ఏపీ సముద్రతీరంలో 28.7% కోత

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ సముద్రతీరం 1990-2018 మధ్యకాలంలో 28.7% కోతకు గురైనట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రి జితేంద్రసింగ్‌ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 1027.58 కిలోమీటర్ల తీరప్రాంతంలో 294.89 కిలోమీటర్లు కోతకు గురైందని చెప్పారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల పరిధిలో ఉన్న 6,907.18 కిలోమీటర్ల తీరప్రాంతంలో 2,318.31 (33.6%) కిలోమీటర్లు కోతకు గురైనట్లు వెల్లడించారు. కోత నివారణకు ఆర్థిక సంఘం కొన్ని సిఫార్సులు చేసిందన్నారు.


విజయవాడ, దర్శి, డోన్‌లకు ఐడీటీఆర్‌ల మంజూరు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, దర్శి, డోన్‌లకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐడీటీఆర్‌)లు మంజూరు చేసినట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థలకు ఎక్కడ భూమి కేటాయిస్తున్నదీ చెప్పడంతోపాటు, డీపీఆర్‌లు పంపితే వాటిని పరిశీలించి కేంద్ర ప్రభుత్వం రూ.17.25 కోట్ల చొప్పున మంజూరుచేస్తుందన్నారు. ఇందులో రూ.14 కోట్లు నిర్మాణాలకు, రూ.75 లక్షలు కార్యాలయం, వర్క్‌షాప్‌ పనిముట్లకు, రూ.2.50 కోట్లు వాహనం, సిమ్యులేటర్‌కు ఉపయోగించాల్సి ఉంటుందని చెప్పారు.


హైదరాబాద్‌లో 91%, విజయవాడలో 25% వృద్ధి

దేశంలోని 53 ప్రధాన నగరాల్లోని బావుల్లో నీటి మట్టాన్ని లెక్కించగా హైదరాబాద్‌, మధురై, కొజికోడ్‌ నగరాల్లో 91.7 శాతం వృద్ధి నమోదయింది. హైదరాబాద్‌ నగరంలో 36 బావులను పరిశీలించగా 33 బావుల్లో నాలుగు మీటర్లకు మించి మట్టం పెరిగింది. ఏపీలోని విజయవాడలో 8 బావులకుగానూ రెండింటిలో (25 శాతం), విశాఖపట్నంలో 27కిగానూ 15 బావుల్లో (55.6 శాతం) పెరుగుదల నమోదైంది.


విద్యుత్తు ప్రమాదాలతో 675 మంది మృతి

విద్యుత్తు ప్రమాదాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 2019-20, 2020-21 సంవత్సరాల్లో 675 మంది మృతిచెందారు. డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థలో జరిగిన ప్రమాదాల్లో వీరు కన్నుమూశారు. అలాగే 143 మంది గాయపడ్డారు. మరో 681 పశువులు చనిపోయాయి. ఈ రెండేళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక మంది ఆంధ్రప్రదేశ్‌లోనే కన్నుమూశారు. ఇదే సమయంలో తెలంగాణలో 75 మంది మరణించారు. గురువారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ ఈ విషయం వెల్లడించారు.


5 విమానాశ్రయాలకు రూ.385 కోట్ల వ్యయం

ఆంధ్రప్రదేశ్‌లో ఐదు విమానాశ్రయాల ఆధునికీకరణకు ఈ ఏడాది జూన్‌ వరకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా రూ.385 కోట్లు ఖర్చుచేసినట్లు పౌరవిమానయానశాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ తెలిపారు. ఆయన లోక్‌సభలో వైకాపా ఎంపీ అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. కర్నూలు విమానాశ్రయం నిర్మాణానికి రూ.187కోట్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఖర్చుచేసిందని చెప్పారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా విజయవాడ విమానాశ్రయం ఆధునికీకరణకు రూ.134 కోట్లు, తిరుపతికి రూ.131 కోట్లు, రాజమహేంద్రవరానికి రూ.5 కోట్లు, విశాఖపట్నానికి రూ.60 కోట్లు, కడప విమానాశ్రయానికి రూ.55 కోట్లు ఖర్చుచేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కలిపి ఏటా కోటిమంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుందన్నారు.


విశాఖ విమానాశ్రయంపై నేవీ ఆంక్షలేమీ లేవు

విశాఖ విమానాశ్రయానికి వాణిజ్య విమానాల రాకపోకలపై నేవీ ఆంక్షలేమీ విధించలేదని కేంద్రమంత్రి వీకే సింగ్‌ తెలిపారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఆ ఎయిర్‌పోర్టు ప్రస్తుతం 24 గంటలూ పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అక్కడ సమాంతర ట్యాక్సీ ట్రాన్‌ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని పేర్కొన్నారు.

* అనకాపల్లి-అన్నవరం-దివాన్‌చెరువు సెక్షన్‌ల మధ్య జాతీయరహదారి 16ని ఆరు వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్‌ తయారీకి అవసరమైన కన్సల్టెంట్‌ నియామకానికి బిడ్లు పిలిచామని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. సెప్టెంబరు నుంచి డీపీఆర్‌ అధ్యయనం ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గురువారం లోక్‌సభలో వైకాపా ఎంపీలు గోరంట్ల మాధవ్‌, బీశెట్టి వెంకటసత్యవతిలు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని