సైన్యం చేతికి ఆధునిక సాధన సంపత్తి

 తూర్పు లద్దాఖ్‌లో చైనాకు చెక్‌

దిల్లీ: స్వీయ పోరాట సామర్థ్యానికి మరింత సానబెట్టే అధునాతన సాధన సంపత్తి భారత సైన్యానికి అందింది. రెండేళ్లుగా చైనాతో సైనిక ప్రతిష్టంభన కొనసాగుతున్న తూర్పు లద్దాఖ్‌లో మన బలగాల సత్తాను పెంచే ఆయుధ వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం వీటిని ఆర్మీ చేతికి అందించారు. ఇవన్నీ దేశీయంగానే తయారయ్యాయి. భారత్‌లో పెరుగుతున్న స్వయం సమృద్ధికి ఇవి అద్భుత ఉదాహరణలని రాజ్‌నాథ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాజాగా సైన్యానికి అందిన ఆయుధ వ్యవస్థలివీ..

ల్యాండింగ్‌ క్రాఫ్ట్‌ అసాల్ట్‌ (ఎల్‌సీఏ): తూర్పు లద్దాఖ్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన పాంగాంగ్‌ సరస్సు వద్ద చైనా కదలికలపై కన్నేసి ఉంచేందుకు భారత సైన్యం పడవలను ఉపయోగిస్తోంది. వీటిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వేగం, సామర్థ్యం పరంగా వీటిలోని లోపాలను అధిగమించేలా ఎల్‌సీఏలను రూపొందించారు. ఈ పడవల్లో అధునాతన నిఘా సాధనాలు ఉన్నాయి. 12 ఎల్‌సీఏ బోట్‌లకు సైన్యం ఆర్డర్లిచ్చింది.

రక్షిత పదాతిదళ వాహనాలు: పదాతి దళ సైనికులకు ఈ వాహనాలు రక్షణ కల్పిస్తాయి. తూర్పు లద్దాఖ్‌లో మన బలగాలను వేగంగా తరలించడానికి ఇవి ఉపయోగపడతాయి.

ఎఫ్‌-ఇన్సాస్‌: ‘ఫ్యూచర్‌ ఇన్‌ఫ్యాంట్రీ సోల్జర్‌ యాజ్‌ ఏ సిస్టమ్‌’ (ఎఫ్‌-ఇన్సాస్‌) అనే ఈ ప్రాజెక్టు ద్వారా సైనికులకు మూడు ప్రాథమిక ఉపవ్యవస్థలను అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందులో మొదటిది.. రాత్రి, పగలు గురిచూడగలిగే హోలోగ్రఫిక్‌, రిఫ్లెక్స్‌ సైట్లతో కూడిన ఏకే-203 అసాల్ట్‌ రైఫిల్‌ను సమకూర్చడం. ఈ సైట్లను తుపాకీపైన, సైనికుడి హెల్మెట్‌పైన ఏర్పాటు చేస్తారు. దీనివల్ల 360 డిగ్రీల్లో సైనికుడు వీక్షించగలుగుతాడు. వీటితోపాటు మల్టీమోడ్‌ హ్యాండ్‌ గ్రెనేడ్‌, బహుళ ప్రయోజన కత్తినీ అందిస్తారు. ఇక రెండోది.. సైనికుడి రక్షణకు సంబంధించిన ఉప వ్యవస్థ. ఇందులో ప్రత్యేకంగా రూపొందిన హెల్మెట్‌, తూటారక్షక కవచం ఉంటాయి. మూడోది.. కమ్యూనికేషన్‌, నిఘా వ్యవస్థకు సంబంధించింది. భవిష్యత్‌లో దీన్ని మరింత మెరుగుపరిచి రియల్‌టైమ్‌ డేటా సంధానత సౌకర్యాన్ని అందిస్తారు.

నిపుణ్‌: చాలాకాలంగా భారత సైన్యం పురాతన ఎన్‌ఎంఎం-14 మందుపాతరలను ఉపయోగిస్తోంది. వీటిని మరింత మెరుగుపరిచి, ‘నిపుణ్‌’ మందుపాతరను పుణెలోని ఆర్మమెంట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సంస్థ రూపొందించింది. సరిహద్దుల్లోని బలగాలకు ఇది మరింత రక్షణ కల్పిస్తుంది.

ఆర్‌పీఏఎస్‌: ఇది రిమోట్‌ సాయంతో నడిచే పైలట్‌రహిత గగనతల వ్యవస్థ. శత్రువులపై మరింత సులువుగా నిఘా వేయడానికి, శత్రువుల కదలికలను గుర్తించడానికి ఇది సాయపడుతుంది. చిన్నస్థాయి నిఘా ఆపరేషన్లలో వైమానికదళ విమానాలు, హెరాన్‌ డ్రోన్లకు ఎదురవుతున్న ఇబ్బందులను దీని సాయంతో అధిగమించొచ్చు. 

చేతిలో ఇమిడిపోయే థర్మల్‌ ఇమేజర్‌: శత్రు కదలికలను గుర్తించడానికి ఇది వీలు కలిగిస్తుంది. రాత్రి, పగలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ దీన్ని ఉపయోగించొచ్చు.

కమాండర్‌ థర్మల్‌ ఇమేజింగ్‌ సైట్‌: యుద్ధ ట్యాంకుల్లోని కమాండర్లు మరింత స్పష్టంగా వెలుపలి దృశ్యాలను వీక్షించడానికి ఇది సాయపడుతుంది. టి-90 ట్యాంకుల్లో ఇమేజ్‌ ఇంటెన్సిఫికేషన్‌ వ్యవస్థలు ఉండేవి. వాటికి అనేక పరిమితులు ఉండేవి. వీటిని అధిగమించేందుకు థర్మల్‌ ఇమేజింగ్‌ వ్యవస్థ ఉపయోగపడుతుంది.

రికార్డింగ్‌ సౌకర్యంతో కూడిన డౌన్‌లింక్‌ ఎక్విప్‌మెంట్‌: దీనివల్ల సరిహద్దులు, పోరాట ప్రాంతాల్లో నిరంతర నిఘా వేయడానికి మన హెలికాప్టర్లకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం ఈ లోహ విహంగాలు తిరిగొచ్చాకే.. అవి రికార్డు చేసిన దృశ్యాలను వీక్షించడం సాధ్యమవుతోంది. తాజా డౌన్‌లింక్‌ సాధనంతో హెలికాప్టర్‌ గగనతలంలో ఉండగానే నేలమీద నుంచి ఆ వీడియోలు, చిత్రాలను వీక్షించొచ్చు.

సెమీ రగ్గడైజ్డ్‌ ఆటోమేటిక్‌ ఎక్స్‌ఛేంజీ సిస్టమ్‌ మార్క్‌-2: సరిహద్దుల్లో మోహరించిన బలగాలకు లైన్‌ కమ్యూనికేషన్లను అందించడానికి సైన్యం వద్ద ఎక్స్‌ఛేంజీలు ఉన్నాయి. అయితే ఎంత మందికి, ఎంత పరిమాణంలో డేటా అందించాలన్నదానిపై ఈ వ్యవస్థల్లో పరిమితులు ఉన్నాయి. దీనికితోడు అధునాతన ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ టెక్నాలజీతో ఇవి పనిచేయవు. ఈ లోపాలను కొత్త వ్యవస్థ అధిగమిస్తుంది.

అప్‌గ్రేడెడ్‌ రేడియో రిలే (ఫ్రీక్వెన్సీ హాపింగ్‌): ఈ రేడియో రిలే సాధనం వల్ల సరిహద్దుల్లోని మన బలగాలు తమ కమ్యూనికేషన్‌ వ్యవస్థ, రేడియో సెట్లను మరింత ఎక్కువ దూరం పాటు వినియోగించడానికి వీలవుతుంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని