కొవిడ్‌పై జాతీయ టాస్క్‌ఫోర్స్‌
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌పై జాతీయ టాస్క్‌ఫోర్స్‌

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా కారణంగా పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకొంది. ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం నెలకొనడం, ఏకరూప విధానం లేకపోవడంవల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయని జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాల ధర్మాసనం గుర్తించింది. పరిస్థితులను సమీక్షించి, అవసరాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకొని మార్గదర్శనం చేసేందుకు దేశంలోని 12 మంది నిష్ణాతులతో ఒక జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో కన్వీనర్‌ మినహా అందరూ వైద్యులే. ఆక్సిజన్‌, అత్యవసర మందుల లభ్యతను సమీక్షించి వాటిని అవసరాలకు తగ్గట్టు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను ఈ టాస్క్‌ఫోర్స్‌ చూస్తుంది. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి, లేదా ఆయన ప్రతినిధిగా నియమితులయ్యే అదనపు కార్యదర్శి స్థాయి అధికారి ఈ టాస్క్‌ఫోర్స్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

భవిష్యత్తు తీవ్రతను ఇప్పుడే గుర్తించాలి

‘‘అపార అనుభవం ఉన్నవారంతా ఒక్కచోట కలిసి ప్రస్తుతం ఎదురవుతున్న అసాధారణ మహమ్మారిని ఎదుర్కోవడానికి శాస్త్రీయ దృక్పథంతో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తారని ఆశిస్తున్నాం. తాత్కాలిక పరిష్కారాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ టాస్క్‌ఫోర్స్‌ చేయూతనందిస్తుంది. భవిష్యత్తులో మహమ్మారి తీవ్రతను ఇప్పుడే గుర్తించాలి. దానివల్ల అవసరాలను గుర్తించి శాస్త్రీయంగా మ్యాపింగ్‌ చేయడానికి వీలవుతుంది. మున్ముందు ఎదురయ్యే అనుభవాలకు అనుగుణంగా అందులో దిద్దుబాట్లు చేయడానికి వెసులుబాటు దొరుకుతుంది. భవిష్యత్తులో ఆక్సిజన్‌, మందులు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, లాజిస్టిక్స్‌ ఎంతమేర అవసరమవుతాయో గుర్తించి, పరిణామాలను ఎదుర్కోవడానికి దేశాన్ని సిద్ధం చేయడం చాలా ముఖ్యం. ఈ టాస్క్‌ఫోర్స్‌ కేంద్ర ప్రభుత్వానికి సమాచారం, వ్యూహాలు అందించి రాబోయే సవాళ్లను పూర్తి పారదర్శకంగా, నైపుణ్యవంతంగా ఎదుర్కోవడానికి సహకరిస్తుంది’’ అని ధర్మాసనం పేర్కొంది. టాస్క్‌ఫోర్స్‌ తన సిఫార్సులు సమర్పించేవరకు కేంద్రం ప్రస్తుత పద్ధతిలో ఆక్సిజన్‌ కేటాయింపులు చేసుకోవచ్చంది. వెంటనే పనిని ప్రారంభించాలని ఆదేశిస్తూ, టాస్క్‌ఫోర్స్‌ పదవీకాలాన్ని ఆరు నెలలుగా నిర్ణయించింది.

సభ్యులు వీరే..

1. డాక్టర్‌ భబతోష్‌ బిశ్వాస్‌, మాజీ ఉపకులపతి, పశ్చిమబెంగాల్‌ హెల్త్‌సైన్సెస్‌ యూనివర్సిటీ, కోల్‌కతా
2. డాక్టర్‌ దేవేంద్రసింగ్‌ రాణా, ఛైర్‌పర్సన్‌, బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, సర్‌ గంగారాం ఆసుపత్రి, దిల్లీ
3. డాక్టర్‌ దేవి ప్రసాద్‌ షెట్టి, ఛైర్‌పర్సన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, నారాయణ హెల్త్‌కేర్‌, బెంగళూరు
4. డాక్టర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌, ప్రొఫెసర్‌, క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజి, వెల్లూర్‌, తమిళనాడు
5. డాక్టర్‌ జేవీ పీటర్‌, డైరెక్టర్‌, క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజి, వెల్లూర్‌, తమిళనాడు
6. డాక్టర్‌ నరేష్‌ ట్రెహాన్‌, సీఎండీ, మేదాంత హాస్పిటల్‌ గురుగ్రాం
7. డాక్టర్‌ రాహుల్‌ పండిత్‌, డైరెక్టర్‌, క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌ అండ్‌ ఐసీయూ, ఫోర్టిస్‌ హాస్పిటల్‌, ములుండ్‌, మహారాష్ట్ర
8. డాక్టర్‌ సౌమిత్ర రావత్‌, ఛైర్మన్‌, హెడ్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌, సర్‌ గంగారాం ఆసుపత్రి, దిల్లీ
9. డాక్టర్‌ శివ్‌కుమార్‌ శరీన్‌, సీనియర్‌ ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్‌ ఆఫ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెపటాలజీ, డైరెక్టర్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బైలియరీ సైన్సెస్‌, దిల్లీ
10. డాక్టర్‌ ఝరీర్‌ ఎఫ్‌ ఉడ్వాడియా, కన్సల్టెంట్‌ చెస్ట్‌ ఫిజీషియన్‌, హిందూజా ఆసుపత్రి, బ్రీచ్‌క్యాండీ హాస్పిటల్‌, పార్సీ జనరల్‌ ఆసుపత్రి, ముంబయి
11. కార్యదర్శి, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ
12. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి (కన్వీనర్‌)
*  కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరినైనా ఇందులో నియమించుకోవడానికి టాస్క్‌ఫోర్స్‌కు సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది.

ఇవీ విధివిధానాలు

ఆక్సిజన్‌ అవసరం, లభ్యత, పంపిణీ గురించి జాతీయ కోణంలో అంచనా వేసి టాస్క్‌ఫోర్స్‌ సిఫార్సు చేయాలి.
* రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టు మెడికల్‌ ఆక్సిజన్‌ పంపిణీకి శాస్త్రీయ, హేతుబద్ధ విధానం రూపొందించాలి. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంచడానికి సిఫార్సులు చేయాలి.
* మహమ్మారి దశ, ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తన సిఫార్సులను కాలానుగుణంగా సమీక్షించుకొని, అందుకు తగ్గట్టు వ్యూహాలు సవరించాలి.
* అత్యవసర మందులు, ఔషధాల లభ్యతను సమీక్షించి, అవి తప్పకుండా అందుబాటులో ఉండేందుకు సూచనలు చేయాలి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు