Nithiin: అందుకే మా సినిమాకు ‘మాచర్ల నియోజకవర్గం’ టైటిల్‌ పెట్టాం!

ఇంటర్నెట్ డెస్క్‌: తన 20 ఏళ్ల కెరీర్‌లో అనేక విజయాలు, అపజయాలు చూశానని, కొన్ని విమర్శలు బాధకలిగించాయని కథానాయకుడు నితిన్‌ అన్నారు. ఆయన హీరోగా రాజశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. కృతిశెట్టి, కేథరిన్‌ కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నితిన్‌ పంచుకున్న ఆసక్తికర విషయాలు మీకోసం..

చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయి మాస్‌ సినిమా చేస్తున్నారు! కారణం?

నితిన్‌: ఇందులో ప్రత్యేకమైన స్ట్రాటజీ ఏమీ లేదు. ఇరవై ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రేమ కథలు చేసి కొంత బోర్ ఫీలింగ్ వచ్చింది. డిఫరెంట్‌గా చేసి నెక్స్ట్ లెవల్‌కి వెళ్ళాలనే అలోచనతో ‘మాచర్ల నియోజకవర్గం’ చేశా. ఇది పూర్తిస్థాయి కమర్షియల్‌ మూవీ.  అన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. రాజకీయ నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయి. కానీ, మాచర్లలో ఉండే మెయిన్‌ పాయింట్‌ కొత్తగా ఉంటుంది.

ఎడిటర్‌గా ఉన్న రాజశేఖర్ దర్శకత్వం చేయగలడనే నమ్మకం మీకెలా వచ్చింది ?

నితిన్‌: ‘లై ’షూటింగ్ సమయంలో తన ఎడిటింగ్ స్టైల్‌ నాకు బాగా నచ్చింది. అలాగే సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు తను ఇన్‌పుట్స్ కూడా బాగుండేవి. ‘నువ్వు డైరెక్టరైతే బాగుంటుంది’ అని అప్పుడే చెప్పాను. నేను చెప్పిన తర్వాత తనలో ఆలోచన మొదలైంది. కొవిడ్ సమయంలో ఇంట్లో ఉంటూ కథ రాసుకున్నాడు. నాకు చెప్పినప్పుడు ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పేశాను.

కొత్త దర్శకులతో కొన్ని ఇబ్బందులుంటాయి. కథ చెప్పినట్లే తీశారా ?

నితిన్‌: శేఖర్ ఎడిటర్ కావడం వల్ల షాట్ కటింగ్స్, సీన్ ఓపెనింగ్స్, నిడివి విషయంలో చాలా క్లారిటీ ఉంది. తను ఏది చెప్పాడో స్క్రీన్ మీద అదే కనిపించింది. అలాగే ‘మాచర్ల’లో చాలా మంది నటీనటులు ఉన్నారు. ఇంతమందిని హ్యాండిల్ చేయడం చాలా కాష్టం. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా తీశాడు.

ఐఏఎస్ పాత్ర కోసం ఎలా సిద్ధమయ్యారు?

నితిన్‌: ఈ విషయంలో దర్శకుడు శేఖర్ చాలా కష్టపడ్డారు. చాలా మంది ఐఏఎస్ అధికారులని కలవడం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి,  షూటింగ్ సమయంలో ఎక్కడ హుందాగా ఉండాలి? ఎక్కడ మాస్‌గా ఉండాలనేది తనే చెప్పాడు.  ఇది పూర్తి ఫిక్షనల్‌ స్టోరీ. దర్శకుడు శేఖర్‌ది గుంటూరు. ‘మాచర్ల’ అనే టైటిల్‌లో ఒక ఫోర్స్ ఉంది. అందుకే ఈ టైటిల్‌ పెట్టాం.

ప్రచార చిత్రాల్లో మొత్తం మాస్‌ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి కదా?

నితిన్‌:  ప్రథమార్థం చాలా సరదాగా ఉంటుంది. నేను, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ కలిసి చేసిన కామెడీ నవ్వులు పంచుతుంది. అలాగే కేథరిన్‌ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది.  కృతిశెట్టి అందంగా కనిపిస్తుంది.  ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. షూటింగ్స్‌లో ఫైట్స్ అలవాటే. కానీ, మాచర్ల ఫైట్స్ విషయంలో కాస్త ఎక్కువ ఒత్తిడి తీసుకున్నా. అలాగే షూటింగ్‌లో గాయాలు కూడా అయ్యాయి.

‘విక్రమ్’ విషయంలో మీ సలహా ఉందని మీ నాన్న చెప్పారు ?

నితిన్‌: సలహా అంటే.. సినిమా కొనమని మాత్రమే చెప్పాను. రేట్లు జోలికి మాత్రం వెళ్ళను (నవ్వుతూ). విక్రమ్ చూసి వారం రోజులు నిద్రపట్టలేదు. సినిమా అంటే ఇలా ఉండాలి కదా. ఇలా తీయాలి కదా అనిపించింది.  ఒకే మూసలో ఉండే ఫార్ములా కాకుండా.. కథని బలంగా నమ్మి చేస్తే విక్రమ్ లాంటి సినిమాలు వస్తాయి. భవిష్యత్‌లో అలాంటి బలమైన కథలు వస్తే తప్పకుండా చేస్తా.

ఇరవై ఏళ్ల ప్రయాణం తృప్తిగా ఉందా?

నితిన్‌: ఇరవై ఏళ్ల ప్రయాణంలో చాలా హిట్స్ చూశా. కొన్ని అపజయాలు కూడా చూశాను. ఇండియాలో ఎక్కువ ఫ్లాఫ్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరు అని గూగుల్ చేసేవాడిని (నవ్వుతూ). అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ పేర్లు వచ్చేవి. వాళ్లని చూసి స్ఫూర్తి పొందేవాడిని. కొన్ని విమర్శలు బాధ కలిగించేవి. అయితే ఆ విమర్శలనే పాజిటివ్‌గా తీసుకొని ప్రయాణం కొనసాగించా. ప్రస్తుతం వక్కంతం వంశీతో ఒక సినిమా చేస్తున్నా.మరిన్ని

ap-districts
ts-districts