indigenous howitzer: ఎర్రకోట వద్ద గర్జించిన స్వదేశీ శతఘ్నులు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద దేశీయంగా అభివృద్ధి చేసిన ఏటీఏజీఎస్‌ (అడ్వాన్స్‌డ్‌ టౌడ్‌ ఆర్టిలెరీ గన్‌ సిస్టమ్‌)  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 21-గన్‌ సెల్యూట్‌ కోసం 25 బ్రిటన్‌ శతఘ్నులతో కలిపి రెండు ఏటీజీఏఎస్‌లను కూడా వినియోగించారు. ఏటీఏజీఎస్‌లను ఈ వేడుకల కోసం వినియోగించడం ఇదే తొలిసారి. వీటిని డీఆర్‌డీవో.. టాటా ఏరోస్పెస్‌, భారత్‌ ఫోర్జ్‌తో కలిసి అభివృద్ధి చేసింది. 

ప్రధాని మోదీ ప్రసంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ను వివరిస్తూ ఈ శతఘ్నుల గురించి చెప్పారు. ‘‘75ఏళ్ల స్వాతంత్య్రభారత్‌లో తొలిసారి మేడ్‌ ఇన్‌ ఇండియా శతఘ్నులను 21 తుపాకుల వందనానికి వినియోగించారు. ఈ శతఘ్నుల చప్పుడుతో భారత ప్రజలు మొత్తం స్ఫూర్తి పొందాలి. ఆత్మనిర్భర్‌ భారత్‌ను చాలా జాగ్రత్తగా భుజస్కందాలపై మోస్తున్న భారత దళాలకు ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు.

ఈ సరికొత్త ఏటీఏజీఎస్‌ 155ఎంఎంX53 క్యాలిబర్‌ గన్‌ అభివృద్ధిలో డీఆర్‌డీవోలోని ఆర్మమెంట్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ) నోడల్‌ ఏజెన్సీగా పనిచేసింది. ఈ శతఘ్ని 2017లో పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజిలో నిర్వహించిన పరీక్షల్లో 48 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది. ప్రస్తుతం దీని పనితీరును డైరెక్టర్‌ జనరల్‌ క్వాలిటీ ఎష్యూరెన్స్‌ విభాగం అంచనావేస్తోంది. ఇది పూర్తయితే సైన్యం కొనుగోళ్లకు ఆర్డర్లు ఇస్తుంది.



మరిన్ని

ap-districts
ts-districts