
ఆదివార అనుబంధం
అంతరం
- నిరుపమ రావినూతల
నా మనసంతా చికాగ్గా ఉంది. ఎంత వద్దనుకున్నా, ఉదయం జరిగిన సంఘటన ప్రభావం నుంచి బయట పడలేకపోతున్నా. స్కూలుకి సెలవులు కావడంతో నా కూతురు లయ, తన స్నేహితురాలు రాజీ ఇంటికి వెళ్తానని అడిగింది. తనని డ్రాప్ చేయడానికి నేనే వెళ్లాను. రాజీ వాళ్ల అమ్మతో మాట్లాడుతూ ఒక్క నిమిషం కూర్చున్నాను. అక్కడ మాటల్లో పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారన్న టాపిక్ వచ్చింది. రాజీ ‘డాక్టర్’ అని చెప్పింది.
లయని అడిగినప్పుడు తను ఒక వెటకారపు చూపు నా వైపు చూసింది. ‘నేను మా అమ్మలా అవ్వాలను కుంటున్నాను. అప్పుడు రోజంతా ఇంట్లో ఉండొచ్చు, కావాల్సింది తినొచ్చు, ఎప్పుడంటే అప్పుడు షాపింగ్‌కి వెళ్లొచ్చు, ఏ పనీ లేకుండా హాయిగా హ్యాపీగా గడపొచ్చు. మా అమ్మలాగే నేనూ రాణీలాగా జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నాను’ అని వ్యంగ్యంగా నవ్వింది.
ఈమధ్య దాని ధోరణి గమనిస్తూనే ఉన్నాను. ఫ్రెండ్స్ పుట్టినరోజుకి చాలా ఖరీదైన బహుమతులు కొనటం, తనకోసం ఖరీదైన గ్యాడ్జెట్స్ అడగటం, చిన్న చిన్న గెట్ టుగెదర్లు కూడా చాలా గ్రాండ్‌గా చెయ్యాలనుకోవటం... ఇవన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. మరీ అనవసరం అనుకున్నవి ఏనాడూ నేను తనకి కొనివ్వలేదు. వాళ్ల నాన్నని కూడా కొననివ్వలేదు. అందువల్ల అప్పుడప్పుడూ మా తల్లీ కూతుళ్ల మధ్య మనస్ఫర్ధలూ సర్దుకుపోవటాలూ మామూలే.
కానీ ఫ్రెండ్ ఇంట్లో, తను చెప్పిన సమాధానం నాకెందుకో బాధనిపించింది. పైకి నవ్వు పులుముకుని తనని సాయంత్రం పికప్ చేసుకుంటానని చెప్పి, ఇంటికొచ్చి పడ్డాను. ఆఫీస్ నుంచి వస్తూ పిల్లల్ని పికప్ చేసుకురమ్మని నా భర్త ప్రసాద్‌కి మెసేజ్ ఇచ్చి, సోఫాలో కూర్చుని కళ్లు మూసుకున్నాను. నా మనసూ ఆలోచనలూ గతంలోకి వెళ్లాయి...
మా అమ్మానాన్నా ఇద్దరూ రెండు వేరే వేరే స్కూళ్లలో హెడ్మాస్టర్లుగా ఉండేవారు. అందువల్ల మా ఇంట్లో చదువుకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. వారి అంచనాలకి తగ్గకుండా ఉండాలని నేను ఎప్పుడూ చదువులోనే మునిగి ఉండేదాన్ని. మంచి చదువుకోసం మా అన్నయ్యని హాస్టల్లో వేశారు. దాంతో నేను ఇంట్లో ఒక్కదాన్నే నా చదువే లోకంగా ఉండేదాన్ని.
మా అమ్మ ఒక పర్ఫెక్షనిస్ట్. నేనొక పనిచేస్తే, ఆ పనిని ఇంకెంత బాగా చేయొచ్చో చెప్పేది. అది తప్పని అనను కానీ, ఆ క్షణంలో నేను కోరుకునే గుర్తింపూ గారాబం దొరికేవి కావు. చిన్నతనంలో ఒకసారి అమ్మానాన్నా ఇంటికి వచ్చేలోపు డాబామీద ఆరిన బట్టల్ని ఇంట్లోకి తెచ్చి మడతలు పెట్టి, చీరలు పెద్దగా ఉండటం వల్ల చేతకాక పక్కన పెట్టాను. రాగానే నేను చేసింది చూసి, మా అమ్మ పొంగిపోయి నన్ను మెచ్చుకుని ముద్దు పెట్టుకుంటుందని ఆశించాను. కానీ తను రాగానే నేను చేసింది చూసి, చీరల్ని కూడా ఎలా మడతపెట్టాలో నేర్పిస్తానని నవ్వుతూ చెప్పి లోపలికి వెళ్లిపోయింది. ఆ క్షణం నాకు కలిగిన నిస్పృహ, నిరుత్సాహం ఇప్పటికీ గుర్తే నాకు. ఒక బొమ్మ గీస్తే రంగులు ఇంకా బాగా వేయొచ్చనో, టీ చేసి ఇస్తే ఇంకా వేడిగా ఉంటే బావుండేదనో... ఇలా ఎన్నెన్నో.
అలా అని వాళ్లేమీ చెడ్డవాళ్లు కాదు. నేను నోరు తెరిచి ‘నాకిది కావాలి’ అని అడిగే అవసరం లేకుండా అన్నీ అమర్చేవారు. వాళ్లు కనీస అవసరాలకి కూడా కష్టపడే పరిస్థితి నుంచి ఎంతో కృషితో పైకి వచ్చారు కాబట్టి, ఆ కష్టాలేవీ మేము పడకూడదని మాకు అన్నీ ఇచ్చారు. వాళ్ల ఉద్యోగ ధర్మాలని బట్టి, తెలియని ఒక గాంభీర్యం ఉండేది వాళ్ల దగ్గర. నేను కలలుకన్న ప్రేమా గారాబం నాకు దొరికేవి కావు. తోటి స్నేహితులంతా నన్ను ఎంతో అదృష్టవంతురాలిననీ, నాకు కావాల్సినవన్నీ అడగకుండానే నాకు దొరుకుతాయనీ అన్నప్పుడు, నేను వాళ్ల వాళ్ల అమ్మానాన్నల దగ్గర వాళ్లు పొందే గారాబం నాకు లేదని బాధపడేదాన్ని. అలా అని పైకి చెప్తే ఇంత మంచి అమ్నానాన్నలు బాధపడతారని నాలో నేను కుమిలిపోయేదాన్ని.
నేను స్కూల్ నుంచి వచ్చేలోపు మా అమ్మ నాకోసం ఎదురుచూస్తూ ఉండాలనీ, నాకోసం ఏమైనా చేసిపెట్టాలనీ, అనుక్షణం నేనంటే ఎంత ఇష్టమో చెప్పాలనీ... ఇలా ఏవేవో కోరికలు. కానీ వాళ్లు కూడా అలసిపోయివచ్చి ఎవరి పనుల్లో వాళ్లుండేవారు. క్రమంగా నేను నా గదికే పరిమితమయ్యాను. ఫ్రెండ్స్ లేరు. నా గదీ, నా పుస్తకాలూ, నా చదువూ... ఇదే నా ప్రపంచం. వేరే వ్యాపకం లేకపోవడంతో బాగా చదువుకున్నాను. మంచి ఉద్యోగం తెచ్చుకున్నాను. రెండేళ్ల తర్వాత ప్రసాద్‌తో నా పెళ్లయింది. అమెరికా వచ్చాను. మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డా, పుట్టింట్లో కూడా ఒంటరిగానే ఉండే నేను, ఇక్కడా త్వరగానే అలవాటు పడ్డాను.
లయ కడుపున పడ్డప్పుడు నేను బాల్యంలో పడ్డ బాధ తను పడకూడదని- ఉద్యోగం మానేస్తాననీ ఒక సాధారణ గృహిణిగా కొన్నాళ్లు ఉంటాననీ నేను ప్రసాద్‌ని అడిగాను. తను కూడా సరేనన్నాడు. అలా లయ పుట్టినదగ్గర నుంచీ ఈనాటివరకూ ఇంటి బాధ్యతంతా నేను తీసుకున్నాను. కాలక్రమంలో మా చిన్నమ్మాయి కావ్య పుట్టింది. వాళ్ల ఆలనాపాలనా, వాళ్ల స్కూల్, ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రాంస్, ఇంట్లో పనీ అంతా నేనొక్కదాన్నే చేసుకుంటూ వచ్చాను. అప్పుడప్పుడూ కష్టమనిపించినా ప్రసాద్ సహాయంతో సమర్థించుకున్నాను. ఎప్పుడో ఒకసారి వచ్చే అమ్మానాన్నలూ, అత్తామామలూ తప్ప ఇంకెవరి సాయం లేకుండా అన్నీ చేస్తూ వచ్చాను. ప్రతిరోజూ నా పిల్లలకి ఇష్టమైనవి వండిపెడుతూ, వాళ్లతో ఆటలాడుతూ, ముద్దులాడుతూ వాళ్లకి ఎంతో ప్రేమను పంచాను. నేను పొందలేదు అనుకున్న ప్రతీదీ వాళ్లకి ఇవ్వాలని తపించాను. కానీ లయ నా గురించి అనుకుంటున్నది విన్నాక, తట్టుకోలేకపోతున్నాను. ఇన్నాళ్లూ నేను ఒక మంచి అమ్మను అనుకున్నాను, కానీ ఎక్కడో నేను ఫెయిలయ్యాను.
కాలింగ్ బెల్ మోగటంతో ఈ లోకంలోకి వచ్చాను. ప్రసాద్ పిల్లలూ వచ్చారు. నేను ముభావంగా ఉండడాన్ని ప్రసాద్ గమనించాడు. పిల్లలు ఫ్రెష్ అవడానికి వెళ్లినప్పుడు తన బలవంతం మీద జరిగింది చెప్పాను. డిన్నర్ తర్వాత, పిల్లల్ని తన ఆఫీస్ రూమ్‌కి తీసుకెళ్లాడు ప్రసాద్. ఆమాటా ఈమాటా చెబుతూ తన ఫ్రెండ్ ఇంట్లో జరిగిన విషయాన్ని లయ చేతనే చెప్పించాడు. కిచెన్‌లో అన్నీ సర్దుకుంటూ లీలగా వినపడుతున్న వాళ్ల మాటల్ని ఆలకిస్తూ ఉన్నాను. ‘‘నువ్వు పెద్దయ్యాక మీ అమ్మలా ఉంటే- తండ్రిగా నేను చాలా గర్వపడతాను. కానీ అలా అవ్వాలని అనుకునే ముందు, మీ అమ్మ గురించి పూర్తిగా తెలుసుకో.
కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో డిస్టింక్షన్ తెచ్చుకుని, పెద్ద కంపెనీలో మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని మీకోసం వదులుకుంది. మనకోసం తన సంతోషాలన్నీ వదిలేసింది. మీరు ఇబ్బంది పడకూడదని తన కెరీర్‌ని కూడా కాదనుకుంది. మీకు ఆరోగ్యం బాలేకపోతే రాత్రంతా మేలుకుని ఉండి సేవలు చేసింది. మీ అమ్మ ఎప్పుడు షాపింగ్‌కి వెళ్లినా అది మీకోసమో, నాకోసమో అయ్యుంటుంది తప్ప తనకోసం తను ఏనాడైనా ఏమైనా కొనుక్కోవటం చూశావా? ఇంట్లో ఉండి నచ్చింది తింటుందనుకుంటున్నావు. కానీ తను రోజూ కనీసం బ్రేక్‌ఫాస్ట్ అయినా చేస్తోందో లేదో ఏనాడైనా గమనించావా? అసలు కాసేపు స్థిమితంగా కూర్చుని తినేటంత టైం మనం తనకి ఇస్తున్నామా?
నీకూ నీ చెల్లికీ అన్నిపనులూ చెయ్యడం, మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేసి మళ్లీ తీసుకురావడం, మీకు నచ్చినట్లు వండిపెట్టడం, అంట్లూ బట్టలూ... మొత్తంగా ఇంటి బాధ్యత సమస్తం తనే చూస్తోంది. మీరూ నేనూ ఇలా ప్రశాంతంగా పనులు చేసుకోగలుగుతున్నామంటే అందుకు కారణం మీ అమ్మ. ఒక్కరోజు అమ్మ చేసే పనులు నువ్వు చేసి చూడు. నువ్వు అపోహ పడుతున్నట్లు- మీ అమ్మ రాణీలాగా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యడం లేదు. మనకోసం దాసీలా కష్టపడుతోంది- అది కూడా సంతోషంగా, ఎలాంటి కంప్లెయింట్సూ లేకుండా. ఈ పనులన్నీ తనకు చిన్నప్పటినుంచీ అలవాటయ్యి చెయ్యట్లేదు. తను మీకంటే మహారాణిలా పెరిగింది వాళ్లింట్లో. అయినా మనకోసం ఇదంతా చేస్తోంది. అమ్మలు సరిగ్గాలేని కుటుంబాల్లో పిల్లలు ఎలా ఉంటారో, ఈ దేశంలో చాలానే చూసుంటావు నువ్వు. సో, మీ అమ్మ ప్రేమనీ త్యాగాన్నీ కాస్తయినా అర్థం చేసుకుని తనకు థ్యాంక్స్ చెప్పడం, గౌరవించడం నేర్చుకుంటే మంచిది.’’
చాలా స్థిరంగా స్పష్టంగా ఉన్నాయి ప్రసాద్ మాటలు. నా కష్టాన్ని నా కూతురు అర్థం చేసుకోలేదని బాధపడాలో, నా భర్తన్నా అర్థం చేసుకున్నాడని ఆనందించాలో తెలీక నిశ్శబ్దంగా ఉండిపోయాను. రెండు నిమిషాల తరవాత- అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి నెమ్మదిగా ‘‘ఐయాం సారీ మామ్’’ అంది లయ. దాని కళ్లు వర్షించటానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రసాద్ మాటల తీవ్రతకు భయపడిందో లేక, నిజంగానే పశ్చాత్తాపపడిందో కాలమే చెప్పాలి. కానీ ఏది ఎలా జరిగినా నేను మాత్రం నా కూతురిని ప్రేమిస్తూనే ఉంటాను. తల్లిని కదా మరి...