
గ్రేటర్ హైదరాబాద్
కిషన్‌రెడ్డి, సంజయ్ జాతీయ హోదా ఇప్పించాలి: కవిత
ఈనాడు, హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతరపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జాతీయ పండుగగా గుర్తించాలని ఎన్నోసార్లు తెరాస ప్రభుత్వం కోరినా ఏమాత్రం స్పందన లేదని అన్నారు. ఈ విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నాలుగు జాతరలకు రూ.332.71 కోట్లను వెచ్చించగా... దిల్లీ నుంచి పైసా రాలేదని ఆక్షేపించారు. సోమవారం కవిత తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘మేడారం జాతరకు నిధుల సాయం కోరినా కేంద్రం ముందుకు రాలేదు. జనాభా ప్రాతిపదికన ఎస్టీ రిజర్వేషన్లను 10% పెంచాలని తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా ఆమోదించడం లేదు. ఇకనైనా కిషన్‌రెడ్డి, సంజయ్‌లు మేడారానికి జాతీయ పండుగ హోదా ఇప్పించాలి. భారీగా నిధులు కేటాయించాలి. ఎస్టీల రిజర్వేషన్ల పెంపుదల తీర్మానాన్ని ఆమోదించేలా ప్రయత్నించాలి’’అని ఆమె విజ్ఞప్తి చేశారు.