close
రైలును ఢీకొట్టిన రైలు

హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్‌ రైలు
8 గంటల నరకం
బోగీలో ఇరుక్కుపోయిన ఎంఎంటీఎస్‌ లోకోపైలట్‌
నుజ్జుఅయిన క్యాబిన్‌ నుంచి ఎట్టకేలకు బయటకు తీసిన సిబ్బంది
18 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్‌ రైలు... సికింద్రాబాద్‌ వస్తున్న హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ కాచిగూడ రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం 10.42 గంటల ప్రాంతంలో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 18 మంది గాయాలపాలయ్యారు. హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ప్రధాన లైను నుంచి లూపు లైను ద్వారా 4వ ప్లాట్‌ఫాం వైపు వస్తుండగా ఎంఎంటీఎస్‌ రైలు కాచిగూడ నుంచి ఫలక్‌నుమా వెళ్తూ వేగంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఎంఎంటీఎస్‌ నుంచి 6 బోగీలు గాల్లో లేచి పట్టాలు తప్పాయి. ఇంటర్‌సిటీలో 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఎంఎంటీఎస్‌ రైలులోని పలువురు ప్రయాణికులు కిందపడగా, మరికొందరు కిందికి దూకి భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో మొత్తం 18 మందికి గాయాలు కాగా, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 12 మందికి ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్‌ క్యాబిన్‌ నుజ్జయ్యింది. దాని లోకోపైలెట్‌ చంద్రశేఖర్‌(36) క్యాబిన్‌లో ఇరుక్కుపోయి 8 గంటలపాటు నరకయాతన అనుభవించారు. ఎట్టకేలకు రైల్వే సిబ్బంది ఆయనను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

పెద్ద శబ్దం రావడంతో: ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలును సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో సిగ్నల్‌ కోసం కాచిగూడ రైల్వేస్టేషన్‌ సమీపంలో చాదర్‌ఘాట్‌ వంతెనపై నిలిపివేశారు. 10.35 గంటలకు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు రైల్వే స్టేషన్‌లోకి వచ్చేందుకు సిగ్నల్‌ ఇచ్చారు. ఇది నాలుగో నెంబరు ప్లాట్‌ఫాం పైకి వెళ్తోంది. ప్లాట్‌ఫాం-2 పై ఉన్న లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌ రైలు అప్పుడే కాచిగూడ స్టేషన్‌ నుంచి మలక్‌పేట వైపు బయలుదేరింది. 10.42 గంటలకు క్రాసింగ్‌ వద్ద 4వ నెంబరు ప్లాట్‌ఫాం వైపు వస్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్‌ రైలు వేగంగా ఢీకొట్టడంతో ఆ ప్రాంతం హాహాకారాలతో మార్మోగింది. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం బీబీసింగ్‌ తెలిపారు.  హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఘటనకు ఎంఎంటీఎస్‌ రైలు లోకో పైలట్‌ తప్పిదమే కారణమని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. రెండో నంబరు ప్లాట్‌ఫాం నుంచి ఎంఎంటీఎస్‌ రైలు సిగ్నల్‌ ఇవ్వకుండానే ముందుకు కదలడం వల్లే హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొన్న ఘటన  దృశ్యాలు కాచిగూడ స్టేషన్లోని సీసీటీవీల్లో నమోదయ్యాయి. సోమవారం ఉదయం 10.42 గంటలకు క్రాసింగ్‌ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు ఆ దృశ్యాలను బట్టి తెలుస్తోంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.