ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణకు నౌకాదళం సిద్ధం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణకు నౌకాదళం సిద్ధం

 నాలుగు ప్రత్యేక బృందాల ఏర్పాటు
 అవసరమైన చోటికి వాయుమార్గంలో బృందాల తరలింపు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ చేపట్టేందుకు తూర్పు నౌకాదళం ముందుకు వచ్చింది. ఆక్సిజన్‌ సరఫరాలో ఇబ్బందులు, ఆక్సిజన్‌ ప్లాంట్ల లీకేజీలు, వాటి స్థితిగతులను పరిశీలిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్లాంట్లను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకోసం అత్యవసరంగా నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందం మూడు నుంచి  నాలుగు జిల్లాల్లో నిర్వహణ బాధ్యతలు చూడబోతోంది. ఈ బృందాలను అవసరమైన చోటకు వాయుమార్గంలో తరలించేందుకూ నౌకాదళం సంసిద్ధత ప్రకటించింది. సింగపూర్‌, థాయ్‌లాండ్‌, మలేషియాల నుంచి రాష్ట్రానికి రానున్న 25 ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ కంటైనర్లను తరలించేందుకు కూడా నౌకాదళం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆక్సిజన్‌ నిల్వలు, ఉత్పత్తి సరఫరాలపై తూర్పు నౌకాదళం కమాండర్‌ (ఈఎన్‌సీ), విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు సీఎండీలతో రాష్ట్ర ప్రభుత్వం శనివారం చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం వెల్లడించింది.
నౌకాదళం అంగీకరించినవి..
* సాధారణ అవసరాల కోసం లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ కంటైనర్లను తరలించేందుకు వీలుగా ప్రత్యేక వాహనాలను సమకూర్చడం.
* ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, డి-టైపు ఆక్సిజన్‌ సిలిండర్లు, కొవిడ్‌చికిత్సకు అవసరమైన ఇతర పరికరాల సరఫరా.
* ఐఎన్‌ఎస్‌ కళింగ ఆస్పత్రిలో 10 ఆక్సిజన్‌ పడకలతో పాటు 60 పడకలను కొవిడ్‌ చికిత్సకు కేటాయింపు.
* విశాఖ జిల్లా కంచరపాలెంలో 150 పడకల తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటుకు మౌలిక సౌకర్యాల కల్పన. ఇందుకు అవసరమైన వైద్యులు, సిబ్బందిని ప్రభుత్వమే నియమించాలి.
* 200 డీ-టైపు సిలిండర్లు అందించడం.
విశాఖ స్టీల్‌ ప్లాంటు సహకారం ఇలా..
* గురజాడ కళాక్షేత్రంలో కొవిడ్‌ చికిత్స కోసం 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు. దీనికి అదనంగా మే 15 నాటికి మరో 150 పడకలూ అందుబాటులోకి తీసుకురావడం.
* విశాఖ స్టీల్‌ ప్లాంటులో 850 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్లకు కేవలం 100 మెట్రిక్‌ టన్నుల ఎంఎల్‌వో ఉత్పత్తి అవుతోంది. కాంట్రాక్టు ఏజెన్సీతో తాజాగా సంప్రదింపులు పూర్తయినందున ఆరు నెలల్లో ప్లాంటు అందుబాటులోకి వస్తుందని కర్మాగారం అధికారులు వెల్లడించారు. వారం రోజుల్లో ప్లాంటు స్థితిగతులపై అధ్యయనం చేయనున్న కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ప్రత్యేక బృందం. ఈ ప్లాంటును సందర్శించి కాంట్రాక్టు ఏజెన్సీకి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు నావల్‌ డాక్‌యార్డు అధికారుల అంగీకారం.
* నౌకాదళ, ఉక్కు కర్మాగారాల ఉద్యోగులు, కుటుంబసభ్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,000 వ్యాక్సిన్లు కేటాయించినందుకు వాటి అధికారులు ధన్యవాదాలు తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు