టెంపుల్ జ్యుయలరీతో తళుక్కుమనండిలా..! - temple jewellery for this varalaxmi vratam
close
Published : 19/08/2021 16:47 IST

టెంపుల్ జ్యుయలరీతో తళుక్కుమనండిలా..!

(Photo: Instagram)

శ్రావణ మాసం.. అనగానే ఆడవాళ్లకు ముందుగా గుర్తొచ్చేది రంగురంగుల పట్టు చీరలు, పట్టు పరికిణీలు, బంగారు ఆభరణాలే.. శ్రావణమాసంలో వరలక్ష్మీ దేవిని కొలవడానికి కనీసం కాసు బంగారమైనా కొనే ఆచారం చాలామందికే ఉంటుంది. ఇక కాస్త కలిగినవారి సంగతి చెప్పనవసరమే లేదు.. బంగారు ఆభరణాలతో లక్ష్మీదేవిని కొలిచి ఆపై ఆ నగలను ధరిస్తారు. ఇలా శ్రావణ మాసం, పండగలు, పెళ్లిళ్ల సమయంలో వేసుకోవడానికి ప్రస్తుతం ఎక్కువమంది ఆసక్తి చూపుతున్న ఆభరణాలు 'టెంపుల్ జ్యుయలరీ'. ఈ ఫ్యాషన్ చాలాకాలం క్రితమే మొదలైనా.. రోజురోజుకీ తన డిమాండ్‌ని పెంచుకుంటూ పోతోంది. మరి, మీరూ టెంపుల్ జ్యుయలరీలో తళుక్కుమనాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

ఇలా ప్రారంభమైంది..

టెంపుల్ జ్యుయలరీ.. ప్రస్తుతం ఆ పేరు తెలియని అమ్మాయిలు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. గుళ్లు, గోపురాలకు సంబంధించినదే కాబట్టి ఈ ఆభరణాలకు ఆ పేరు వచ్చింది. దీని గురించి తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాల్సిందే.. చోళుల కాలంలో మొదట ఈ తరహా నగలు ప్రారంభమయ్యాయట. అప్పట్లో నృత్యకారిణులు, సంపన్న కుటుంబాలకు చెందినవారు వీటిని ఎక్కువగా ధరించేవారు. అయితే ఆ నగల్లో దేవతల రూపులు మాత్రం ఉండేవి కావు. రాళ్లు పొదిగి, ప్రత్యేకమైన డిజైన్లతో వాటిని తయారుచేసేవారు. ఆ తర్వాత కొంతకాలానికి కలరా, డయేరియా వంటి రోగాల బారిన పడిన ప్రజలు.. ఆ ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తే దేవుళ్లకు నగలు చేయిస్తామని మొక్కుకునేవారట.. అలా నయం అయిన తర్వాత వారు దేవతా రూపులున్న నగలను చేయించి గుడిలో అందించేవారు. ఈ పద్ధతి వల్ల గుళ్లలో ఈ తరహా నగలు ఎక్కువ కావడం మొదలైంది. దీంతో ఆలయ కమిటీలు, వాటిని విక్రయించడానికి వీలుగా స్వర్ణకారులకు అందించేవారు. స్వర్ణకారులు కూడా వీటిపై దేవతల బొమ్మలుండడంతో వాటిని తిరిగి కరిగించడానికి భయపడి అలాగే అమ్మేవారట. అలా వాటిని దేవతల ప్రసాదంగా భావించి కొనుక్కొని వేసుకునే మహిళల సంఖ్య రోజురోజుకీ పెరిగింది. ఈ క్రమంలో టెంపుల్ జ్యుయలరీ దక్షిణ భారత దేశం నుంచి ఉత్తర భారత దేశానికి, అక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా పాకింది.

సహజసిద్ధంగా..

టెంపుల్ జ్యుయలరీని సహజసిద్ధంగా గుళ్లలో ఉండే నిర్మాణశైలి, అక్కడ కనిపించే విగ్రహాలు, ఇతర నిర్మాణాల పోలికతోనే తయారుచేస్తారు. అందుకే గుడి గంటలు, ప్రాకారాలు, లక్ష్మీ దేవి రూపు, వినాయకుడు, నరసింహుడు, ఏనుగులు, హంసలు, నెమళ్లు.. వంటి డిజైన్లు ఈ తరహా నగల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని తయారు చేయడానికి మేలిమి బంగారాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. దానివల్లే ఇవి తగిన ఆకారాల్లో వస్తాయి. వీటిని చెక్కడానికి కూడా చాలా సమయం పడుతుంది. అందుకే టెంపుల్ జ్యుయలరీ ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ ఆభరణాలు కేవలం బంగారంలోనే కాదు.. వెండిలోనూ లభిస్తున్నాయి. రాళ్లు పొదిగిన టెంపుల్ జ్యుయలరీ నగలకు కూడా డిమాండ్ ఎక్కువే.

మళ్లీ వచ్చిన ట్రెండ్..

చోళుల కాలం నుంచీ ఆదరణలో ఉన్నప్పటికీ.. తమ ఉనికి కోల్పోకుండా కాలానికి తగ్గట్టుగా కొత్త డిజైన్లతో మార్పులు చేర్పులు చెందుతూ వస్తున్నాయి ఈ టెంపుల్ జ్యుయలరీ డిజైన్లు. ఇవి మన దక్షిణాది మహిళల అభిరుచికి చక్కగా సూటయ్యే నగలని చెప్పుకోవచ్చు. భారతీయ సంప్రదాయాలు, కళలను జోడించి చేసే ఈ నగలను ఇష్టపడని వారుండరేమో.. అందుకే కొన్ని సంవత్సరాల క్రితమే ఈ ట్రెండ్ జోరందుకుంది. అయితే రోజురోజుకీ వీటి గురించి మరింత ఎక్కువమందికి తెలుస్తుండడంతో దీన్ని కొనడానికి ఆసక్తి చూపేవారు కూడా పెరుగుతున్నారు. ప్రస్తుతం మళ్లీ శ్రావణ మాసం రావడంతో అందరూ ఈ డిజైన్ల వైపే మొగ్గుచూపుతున్నారు. కేవలం నెక్లెస్‌లు, హారాలే కాదు.. ఈ డిజైన్లతో దాదాపు అన్ని రకాల నగలను చేయించుకోవచ్చు. ముఖ్యంగా బాజూబంద్, వడ్డాణం, గాజులు, జుంకాలు, గుండ్ల హారాలు, రాణి హారాలు, నెక్లెస్‌లు, చోకర్లు, జడలు.. వంటి టెంపుల్ జ్యుయలరీ ఆభరణాలు మగువల అందాన్ని రెట్టింపు చేస్తాయి. పట్టుచీరల మీదకు చక్కగా నప్పే ఈ నగలు లంగావోణీలపైనా బాగుంటాయి. అయితే ఈ నగలు భారీగా ఉంటాయి కాబట్టి సింపుల్ డిజైన్లున్న చీర లేదా లంగావోణీలను ఎంచుకుని వాటిపైకి ధరిస్తే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

జాగ్రత్తలు కూడా అవసరమే..

ఈ నగలు ఎంత భారీగా కనిపిస్తాయో.. అంత సున్నితంగానూ ఉంటాయి. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా సంరక్షించాల్సి ఉంటుంది.

* ముఖ్యంగా వేసుకోని సమయంలోనైతే గాలి తగలకుండా ఈ ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉంటుంది. శుభ్రమైన సన్నని కాటన్ వస్త్రంలో ఉంచి, ఎయిర్‌టైట్ డబ్బాలో దాచి ఉంచాలి. ఉప్పునీటి గాలి వీటికి సోకితే వీటి రంగు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకే టెంపుల్ జ్యుయలరీని గాలి చొరబడని బాక్సుల్లో భద్రపర్చాలి.

* వీటి డిజైన్లు చాలా సన్నగా చెక్కి ఉంటాయి. ఈ మూలల్లో దుమ్ము, ధూళి చేరే అవకాశాలు ఎక్కువ కాబట్టి సంవత్సరానికోసారి నిపుణులతో క్లీన్ చేయిస్తూ ఉంటే ఎప్పటికీ కొత్తవాటిలా మెరుస్తుంటాయి.

* పెర్ఫ్యూమ్‌లు, స్ప్రేలు, చివరకు నీరు కూడా వీటికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

* ఈ నగలను శుభ్రం చేయడానికి కూడా సాధారణ నీరు కాకుండా వేడినీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. డిటర్జెంట్‌తో శుభ్రం చేస్తే రంగు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి గాఢత తక్కువగా ఉండే షాంపూతో శుభ్రపరచాలి. మెత్తని బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌ని షాంపూలో ముంచి నెమ్మదిగా రుద్ది దాన్ని వేడినీటితో క్లీన్ చేయాలి. వెంటనే కాటన్ క్లాత్‌తో తుడిచి తిరిగి బాక్సులో పెట్టేయాలి. ఇలా చేస్తే టెంపుల్ జ్యుయలరీ ఎక్కువకాలం మన్నుతుంది.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని