Telugu Movies|Latest Telugu Movies News in Telugu|Tollywood new in Telugu|Telugu Cinema News|New Movies - Eenadu
close

సినిమా రివ్యూ

రివ్యూ: పేపర్‌బాయ్‌
సినిమా పేరు: పేప‌ర్‌బాయ్‌
నటీన‌టులు: సంతోష్‌ శోభ‌న్, రియా సుమ‌న్, తాన్యా హోప్, పోసాని కృష్ణ‌ముర‌ళి, అభిషేక్ మ‌హ‌ర్షి, విద్యురామ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, బిత్తిరి స‌త్తి, స‌న్నీ, మ‌హేశ్ విట్టా త‌దిత‌రులు
సంగీతం: భీమ్స్ సిసిరేలియో
ఛాయాగ్ర‌హ‌ణం: సౌంద‌ర్ రాజన్
కూర్పు: త‌మ్మిరాజు
క‌ళ‌: రాజీవ్
నిర్మాత‌లు: స‌ంప‌త్ నంది, రాములు, వెంక‌ట్, న‌ర‌సింహా
ద‌ర్శ‌కత్వం: జ‌య‌శంక‌ర్
సంస్థ‌: స‌ంప‌త్ నంది టీం వ‌ర్క్స్, బిఎల్ఎన్ సినిమా, ప్ర‌చిత్ర క్రియేష‌న్స్
విడుద‌ల‌: 31 ఆగ‌స్టు 2018
ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది స్వ‌యంగా నిర్మించ‌డంతో పాటు ఆయ‌నే క‌థ‌, క‌థ‌నాన్ని అందించిన చిత్రం కావ‌డంతో `పేప‌ర్‌బాయ్‌`కి మంచి ప్ర‌చారమే ల‌భించింది. మ‌హేష్‌బాబు, ప్ర‌భాస్ త‌దిత‌ర ప్ర‌ముఖులు కూడా ఈ సినిమా ప్ర‌చారంలో ఓ చేయి వేశారు. ప‌రిమిత వ్య‌యంతో తెర‌కెక్కుతున్న చిత్రాలు కూడా ఈ మ‌ధ్య విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాలతో ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నాయి. ఆ ర‌కంగా కూడా `పేప‌ర్‌బాయ్` విడుద‌ల‌కి ముందే ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షించింది. `గోల్కొండ హైస్కూల్‌`, `త‌ను నేను` చిత్రాల్లో న‌టించిన సంతోష్ శోభ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
కథేంటంటే: ఇంజినీరింగ్ చ‌దువుకున్న కుర్రాడు ర‌వి (సంతోష్ శోభ‌న్‌). పుస్త‌కాలంటే ఇష్టం. పేప‌ర్‌బాయ్‌గా ప‌నిచేస్తుంటాడు. ఓ పెద్దింటి అమ్మాయి ధ‌ర‌ణి (రియా సుమ‌న్‌). ఆమెకి కూడా పుస్త‌కాలంటే ప్రాణం. అలా ర‌వి, ధ‌ర‌ణి అభిరుచులు, భావాలు క‌లుస్తాయి. ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. అది ప్రేమ‌కు దారితీస్తుంది. కానీ త‌న చెల్లెల్ని ఓ పేదింటి కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని ధ‌ర‌ణి అన్న‌య్య‌లు.. ర‌వి త‌న‌కి తానే ఊరు వ‌దిలిపెట్టి వెళ్లిపోయేలా చేస్తారు. అది తెలిశాక ధ‌ర‌ణి ఏం చేసింది? ఇంత‌కీ ర‌వి, ధ‌ర‌ణి ప్రేమ‌క‌థ సుఖాంత‌మైందా? లేదా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ఓ పేదింటి కుర్రాడు.. పెద్దింటి అమ్మాయి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థే ఈ చిత్రం. ప్రేమ‌లో నిజాయ‌తీ ఉంటే చాల‌ని చెప్పే ఈ క‌థ‌లో కొత్త‌ద‌నం అంటూ ఏమీ లేదు. నేప‌థ్య‌మే కాస్త కొత్త‌గా అనిపిస్తుంది. ముంబయిలో మేఘ (తాన్య హోప్‌) నిశ్చితార్థ వేడుకతో క‌థ మొద‌లవుతుంది. అక్క‌డ మేఘ‌కి దొరికిన డైరీతో శివ‌, ధ‌ర‌ణిల ప్రేమ‌క‌థ మొద‌ల‌వుతుంది. తొలి స‌గ‌భాగం క‌థంతా కూడా ఆ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించ‌డం, క‌లిసి బ‌త‌కాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం, ఆ త‌ర్వాత ఓ చిన్న ఎడ‌బాటుతో ముగుస్తుంది. మంచి పాట‌లు, అంద‌మైన కెమెరా ప‌నిత‌నం మిన‌హా తొలి స‌గ‌భాగంలో చెప్పుకోదగ్గ విష‌యాలేమీ లేవు. శివ, అత‌ని స్నేహితుల నేప‌థ్యంలో కామెడీ పండించడానికి ప్ర‌య‌త్నించారు కానీ.. అది ఫ‌లించ‌లేదు. ప్రాస‌తో కూడిన సంభాష‌ణ‌లు త‌ర‌చుగా వినిపిస్తుంటాయి కానీ అవి ఏ ర‌కంగా కూడా సినిమాపై ప్ర‌భావం చూపించ‌వు. ద్వితీయార్థం కథ‌లోనూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలేమీ లేవు.

ప్ర‌తి స‌న్నివేశం ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే సాగుతుంటుంది. ప‌తాక స‌న్నివేశాలైతే మ‌రీ సాధార‌ణంగా అనిపిస్తాయి. పాత క‌థే అయినా.. సినిమా మొత్తం రిచ్‌గానే సాగుతుంది. క‌థానాయ‌కుడు పేప‌ర్‌బాయ్ అనే విష‌యం అప్పుడ‌ప్పుడు గుర్తు చేయ‌డం మిన‌హా ఆ పాత్ర‌ని నిజంగా ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడిగా, ఆ జీవితానికి అద్దం ప‌ట్టేలా చూపించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు ద‌ర్శ‌కుడు. ఛాయాగ్రాహ‌కుడు సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌తి ఫ్రేమ్‌నీ అందంగా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. దాంతో సినిమా మొత్తం రిచ్ ఫ్లేవ‌ర్‌లోనే సాగుతుంది. అలాగే నాయ‌క‌, నాయికల మ‌ధ్య ప్రేమ పుట్టే స‌న్నివేశాల్ని కూడా బ‌లంగా రాసుకోలేదు. ఒక‌ట్రెండు చోట్ల అత‌ని మంచిత‌నం తెలుసుకోగానే ప్రేమ‌లో ప‌డుతుంది హీరోయిన్‌. ఆ స‌న్నివేశాలు వాస్త‌వానికి దూరంగా, అనుభూతి ర‌హితంగా సాగుతాయి. ప‌తాక స‌న్నివేశాల‌కి ముందు బిత్తిరి స‌త్తి చేసే హంగామా కాస్త న‌వ్విస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: సంతోష్ శోభ‌న్ తాను పోషిస్తున్నది పేప‌ర్‌బాయ్ పాత్రని కాకుండా, ఇంజినీరింగ్ చ‌దివిన యువ‌కుడిన‌నే విష‌యాన్నే ఎక్కువ‌గా గుర్తు పెట్టుకుని న‌టించిన‌ట్టున్నాడు. ఆయ‌న సంభాష‌ణ‌లు చెప్పిన తీరు, హావ‌భావాలు ప్ర‌ద‌ర్శించిన విధానం ఆ పాత్ర‌ని మించిపోయిన‌ట్టు అనిపిస్తాయి. రియా సుమ‌న్ అందంగా క‌నిపించడంతో పాటు, మంచి భావోద్వేగాలు కూడా ప‌లికించింది. తాన్య హోప్ పాత్ర చిన్న‌దే. ఆమె పాత్ర ప‌రిధికి త‌గ్గ‌ట్టుగా న‌టించింది. బిత్తిరి స‌త్తి, విద్యుల్లేఖ రామ‌న్ న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. ఇక మిగిలిన పాత్ర‌ల గురించి చెప్పుకోవా‌ల్సినంత ఏమీ లేదు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సౌంద‌ర్ ‌రాజ‌న్ ఛాయాగ్రహ‌ణం సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ముఖ్యంగా పాటల్ని చాలా బాగా చిత్రీక‌రించారు. రాజీవ్ క‌ళా నైపుణ్యం అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. సంప‌త్ నంది రాసిన క‌థ‌, క‌థ‌నాల్లో కొత్త‌ద‌నం లేదు. అయితే మాట‌ల ప‌రంగా మాత్రం ఆయ‌న ప్ర‌య‌త్నం అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడు జ‌య‌శంక‌ర్ అక్క‌డ‌క్క‌డ మాత్ర‌మే త‌న ప‌నిత‌నాన్ని ప్ర‌ద‌ర్శించారు. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా క‌నిపిస్తాయి.

బ‌లాలు
+ నేప‌థ్యం
+ కెమెరా ప‌నిత‌నం
+ మాట‌లు
బ‌ల‌హీన‌త‌లు
- క‌థ‌, క‌థ‌నం
- కొత్త‌ద‌నం కొర‌వ‌డ‌టం
చివ‌రిగా: ఓ ‘పేప‌ర్‌బాయ్’ వినిపించే రొటీన్ ప్రేమ‌క‌థ
గమనిక: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే.

టాలీవుడ్‌

మరిన్ని

ఫొటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

వీడియోలు మరిన్ని

జిల్లా వార్తలు

రెడీ ఫర్ రిలీజ్

జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.