
తెలంగాణ
జగిత్యాలలో రైతుల ఆందోళన
రామోజీపల్లిలో విద్యుత్తు ఉపకేంద్రం ముట్టడి
జగిత్యాల, పెద్దశంకరంపేట- న్యూస్టుడే: ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ, మెదక్ జిల్లా రామోజీపల్లి గ్రామంలోనూ అన్నదాతలు నిరసనకు దిగారు. జగిత్యాలలో రైతులు పాతబస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు రైతులు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా, రాస్తారోకో చేపట్టారు. జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ జీవితాలతో చెలగాటమాడుతున్నాయని చివరి గింజ వరకు కొంటామన్న ముఖ్యమంత్రి, అధికారులు.. తాము ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. తాము పండించిన ధాన్యం నాణ్యత ఉన్నప్పటికీ మిల్లర్లు 40 కిలోల బస్తాపై 3 కిలోలు కోత విధిస్తున్నారని చెప్పారు. యాసంగి వరిసాగుపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న రైతులను వ్యాపారులు దోచుకుంటున్నారన్నారు. ముత్యంపేట చక్కెర కర్మాగారం తెరిపించాలన్నారు. ధర్మారం గ్రామానికి చెందిన రైతు మల్లేశం ఒంటిపై డీజిల్ పోసుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తమకు ఫిర్యాదు చేస్తే.. మిల్లర్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఆర్.ప్రకాశ్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. జిల్లా రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా చెరకు రైతుల సంఘాధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి పాల్గొన్నారు.
ధాన్యం తరలింపునకు లారీలు కరవు
కొనుగోలు కేంద్రంలో తూకం వేసి ధాన్యాన్ని తరలించడంలో జాప్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామ రైతులు శుక్రవారం నిరసనకు దిగారు. పది రోజులుగా ధాన్యం మిల్లులకు తరలించడానికి లారీలు కరవయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం తరలించే వరకు మిల్లులకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామంటూ స్థానిక ఉపకేంద్రాన్ని ముట్టడించారు. దీంతో అధికారులు తాత్కాలికంగా విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మిల్లుల నిర్వాహకులతో మాట్లాడి లారీలు ఏర్పాటుచేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.