వచ్చే నెలలో టిడ్కో ఇళ్లు

ప్రధానాంశాలు

వచ్చే నెలలో టిడ్కో ఇళ్లు

పనులు వేగవంతం చేయండి
అధికారులకు బొత్స ఆదేశం

ఈనాడు, అమరావతి: టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టి.. నిర్మాణం పూర్తయిన ఇళ్లను వచ్చే నెలలో లబ్ధిదారులకు అందజేయనున్నామని, ఈ మేరకు పనులు వేగవంతం చేయాలని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టిడ్కో), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), బ్యాంకు సమన్వయ కర్తలతో బుధవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో మంత్రి మాట్లాడారు.

పేదలందరికీ ఇంటి వసతి కల్పించాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినందున, అత్యంత ప్రాధాన్యమైనదిగా అధికారులు గుర్తించాలని మంత్రి కోరారు. అన్ని కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పన పనులను అధికారులు పూర్తి చేయించాలని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇళ్లను లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా అందజేయనున్నామని పేర్కొన్నారు. ఒప్పందం చేసుకున్న లబ్ధిదారులకు బ్యాంకు రుణాల మంజూరులో టిడ్కో, మెప్మా, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎలాంటి సమాచార లోపం లేకుండా, నిర్దిష్టమైన కార్యాచరణను రూపొందించుకొని చురుగ్గా వ్యవహరించాలని ఆదేశించారు. లబ్ధిదారులకు రుణాల మంజూరు అంశంలో నిర్లిప్తత కూడదని, నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్ణయించుకొని అధికారులు ముందుకెళితే ఫలితాలు సాధించొచ్చని  అభిప్రాయపడ్డారు. ఇకపై ప్రతివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తానని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం అయ్యేలా చూసుకోవాలని సూచించారు. సమావేశంలో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని