రణం
శబరిమలలో ఉద్రిక్తత
10-50 ఏళ్ల మధ్య వయసు మహిళలను అడ్డుకుంటున్న భక్తులు
  వెళ్లనిస్తామంటున్న ప్రభుత్వం
5 రోజుల పూజల కోసం తెరుచుకున్న అయ్యప్ప సన్నిధానం
భక్తుల శరణుఘోషతో ఒకవైపు.. పోలీసుల లాఠీ ఛార్జీలతో మరోవైపు శబరిమల కొండల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయ్యప్ప స్వామి సన్నిధానం తలుపులు తెరచిన నేపథ్యంలో మునుపెన్నడూ లేని ఆందోళన చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి వెళ్లడానికి అనుమతిస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేయగా.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహిళలను రానిచ్చేది లేదని భక్తులు ఆందోళనకు దిగడంతో సమస్య జటిలంగా మారింది. పంబ, నీలక్కల్‌, ఎరుమేళిల వద్ద భక్తులు కాపలా కాస్తూ అడ్డుకుంటున్నారు. ఆందోళనను అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరించింది.
శరణు ఘోష... లాఠీల మోత
నీలక్కల్‌, పంబా: శబరిమల కొండల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తొలిసారిగా అయిదు రోజుల పూజల నిమిత్తం ఆలయాన్ని తెరవగా, పూజల్లో పాల్గొనడానికి కొందరు మహిళలు సిద్ధమయ్యారు. అయితే నీలక్కల్‌ వద్ద పెద్దసంఖ్యలో గుమిగూడిన భక్తులు బస్సులతో పాటు ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయడం ప్రారంభించి, అర్హత లేని మహిళలు వెళ్లకూడదంటూ కొందరిని దింపివేశారు. రాళ్లు విసిరి కొన్ని వాహనాలను ధ్వసం చేశారు. అలా చేయవద్దని పోలీసులు పదేపదే చెప్పినా వినకపోవడంతో లాఠీ ఛార్జీ చేశారు. ఆందోళనకారులు కూడా తొలుత వారిని ప్రతిఘటించారు. పోలీసుల దాడిలో ఓ వృద్ధ మహిళ, మరికొందరు గాయపడ్డారు. రక్తమోడుతున్న ఆ మహిళను ఆసుపత్రికి తరిలించారు. తరువాత ఆందోళనకారులు చెల్లాచెదురుగా పరుగెత్తి సమీపంలోని అడవిలో తలదాచుకున్నారు. ఆ రహదారిలో గందరగోళం నెలకొంది.
ప్రధాన అర్చకుని మనవడి అరెస్టు
వేకువ జాము 4.15 గంటల ప్రాంతంలో ప్రధాన అర్చకుడి (తంత్రి) మనుమడు రాహుల్‌ ఈశ్వర్‌, తన నాన్నమ్మ (90 ఏళ్లు) వందలాది మంది భక్తులతో కలిసి వాహనంలో పంబకు వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు రాహుల్‌ను అరెస్టు చేశారు. శబరిమల ఆలయ సంరక్షులుగా ఉన్న పందళం రాజ కుటుంబీకులు, ప్రధాన అర్చకుల కుటుంబ సభ్యులు ‘నామజపం’ చేస్తూ పంబలో నిరసన తెలిపారు.

తూ.గో.జిల్లా మహిళను వెనక్కిపంపిన భక్తులు
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాధవి (40), తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడానికి ప్రయత్నించగా పంబ వద్ద భక్తులు వారిని నిలువరించారు. పోలీసుల సహాయంతో కొంతదూరం వెళ్లినా, భక్తులు అడ్డగించడంతో వెనక్కి తిరిగి వచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత శబరిగిరి వైపు వెళ్లిన తొలి మహిళ ఆమే కావడం గమనార్హం.

టీవీ వాహనాలపై దాడులు
ఆందోళనకారులు టీవీ వాహనాల పైనా దాడి చేసి ధ్వంసం చేశారు. వార్తల సేకరణకు వచ్చిన మహిళా పాత్రికేయులను అవహేళన చేశారు. కనీసం నాలుగు జాతీయ ఛానెళ్లకు చెందిన మహిళా పాత్రికేయులను అడ్డుకొని, వారిని వాహనాల నుంచి దింపివేశారు. ఈ క్రమంలో దాదాపు పదిమంది గాయపడ్డారు.
రాజకీయ రంగు
శబరిగిరి ఆలయంపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి తీరుతామని, ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వం స్పష్టం చేసింది. సంప్రదాయాలు కాపాడడం కోసం ఆందోళన చేసి తీరుతామని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌, కాంగ్రెస్‌లు ప్రకటించాయి. శబరిమల సంప్రదాయాలపై నెలరోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతామని కాంగ్రెస్‌ నాయకుడు రమేష్‌ చెన్నితల ప్రకటించారు. బుధవారం అర్థరాత్రి నుంచి 24 గంటల పాటు బంద్‌ పాటించాలని ప్రవీణ్‌ తొగాడియా ఆధ్వర్యంలోని అంతర్జాతీయ హిందూ పరిషత్‌, శబరిమల సంరక్షణ సమితులు పిలుపునిచ్చాయి. భాజపా, ఎన్డీయే పక్షాలు గురువారం 12 గంటల హర్తాల్‌ పాటించనున్నాయి. బంద్‌ పేరుతో వాహనాలను అడ్డుకొనేవారిపై కఠిన చర్యలు చేపడతామనీ డీజీపీ లోక్‌నాథ్‌ బెహరా తెలిపారు. పంబ, నీలక్కల్‌లలో 114వ సెక్షన్‌ విధించారు.
స్త్రీలపై నిషేధం మా సంప్రదాయం
శబరిమల గిరిజనుల అభిప్రాయం
అయ్యప్ప సన్నిధానంతో శబరిగిరి చుట్టుపక్కల నివసించే గిరిజన, దళితులకు ప్రత్యక్ష సంబంధం ఉంది. అయ్యప్ప తమ దేవుడని, ఆలయ ప్రవేశం విషయమై ఉన్న నియమాలు తమ సంప్రదాయాలని గిరిజనులు బలంగా విశ్వసిస్తారు. అత్తతోడు ప్రాంతానికి చెందిన గిరిజనుల నాయకుడు వి.కె.నారాయణ్‌ (70) మాట్లాడుతూ శబరిమలలోని ఆచారవ్యవహారాలను వివరించారు. ‘‘20 శతాబ్దం ప్రారంభం నుంచే శబరిమలకు జనం రావడం ప్రారంభమయింది. అంతకుముందు మండల-మకరవిలక్కు పూజలు నిర్వహించడానికి కేవలం రాజకుటుంబీకులు, అర్చకులు మాత్రమే వచ్చేవారు. మా పూర్వీకులే దేవాలయంలో దీపాలు వెలిగించేవారు. కొన్ని వయసుల్లోని మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించడం మా సంప్రదాయంలో భాగం.’’ అని చెప్పారు. ఎస్సీ జాబితాలోకి వచ్చే కురవ సామాజిక వర్గానికి చెందిన కార్త్యాయని (54) మాట్లాడుతూ సంప్రదాయాలను కాపాడవలసిందేనని అన్నారు. ‘మేము ఆలయానికి కొన్ని మైళ్ల దూరంలో నివసిస్తున్నాం. ఆలయానికి వెళ్లే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు.’ అని తెలిపారు.
‘ భక్తుల మనోభావాలను కాంగ్రెస్‌ కాపాడుతుంది’
దిల్లీ: అయ్యప్ప భక్తుల మనోభావాలను సొంతం చేసుకొని వాటిని కాపాడే హక్కు కాంగ్రెస్‌ పార్టీ కేరళ శాఖకు ఉందని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ స్త్రీ-పురుష సమానత్వాన్ని గౌరవిస్తుందని, అదే సమయంలో స్థానికుల మనోభావాలను కూడా గుర్తిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా తెలిపారు. స్థానికుల మనోభావాలను గౌరవించడం ద్వారా కాంగ్రెస్‌ కేరళ శాఖ.. రాజ్యాంగాన్నిగానీ, చట్టాలనిగానీ ఉల్లంఘించడం లేదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్షకోరే రాజ్యాంగపరమైన హక్కు ప్రతి పౌరునికీ ఉందని చెప్పారు.

నివేదిక సమర్పించండి: మహిళా కమిషన్‌
శబరిమల ఆలయంలోకి వెళ్లాలని కోరుకునే మహిళలకు రక్షణ కల్పించాలని సూచిస్తూ జాతీయ మహిళా కమిషన్‌.. కేరళ డీజీపీకి లేఖ రాసింది. మహిళలను అడ్డుకుంటున్న వ్యవహారంపై నివేదిక సమర్పించాలని కోరింది.

తెరుచుకున్న ఆలయ మహాద్వారం
శబరిమల: మలయాళం పంచాంగం ప్రకారం ప్రస్తుతం వచ్చిన ‘థులం’ మాసంలో అయిదు రోజుల పూజల నిమిత్తం ఆలయాన్ని బుధవారం సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో తెరిచారు. గర్భగుడిలో మేల్‌శాంతి (ముఖ్య అర్చకుడు) ఉన్నికృష్ణన్‌ నంబూద్రి, తంత్రి (ప్రధాన అర్చకుడు) కందరు రాజీవరులు జ్యోతిని వెలిగించారు. తొలి రోజు ఎటువంటి పూజలు ఉండవు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తలుపులు మూసివేశారు. గురువారం నుంచి సోమవారం వరకు గణపతి పూజ, నెయ్యి అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ అయిదు రోజుల పూజల సందర్భంగా అర్హత లేని మహిళలు వస్తే ఆలయాన్ని మూసివేస్తారని కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను ఆలయ ప్రధాన అర్చకుడు రాజీవరు ఖండించారు. అలాంటిదేమీ లేదని చెప్పారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.