Delhi Liquor Scam: శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబుకు జైల్లో ఇంటి భోజనం కుదరదు: ప్రత్యేక కోర్టు

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అభిషేక్‌ బోయిన్‌పల్లికి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈడీ కస్టడీ ముగియడంతో ఇవాళ అబిషేక్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. ఈడీ విచారణ కొనసాగుతున్నందున 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ కేసులో మరో నిందితుడు విజయ్‌నాయర్‌ను మరో నాలుగు రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ.. ప్రత్యేక కోర్టును కోరింది. రెండు రోజుల ఈడీ కస్టడీ కొనసాగిస్తూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ కేసులో జ్యుడిషియల్‌ రిమాండ్‌పై ఉన్న శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబుకు జైల్లో ఇంటి ఆహారం కొనసాగించేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించింది. జైలు నిబంధనల ప్రకారం అనుమతించడం కుదరదన్న కోర్టు.. ఏదైనా ప్రత్యేకంగా కావాలంటే నిబంధనల ప్రకారం అక్కడే తయారు చేయించుకోవాలని తెలిపింది. తమకు ప్రత్యేకమైన పుస్తకాలు కావాలని, అవి తెచ్చుకునేందుకు అవకాశమివ్వాలని శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబు కోరగా కోర్టు తిరస్కరించింది. అన్ని పుస్తకాలు జైల్లో ఉంటాయని న్యాయమూర్తి తెలిపారు. అవికాకుండా సెలెక్టెడ్‌ పుస్తకాలు కావాలని కోరగా.. కోర్టు అంగీకరించింది.


మరిన్ని