విధులు బహిష్కరించిన ఆరోగ్యమిత్రలు

కనీస వేతనం, కేడర్‌ విధానం అమలుకు డిమాండ్‌

ఈనాడు, అమరావతి: కనీస వేతనం ఇవ్వాలని, కేడర్‌ విధానాన్ని అమలుచేయాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కింద పనిచేసే ఆరోగ్యమిత్రలు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం విధులు బహిష్కరించారు. జిల్లా సమన్వయకర్త కార్యాలయాల ముందు నల్లబ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వినతిపత్రాలు అందచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని రాష్ట్ర ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్‌, పొరుగుసేవల ఉద్యోగుల యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, షేక్‌ అబ్దుల్‌కలాం అజాద్‌ తెలిపారు. ఆరోగ్యమిత్ర టీమ్‌ లీడర్స్‌, జిల్లా మేనేజర్లు, ఆఫీస్‌ అసోసియేట్‌, జిల్లా మేనేజర్లుగా గత 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామని చెప్పారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌, స్టెనో మాదిరిగా ఆరోగ్య మిత్రలను ఓ కేడర్‌ కింద గుర్తించకపోవడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగో తరగతి సిబ్బంది కింద గుర్తిస్తూ అందచేసే రూ.15వేలులో కోతలు పోను రూ.13వేలు వస్తున్నాయని తెలిపారు. మరోవైపు తమను ప్రభుత్వ ఉద్యోగుల కోటా కింద గుర్తించడంవల్ల కుటుంబసభ్యులు ప్రభుత్వ పథకాలకు అందడంలేదని  పేర్కొన్నారు. జీవో 7 ప్రకారం కేటగిరి-1 స్థాయిని ఆరోగ్య మిత్రలకు ఇవ్వాలని  డిమాండ్‌చేశారు. కొవిడ్‌ సమయంలో, రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఆరోగ్యమిత్ర కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. నెట్‌వర్క్‌  ఆస్పత్రులు పెరిగినందున ఆరోగ్యమిత్రల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్య కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ఆరోగ్యమిత్ర సంఘం ప్రకటించింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని