తీసిన తల్లి పాలను ఎలా భద్రపరచాలో మీకు తెలుసా?! - take these precautions while expressing and storing breast milk
close
Updated : 06/08/2021 16:31 IST

తీసిన తల్లి పాలను ఎలా భద్రపరచాలో మీకు తెలుసా?!

ఆరు నెలల దాకా తల్లి పాలే పిల్లలకు అన్నం, నీళ్లు.. అన్నీ! వీటి ద్వారానే పసివారికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఇలాంటి అమృతధారలు చిన్నారులకు అందాలన్న ముఖ్యోద్దేశంతోనే చాలా దేశాల్లో కొత్తగా తల్లైన మహిళలకు కనీసం ఆరు నెలల పాటు ప్రసవానంతర సెలవులు అందిస్తోన్న విషయం తెలిసిందే! అలాగని ఆరు నెలలే తల్లులు పాలివ్వాలన్న రూలేమీ లేదు. కొంతమంది ఏడాది పాటు, మరికొందరు రెండేళ్ల దాకా తమ చిన్నారులకు తల్లి పాలు పడుతూనే ఉంటారు. ఈ క్రమంలో ఇంట్లో ఉండే తల్లులకైతే ఏ ఇబ్బందీ ఉండదు. అదే వృత్తి ఉద్యోగాల్లో కొనసాగే వారు నిరంతరాయంగా తమ పిల్లలకు పాలివ్వాలంటే కష్టమే! ఈ ఉద్దేశంతోనే తల్లిపాలను భద్రపరిచే పద్ధతి ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఇలా తల్లి రొమ్ము నుంచి సేకరించిన పాలను భద్రపరచడం, వాటిని తిరిగి పిల్లలకు పట్టించడం.. వంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ. అప్పుడే ముందస్తుగా భద్రపరిచినా అందులోని పోషకాలన్నీ చిన్నారులకు చక్కగా అందుతాయని చెబుతోంది. మరి, ఇంతకీ ఏంటా జాగ్రత్తలు? తెలుసుకుందాం రండి...

ఉద్యోగం చేసే అమ్మలు ప్రసవానంతర సెలవుల్లో ఇంటి పట్టునే ఉండి చిన్నారి ఆలనా పాలనా చూసుకున్నప్పటికీ.. ఆ తర్వాత తిరిగి విధులకు వెళ్లాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు డ్యూటీకి వెళ్లే ముందే తల్లి తన రొమ్ము నుంచి పాలను సేకరించి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిస్తే.. ఆ చిన్నారిని చూసుకునే కుటుంబ సభ్యులు నిర్ణీత వేళల్లో ఆ పాలను వారికి పట్టిస్తుంటారు. అయితే అలా ముందుగానే పిండిన పాలను పిల్లలకు తాగించడం శ్రేయస్కరమేనా? ఫ్రిజ్‌లో పెడితే అవి చల్లబడతాయి కదా.. తాగించే ముందు వాటిని వేడి చేయాలా? ఇలాంటి సందేహాలు చాలామంది అమ్మల్లో కలుగుతుంటాయి. వీటన్నింటినీ నివృత్తి చేసేందుకు కొన్ని మార్గదర్శకాల్ని సూచిస్తోంది సీడీసీ.

పాలు ఇలా సేకరించాలి!

* తల్లులు తమ రొమ్ముల నుంచి పాలు సేకరించే ముందు చేతుల్ని సబ్బు-నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఒకవేళ సబ్బు అందుబాటులో లేని పక్షంలో (ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో పాలు పిండాల్సి వస్తే..) 60 శాతం ఆల్కహాల్‌ కలిగి ఉన్న హ్యాండ్‌ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి.

* చేతులతో లేదా మ్యాన్యువల్‌/ఎలక్ట్రిక్‌ బ్రెస్ట్ పంపుతో..  ఇలా పాలు తీయడానికి మీకు సౌకర్యవంతంగా అనిపించిన పద్ధతిని పాటించచ్చు.

* అయితే ఈ క్రమంలో ఉపయోగించే బ్రెస్ట్‌ పంప్‌ కిట్‌ని ముందుగానే వేడి నీటితో శుభ్రం చేసి పెట్టుకోవడం ముఖ్యం.

* పాలు సేకరించిన వెంటనే పాల డబ్బాకు అనుసంధానమై ఉన్న ట్యూబ్స్‌ అన్నీ తొలగించి డబ్బాను గాలి చొరబడని మూతతో మూసేయాలి. లేదంటే అందులోకి గాలి చొరబడే అవకాశం ఉంది. పాలు తాగినప్పుడు చిన్నారి శరీరంలోకి ఈ గాలి ప్రవేశించి గ్యాస్ట్రిక్‌ సమస్యలకు కారణమవుతుంది.

 

‘భద్రం’గా భద్రపరచాలి!

* పాలు సేకరించడమే కాదు.. వాటిని భద్రపరచడమూ ముఖ్యమే. ఈ క్రమంలో ప్రత్యేకమైన మిల్క్‌ స్టోరేజ్‌ బ్యాగ్స్‌ మార్కెట్లో దొరుకుతాయి. వాటినైనా ఉపయోగించచ్చు. లేదంటే ఇంట్లో ఉండే గ్లాస్‌ జార్లు, మందపాటి ప్లాస్టిక్‌ జార్లు.. వంటివి ఉపయోగించచ్చు. అయితే వీటి మూత గాలి చొరబడనంత బిగుతుగా ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకోండి.

* అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. పాలు భద్రపరచడానికి రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌ కంటెయినర్స్‌ అస్సలు వాడకూడదు. ఎందుకంటే వాటిలో BPA (Bisphenol A) అనే రసాయనిక సమ్మేళనం ఉంటుంది. అది పసి వారి ఆరోగ్యానికి చేటు చేస్తుంది.

* తిరిగి ఉపయోగించడం కుదరని (డిస్పోజబుల్‌) బాటిల్‌ లైనర్స్‌, ప్లాస్టిక్ బ్యాగుల్లో ఈ పాలను అస్సలు నిల్వ చేయకూడదు.

* తల్లి రొమ్ము నుంచి తాజాగా సేకరించిన పాలను గది ఉష్ణోగ్రత వద్ద సుమారు నాలుగు గంటల పాటు ఉంచచ్చు. అదే రిఫ్రిజిరేటర్‌లో అయితే నాలుగు రోజుల పాటు.. ఫ్రీజర్‌లో అయితే ఆరు నెలల పాటు తాజాగా ఉంటాయి.

* అయితే ఈ పాలు ఫ్రీజర్‌లో 12 నెలల పాటు భద్రంగా ఉంటాయని కొంతమంది నిపుణులు చెబుతుంటారు. అయితే అది ఎంతవరకు సురక్షితమన్నది చెప్పలేం. కాబట్టి పిండిన పాలను సాధ్యమైనంత త్వరగా (రోజుల వ్యవధిలోనే) పిల్లలకు పట్టించడం మంచిది.

* కొన్ని రోజులు పాటు నిల్వ ఉంచిన పాలను అసలు ఎప్పుడు పిండామో మనకు గుర్తుండకపోవచ్చు. అలాంటప్పుడు నిల్వ చేసే ముందే ఆ బాటిల్‌/ప్యాకెట్‌పై ఫలానా తేదీ అని రాసిన ఓ లేబుల్‌ని అంటిస్తే సరిపోతుంది.

* సాధారణ రిఫ్రిజిరేటర్‌లో అయినా, ఫ్రీజర్‌లో అయినా తలుపు వద్దే/తలుపుకి ఉండే ర్యాక్స్‌లో ఈ పాలను నిల్వ చేయకూడదు. ఎందుకంటే మనం తలుపు తీయడం, వేయడం వల్ల ఉష్ణోగ్రతల్లో మార్పులు రావచ్చు. వాటి ప్రభావం పాలపై పడచ్చు. కాబట్టి ఫ్రీజర్‌ మధ్యలో కాస్త వెనక వైపుగా వీటిని నిల్వ చేస్తే అక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. తద్వారా పాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

* ఒకవేళ మీరు అత్యవసర పరిస్థితుల్లో ఊరెళ్లాలనుకున్నప్పుడు కూడా పిండిన పాలను జాగ్రత్తగా భద్రపరిచి తీసుకెళ్లచ్చు. అదెలాగంటే.. పాలు పోసిన బాటిల్స్‌/ప్యాకెట్స్‌ని ఇన్సులేటెడ్‌ కూలర్‌ బ్యాగ్‌లో ఐస్‌ప్యాక్స్‌ మధ్యలో పెట్టి మీతో పాటు క్యారీ చేయచ్చు. ఇలాంటి పాలు సుమారు 24 గంటల పాటు తాజాగా ఉంటాయి.

 

మోతాదుకు మించి వద్దు!

* మీ చిన్నారి ప్రతిసారీ ఎన్ని పాలు తాగుతుందో మీకు ఒక అవగాహన ఉండి ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి నిర్ణీత వ్యవధుల్లో పట్టాల్సిన పాలను వేర్వేరు బ్యాగ్స్‌/బాటిల్స్‌లో నిల్వ చేయడం వల్ల ఒక్కోసారి ఒక్కో బాటిల్‌ని తీసి నేరుగా ఉపయోగించచ్చు. ఇలా చేయడం వల్ల పాలు కూడా వృథా కావు.

* అలాగే పాలు పిండేటప్పుడు బాటిల్‌ నిండుగా కాకుండా దానిపై సూచించిన ఆఖరి గీత (పై వైపున) వరకు మాత్రమే పిండాలి. ఎందుకంటే ఈ పాలు చల్లబడినప్పుడు కొద్దిగా వ్యాకోచం చెందే గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి బాటిల్‌లో కాస్త ఖాళీ వదిలితే పాలు లీక్‌ కాకుండా జాగ్రత్తపడచ్చు.

 

వేడి చేయచ్చా?!

* ‘ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ అవుట్‌’.. ఈ పద్ధతి ఫ్రిజ్‌లో నిల్వ చేసిన తల్లిపాలకూ వర్తిస్తుంది. అంటే ముందుగా పిండిన పాలను మొదట ఉపయోగించాలన్నమాట!

* ఫ్రిజ్‌/ఫ్రీజర్‌లో నిల్వ చేసిన పాలను వేడి చేయచ్చు. అయితే అందుకూ ఓ పద్ధతుంది.

- ముందుగా ఆ పాలను ఫ్రీజర్‌లో నుంచి తీసి సాధారణ ఫ్రిజ్‌లో ఒక రాత్రంతా ఉంచాలి.

- ఇప్పుడు బాటిల్‌/ప్యాకెట్‌లో ఉన్న పాలను ఒక గిన్నె/గ్లాస్‌లోకి మార్చాలి.

- ఆపై వేరే గిన్నెలో వేడి నీళ్లు/గోరువెచ్చటి నీళ్లు పోసి అందులో ఇందాక పాలు పోసిన గిన్నెను ఉంచి వేడి చేయాలి.

* పాలను నేరుగా స్టౌ మీద, ఒవెన్‌లో పెట్టి వేడి చేయకూడదు. ఇలా చేస్తే అందులోని పోషకాలు నశించిపోయే అవకాశం ఎక్కువ.

 

పాపాయికి పట్టేటప్పుడు..!

* ఇలా వేడి చేసిన పాలను పాపాయికి తాగించే ముందు మరీ వేడిగా ఉండకుండా జాగ్రత్తపడడం చాలా ముఖ్యం. అలాగే వీటిని వేడి చేసిన రెండు గంటల్లోపే వాడేయాలి. అంతేకానీ మిగిలిపోయాయి కదా అని తిరిగి ఫ్రిజ్‌లో/ఫ్రీజర్‌లో పెట్టడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు.

* అలాగే ఎక్కువ సమయం నిల్వ చేయడం వల్ల పాలలోని కొవ్వులు, పాలు విడిపోతాయి. కాబట్టి పట్టే ముందు ఓసారి బాగా కలిపి ఆపై చిన్నారికి తాగించడం మంచిది.

* ఇక ఆఖరుగా.. పాలు నిల్వ చేసిన బాటిల్స్‌, ఫీడింగ్‌ బాటిల్స్‌, బ్రెస్ట్‌ పంప్‌ కిట్‌, వేడి చేయడానికి వాడిన గిన్నెలు.. ఇలా అన్నీ వేడినీళ్లు-సబ్బుతో శుభ్రంగా కడిగి పొడిగా ఆరబెట్టాలి. ఆపై తిరిగి ఫ్రెష్‌గా వాటిని ఉపయోగించుకోవచ్చు.

తల్లి పాలను సేకరించడం, నిల్వ చేయడం, వీటిని పాపాయికి పట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వంటి విషయాలన్నీ తెలుసుకున్నారుగా! అయితే పాపాయికి మీరు అందుబాటులో లేనప్పుడు ఈ పద్ధతి మంచిదే.. కానీ ఇంట్లోనే ఉన్న వారైతే ఎప్పటికప్పుడు నేరుగా ఫీడింగ్‌ ఇవ్వడమే మంచిది. అలాగే నిల్వ చేసే వారు కూడా రోజుల తరబడి కాకుండా సాధ్యమైనంత మేర ఏ రోజుకారోజే ఫ్రెష్‌గా పిండి పాపాయికి అందించేలా ప్లాన్‌ చేసుకోండి. ఇంకా ఈ విషయంలో మీకేమైనా సందేహాలు, అనుమానాలుంటే పిడియాట్రీషియన్‌ని అడిగి నివృత్తి చేసుకోవచ్చు.


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని