వారెవ్వా వినేశ్

2016 ఆగస్టు 24వ తేదీ.. దిల్లీలోని విమానాశ్రయం.. రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన రెజ్లర్ సాక్షి మలిక్ విమానం దిగి విమానాశ్రయంలోంచి నడుచుకుంటూ వచ్చింది. సాక్షి.. సాక్షి.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో వందల మంది ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఆమెను అక్కడి నుంచి ఊరేగింపుగా బయటికి తీసుకెళ్లారు. అదే విమానాశ్రయంలో సాక్షితో పాటే మరో రెజ్లర్ కూడా వచ్చింది. కానీ ఆమె మెడలో పతకం లేదు. గాయం బాధతో అల్లాడుతూ చక్రాల కుర్చీలో వచ్చిన ఆమెను పట్టించుకున్న వాళ్లు లేరు. నిజానికి రియోకు వెళ్లే ముందు కచ్చితంగా పతకం సాధిస్తుందని ఆశించిన క్రీడాకారుల్లో ఆమె ఒకరు. అంతా అనుకున్నట్లు జరిగితే.. అదే సమయానికి విమానాశ్రయంలో ఆమె పేరు మార్మోగాల్సింది. కానీ పతకం కోసం వెళ్లిన ఆమె కెరీర్‌నే ప్రమాదంలోకి నెట్టే గాయంతో తిరిగొచ్చింది. ఓవైపు గాయం తాలూకు బాధ.. మరోవైపు పతకం సాధించలేదన్న ఆవేదన.. ఇంకోవైపు కెరీర్ ఏమవుతుందో అన్న ఆందోళన..! రెండేళ్లు తిరిగేసరికి కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచి సగర్వంగా నిలబడింది ఆ ధీర వనిత. ఆమే వినేశ్ ఫొగాట్. 2016 రియో ఒలింపిక్స్‌లో వినేశ్ చెలరేగిన తీరు చూస్తే కచ్చితంగా పతకం గెలిచేట్లే కనిపించింది. కానీ క్వార్టర్స్‌లో చైనా రెజ్లర్ యాన్ సున్ మొరటు పట్టుకు ఆమె కాలు మెలి తిరిగిపోయింది. ఆమెను స్ట్రెచర్‌పై అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది. రియోలో ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం భారత్‌కు వచ్చిన వినేశ్.. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. కొన్ని నెలల పాటు కాలు కదపలేని స్థితిలో ఆమె చక్రాల కుర్చీకే పరిమితమైంది. కొన్ని నెలల తర్వాత 2016 అర్జున అవార్డు అందుకోవడానికి కూడా వీల్ ఛైర్ మీదే వెళ్లింది. ఇంత పెద్ద గాయమయ్యాక రెజ్లింగ్‌లో కొనసాగడమంటే మాటలు కాదు. కొన్నేళ్ల పాటు ఎంతో శ్రమించి ఒలింపిక్ పతకం కోసం కలలు కని రియోకు వెళ్లి గాయంతో తిరిగొచ్చిన బాధకు తోడు.. కెరీర్ ఏమవుతుందో తెలియని వేదనతో కొన్ని నెలల పాటు అల్లాడిపోయింది వినేశ్. అయితే అంత బాధలోనూ స్థైర్యం కోల్పోలేదంటాడు వినేశ్‌కు తోడ్పాటు అందించిన ఫిజియోథెరపిస్ట్ వేన్ లాంబార్డ్. మళ్లీ అత్యున్నత స్థాయిలో రాణించాలన్న పట్టుదలతో వినేశ్ కష్టపడిందని.. ఆ కష్టానికి దక్కిన ఫలితమే ఆసియాక్రీడల పతకమని అతనంటాడు. మరింత బలంగా.. లేచి తిరగడం మొదలైన కొన్ని రోజులకే వినేశ్ రెజ్లింగ్ కోసం సాధన ఆరంభించింది. ఒకసారి గాయమైతే.. ఆ భాగం సున్నితంగా మారి, మళ్లీ ఎప్పుడైనా గాయం తిరగబెట్టే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మోకాలికి మరోసారి సమస్య రాకుండా కఠినమైన వ్యాయామాలు చేసి.. దాన్ని దృఢంగా మార్చుకుంది. మొత్తంగా ఫిట్నెస్ పెంచుకుంది. ముందు షాడో రెజ్లింగ్ సాధన చేసి, ఆపై రెజ్లర్లతో తలపడటం మొదలుపెట్టింది. తొమ్మిది నెలల పాటు శ్రమించాక.. ఆమె ఆటలోకి పునరాగమనం చేసింది. ఈ ఏడాది జాతీయ శిక్షణ శిబిరంలో వినేశ్‌ను చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఏడాది కిందట చక్రాల కుర్చీలో బలహీనంగా కనిపించిన వినేశ్.. ఇంత త్వరగా కోలుకుని, దృఢంగా తయారవడం, చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించడమే అందుక్కారణం. మార్చిలో జాతీయ కేసరి పోటీల్లో స్వర్ణం గెలిచి ఆత్మవిశ్వాసం పెంచుకున్న వినేశ్.. ఏప్రిల్‌లో కామన్వెల్త్ క్రీడల్లో పసిడి సాధించడం ద్వారా తాను అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే స్థితిలోనే ఉన్నానని చాటి చెప్పింది. ఇప్పుడు ఆసియా క్రీడల్లో గట్టి పోటీ ఎదురైనా.. తిరుగులేని ప్రదర్శనతో స్వర్ణం సాధించింది. నాడు రియోలో తనను గాయపరిచిన జపాన్ రెజ్లర్ యుకిని ఇక్కడ వినేశ్ చిత్తుగా ఓడించడం విశేషం.
