‌ నుంచి కొన్నాళ్ల పాటు విరామం తీసుకొని.. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి ఉద్యోగంలో కొనసాగచ్చు. అయితే అందరికీ ఇలాంటి వెసులుబాటు ఉండచ్చు.. ఉండకపోవచ్చు..! అలాంటప్పుడు విరామ సమయం తగ్గించుకోవడం, పార్ట్‌టైమ్‌ ఉద్యోగం వంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించడం.. వంటివి చేస్తే ఇక మీకు తిరుగుండదు.


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని