
తెలంగాణ
అనాలోచితంగా చేస్తే పెడర్థాలు
న్యాయమూర్తులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హితవు
చట్టాల ప్రభావంపై అధ్యయనం ఏదీ?: జస్టిస్ రమణ
దిల్లీలో రాజ్యాంగ దినోత్సవం ముగింపు కార్యక్రమంలో జస్టిస్ ఎన్.వి.రమణ, రాష్ట్రపతి కోవింద్‌ల మాటామంతీ
ఈనాడు, దిల్లీ: న్యాయస్థానాల్లో వ్యాఖ్యలు చేసే సమయంలో అత్యంత విచక్షణ చూపించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ న్యాయమూర్తులకు సూచించారు. అనాలోచితంగా ఒక్క మాట అన్నా..అది మంచి ఉద్దేశంతో అన్నప్పటికీ...తప్పుడు వ్యాఖ్యానాలకు అవకాశం ఇస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టు రెండు రోజుల పాటు నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవం ముగింపు సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. న్యాయమూర్తులు ఎటువంటి రాగద్వేషాలు లేని స్థితప్రజ్ఞులని సమాజం భావిస్తోందని, దానికి అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో జడ్జీలపై దాడులు జరుగుతుండడం బాధాకరమని రాష్ట్రపతి చెప్పారు. పేర్లు వెల్లడించకుండా సమాచారం వెలువరించవచ్చన్న వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేసి న్యాయవ్యవస్థపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. అయితే ఇలాంటి ఇబ్బందులు తాత్కాలికమేనని అన్నారు. అఖిల భారత న్యాయ సర్వీసు ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. పెండింగ్ కేసుల సమస్య పరిష్కారానికి భాగస్వాములంతా కలిసికట్టుగా ప్రయత్నించాలని సూచించారు.
సౌకర్యాలు కల్పించకుండా వాణిజ్య కోర్టులా?: జస్టిస్ రమణ
ఈ సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రసంగిస్తూ శాసనవ్యవస్థ తాను ఆమోదించే చట్టాల ప్రభావంపై అధ్యయనం చేయడంలేదని, అందువల్ల అది కొన్నిసార్లు పెద్ద సమస్యలకు దారితీస్తోందని చెప్పారు. చెల్లని చెక్కులకు సంబంధించిన నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్‌లోని సెక్షన్ 138 ఇందుకు పెద్ద ఉదాహరణ అని పేర్కొన్నారు. ‘‘ఇప్పటికే పనిభారంతో ఉన్న మెజిస్ట్రేట్లపై ఈ సెక్షన్ కింద నమోదైన కేసులు మరింత భారం మోపాయి. ఎలాంటి అదనపు మౌలిక వసతులు కల్పించకుండానే ఇప్పుడున్న కోర్టులనే వాణిజ్య కోర్టులుగా పేరు మారుస్తున్నారు. ఈ కారణంగా పెండింగ్ కేసులు పెరగనున్నాయి’’ అని చెప్పారు. రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్న వివిధ వ్యవస్థల పాత్ర, పరిమితులపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించి, అవగాహన కలిగించాల్సి ఉందని తెలిపారు. ‘‘ముద్దాయిలను స్వేచ్ఛగా దోష విముక్తుల్ని చేయడానికి, కేసులను వాయిదా వేయడానికి కోర్టులే కారణమని చాలామంది అపార్థం చేసుకుంటుంటారు. కానీ నిజం వేరు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, కక్షిదారులు అందరూ న్యాయప్రక్రియ ముందుకుసాగడానికి సహకరించాల్సి ఉంటుంది. సహాయ నిరాకరణ, నిబంధనల్లో లోపాలు, లోపభూయిష్టమైన దర్యాప్తునకు కోర్టులను బాధ్యుల్ని చేయలేరు’’ అని అన్నారు. దేశంలోని నాలుగు ప్రాంతాల్లో నాలుగు అప్పీలు కోర్టులు ఏర్పాటు చేయాలన్న అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. న్యాయస్థానాల సోపానక్రమాన్ని మార్చడంపై అధ్యయనం జరగాలని తెలిపారు. మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్రం రూ.9వేల కోట్లు కేటాయించడాన్ని అభినందించారు. అయితే రాష్ట్రాలు తమ వాటాను ఇవ్వడం లేదని, ఈ సమస్య పరిష్కారానికి జాతీయ న్యాయ మౌలిక వసతుల అథారిటీని ఏర్పాటు చేయాలని మరోసారి సూచించారు.
రాజ్యాంగ దినోత్సవ ముగింపు కార్యక్రమ వేదికపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులు
చట్టాలు అమలు చేయలేని పరిస్థితి రాకూడదు: రిజిజు
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ శాసన వ్యవస్థ ఆమోదించిన చట్టాలను అమలు చేయలేని పరిస్థితి రాకూడదని అన్నారు. తమ హక్కుల కోసం ఇతరుల హక్కులకు ఇబ్బందులు కలిగించకూడదని తెలిపారు. అందువల్ల ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతల మధ్య సమతౌల్యం ఉండేలా చూడాలని సూచించారు. పెండింగ్ కేసుల సమస్య పరిష్కారానికి కృత్రిమ మేధను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు వందన సమర్పణ చేస్తూ రాజ్యాంగం ఎవరికీ అపరిమితమైన అధికారాలు ఇవ్వలేదని చెప్పారు. రాజ్యాంగం విధించిన పరిమితులు న్యాయమూర్తులకూ వర్తిస్తాయని తెలిపారు. దీనిని గమనించి అన్ని వ్యవస్థలూ నడుచుకోవాల్సిన అవసరముందని అన్నారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎ.ఎం. ఖాన్విల్కర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పాల్గొన్నారు.