నాన్న మరణం.. అమ్మకు క్యాన్సర్
వినేశ్ ఫొగాట్.. భారత క్రీడాభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పేరేమీ కాదు. తన కుటుంబంలోని అమ్మాయిలందరినీ రెజ్లింగ్‌లోకి తీసుకొచ్చి, వారిని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేయడం ద్వారా దేశంలో మహిళల రెజ్లింగ్‌కు ఊపు తీసుకొచ్చిన కోచ్ మహవీర్ ఫొగాట్ (దంగల్ సినిమా తీసింది ఈయన కథతోనే) తమ్ముడు రాజ్‌పాల్ ఫొగాట్ ఇద్దరు కూతుళ్లలో వినేశ్ ఒకరు. మహవీర్ కుమార్తెలు గీత, బబిత, రీతు, సంగీతలతో పాటు.. రాజ్‌పాల్ కుమార్తెలైన వినేశ్, ప్రియాంక చిన్నతనంలోనే రెజ్లింగ్ బాట పట్టారు. ఐతే వినేశ్‌కు ఎనిమిదేళ్ల వయసుండగా రాజ్‌పాల్ అనారోగ్యంతో మృతి చెందాడు. కొంత కాలానికే వినేశ్ తల్లి ప్రేమలతకు క్యాన్సర్ అని తేలింది. ఇలాంటి స్థితిలో మహవీరే వినేశ్, ప్రియాంకల బాధ్యత తీసుకున్నాడు. ప్రేమలత కూడా తన వల్ల కూతుళ్ల కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది రాకూడదని, తనే ఒంటిరిగా ఆసుపత్రికి వెళ్లి కీమోథెరపీ చేయించుకునేది. తల్లి బాధను చూస్తూనే వినేశ్ ఆటలో ఎదిగింది.
|
వహ్వా విహారి

హైదరాబాద్ న్యూ బోయిన్‌పల్లిలోని జయనగర్‌లో ఇరుకు వీధిలో తోటి పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన ఆ పదేళ్ల కుర్రాడు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్! కుమారుడి ప్రతిభను గుర్తించి క్రికెట్ అకాడమీలో చేర్చిన కొద్ది రోజులకే గుండెపోటుతో తండ్రి హఠాన్మరణం. 11 ఏళ్ల వయసులో గుండె నిబ్బరం చేసుకుని క్రికెట్ కొనసాగించిన ఆ కుర్రాడు ఇప్పుడు టీమ్ఇండియా టెస్టు జట్టులో సభ్యుడు! ఈ రెండు సందర్భాల్లోని కుర్రాడు మరెవరో కాదు.. తెలుగు క్రికెటర్ హనుమ విహారి. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా.. అమ్మ విజయలక్ష్మి అండగా ఎదిగిన స్ఫూర్తిమంతమైన నేపథ్యం అతడిది. 14 ఏళ్లుగా తిరుగులేని ఏకాగ్రత, పట్టుదలతో ఆట కొనసాగించిన విహారి.. టెస్టు జట్టులో చోటు సంపాదించాలన్న కల నెరవేర్చుకున్నాడు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్‌గా.. ప్రస్తుతం ఆంధ్ర జట్టు సారథిగా కొనసాగుతున్న విహారి ఒక దేశవాళీ ఆటగాడిగానే చాలామందికి తెలుసు. ప్రస్తుతం ప్రపంచ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు విహారినే కావడం విశేషం. 59.79 సగటుతో విహారి అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ (57.27)ది విహారి తర్వాతి స్థానం. టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, పుజారాల సగటు 55 లోపే కావడం గమనార్హం. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంలో నేర్పు సంపాదించిన విహారి ఆఫ్‌సైడ్, లెగ్‌సైడ్ స్క్వేర్ షాట్లు ఆడటంలో దిట్ట. బ్యాక్‌ఫుట్ ఆటపై మంచి పట్టుంది. బంతి లెంగ్త్‌ను వేగంగా, సమర్థంగా అంచనా వేయగలడు. ఫలితంగా తనదైన షాట్లు ఆడేందుకు విహారికి ఎక్కువ సమయం దొరుకుతుంది. స్ట్రెయిట్ డ్రైవ్, కవర్ డ్రైవ్‌లు బాగా ఆడే విహారిని అందరూ ‘వి’ డ్రైవ్ ప్లేయర్ అంటారు. హైదరాబాద్‌లో పాఠశాలల అండర్-14 క్రికెట్ టోర్నీ ద్వారా తొలిసారి వెలుగులోకి వచ్చాడు విహారి. క్రికెటర్‌గా తొలి నాళ్లలో ఎంతో పరిణతి కనబర్చడంతో అతని కోచ్ జాన్ మనోజ్ విహారిపై ప్రత్యేక దృష్టి సారించాడు. టెస్టు ఆటగాడికి కావాల్సిన లక్షణాలన్నీ అతడిలో ఉండటంతో.. వీవీఎస్ లక్ష్మణ్ వారసుడు దొరికాడనుకున్నాడు. ‘‘మొదట్నుంచి విహారికి సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటం అలవాటు. ఒంటిచేత్తో జట్టును గెలిపిస్తుంటాడు. 24 ఏళ్లలోపు అతడు టీమ్ఇండియాకు ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో విజయం సాధించాం’’ అని చెప్పాడు మనోజ్. దేశవాళీ క్రికెట్లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటంలో విహారి దిట్ట. గత ఐదేళ్లలో ప్రతి రంజీ సీజన్లో ఒక డబుల్ సెంచరీ బాదాడు. నిరుడు ఒడిషాపై 302 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో కెరీర్ అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు. 2017-18 రంజీ సీజన్లో 6 మ్యాచ్‌ల్లో 94 సగటుతో 752 పరుగులు సాధించాడు. రంజీ ఛాంపియన్ విదర్భతో జరిగిన ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున 327 బంతుల్లో 183 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రజనీష్ గుర్బాని, ఉమేశ్యాదవ్లను సమర్థంగా ఎదుర్కొని భారీ ఇన్నింగ్స్ ఆడటం విశేషం. భారత్-ఎ జట్టుకు ఆడుతున్నపుడు కోచ్ ద్రవిడ్ సలహాలు అతడికి బాగా ఉపయోగపడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి తగ్గ నైపుణ్యాల్ని ద్రవిడ్ శిక్షణలోనే నేర్చుకున్న విహారి.. చాలా త్వరగానే భారత జట్టులో చోటు సంపాదించాడు. ఇంగ్లాండ్‌లో అదరహో.. 2012లో ఉన్ముక్త్ చంద్ సారథ్యంలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టులో విహారి కూడా సభ్యుడు. అయితే తోటివాళ్లలా ఐపీఎల్లో ఆడే అవకాశం రాకపోవడంతో సమయాన్ని వృథా చేయకుండా ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌లలో లీగ్ క్రికెట్ ఆడాడు. 2014, 2015 సీజన్లో షెఫర్డ్ నీమ్ ఎసెక్స్ ఫస్ట్ డివిజన్ లీగ్‌లో హటన్ సీసీ తరఫున ఆడి 6 సెంచరీలు సాధించాడు. ఈ ఏడాది కూడా ఇంగ్లాండ్ లీగ్స్‌లో బరిలో దిగడం విహారికి బాగా కలిసొచ్చింది. విహారికి ఇంగ్లాండ్ పరిస్థితులపై మంచి అవగాహన ఉండటంతో జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు ఇండియా-ఎ జట్టుకు అతడిని ఎంపిక చేశారు. అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న విహారి.. వెస్టిండీస్-ఎతో 3 వన్డేల సిరీస్‌లో 253 పరుగులతో టాప్-3 బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఒక ఇన్నింగ్స్‌లో 147 పరుగులు కూడా చేశాడు. ఇటీవల బెంగళూరులో దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో 148 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. గత 5 ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో విహారి ఒక సెంచరీ, 2 అర్థ సెంచరీలు సాధించడం విశేషం.
|