close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పిల్లల హరివిల్లు

వానవిల్‌ అంటే తమిళంలో హరివిల్లు అని అర్థం. ఆ బడిపేరు అదే. అందులో చదువుకునే విద్యార్థులంతా ఒకప్పుడు యాచకులే. అలాంటి పిల్లల జీవితాలను హరివిల్లులా తీర్చిదిద్దేందుకే బడికి ఆ పేరు పెట్టింది దాన్ని ప్రారంభించిన రేవతి.
ది 2004. సునామీతో తమిళనాడులోని చాలా ప్రాంతాలు కకావికలం అయ్యాయి. అక్కడి నాగపట్టణం జిల్లాలో తుపాను దెబ్బకు ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి ఎక్కడో శిబిరాల్లో ఉన్న పిల్లలు మానసికంగా కుంగిపోయారు. వారిని సాధారణ స్థితికి తీసుకురావడానికి వలంటీర్‌గా వెళ్లింది రేవతి. ఆటపాటలతో వారిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించింది. అప్పుడే ఆ శిబిరం దగ్గరికి ఓ మహిళ... చిన్నారిని ఎత్తుకొని యాచనకు వచ్చింది. ఆ చిన్నారి బక్కచిక్కిపోయి చాలా బలహీనంగా కనిపిస్తోంది. బాధితులకు ప్రభుత్వం సాయం చేస్తోంది. అందరూ తినడానికి ఆహారం కూడా పుష్కలంగా సమకూరుస్తోంది. అయినా ఈ చిన్నారి ఇలా ఉండటానికి కారణం   అన్వేషించింది రేవతి. వారు బూమ్‌ బూమ్‌ ముట్టుకారర్స్‌ జాతికి చెందిన వారని తెలుసుకుంది. వారు యాచిస్తూ సంచార జీవనం సాగిస్తారు. వారి సమూహంలో ఒక్కరి పేరు కూడా బాధితుల జాబితాలో లేదు. దీంతో చాలా ప్రయత్నించి వారిని తుపాను బాధితుల జాబితాలో చేర్పించింది ఆమె. ఆ చిన్నారికి చికిత్స చేయించినా దక్కలేదు. అప్పుడే ఆ వర్గం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంది. ఆ జాతికి చెందిన చాలా మంది పిల్లలు పోషకాహారలోపం, చదువు లేక యాచక వృత్తిలో మగ్గిపోతున్నారని తెలిసి వారి జీవితాల్లో మార్పు తేవాలనుకుంది.
ఆరు నెలలు ఉండాలని...
ముందుగా ఆ పిల్లల్ని బడి బాట పట్టించాలనే ఉద్దేశంతో రేవతి నాగపట్టణంలో ఆరు నెలలు ఉండాలనుకుంది. అక్కడ ఒక భవనం అద్దెకు తీసుకుంది. ఆ పిల్లల్ని బడిబాట పట్టించాలనుకుంది. వాళ్లకేమో చదువంటే ఆసక్తిలేదు. ఇంట్లో వాళ్లకీ పిల్లల్ని బడికి పంపడం ఇష్టంలేదు. రేవతి బలవంతంగా పాఠశాలకు తీసుకెళ్లినా వారు అక్కడి నుంచి పారిపోయేవారు. భిక్షాటన చేయగా వచ్చిన డబ్బుతో సైకిల్‌ అద్దెకు తీసుకుని సరదాగా గడిపేవారు. సినిమాలకు వెళ్లేవారు. అలాంటి చిన్నారుల్ని బలవంతంగా బడికి పంపినా తోటి విద్యార్థులతో సర్దుకోలేకపోయేవారు. బాల్య వివాహాలు, పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యలు... ఇవన్నీ ఆమె ముందు ప్రధాన సవాళ్లుగా మారాయి. వీటిని అధిగమించాలంటే ఆరు నెలలు సరిపోవని ఆమెకు అర్థమైంది. సైకిళ్లు కొని వారికి అందుబాటులో ఉంచింది. ఏ సినిమా విడుదలైనా ఆ పిల్లల్ని మొదటి షోకే తీసుకెళ్లేది. వారి కోసం వానవిల్‌ పాఠశాల ప్రారంభించింది. వారికి ఆట,పాటలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి ఉండేది. వారితో ఇలాంటివే చేయిస్తూ పాఠశాల అలవాటు చేసింది. మొదటి నెలలో 30 మంది పిల్లల్ని పాఠశాలలో చేర్పించింది. కొన్ని రోజులకు వారికి పోషకాహారం, ఆశ్రయం కల్పించడానికి ప్రత్యేకంగా వసతి గృహం ప్రారంభించింది. వానవిల్‌లో ఐదో తరగతి వరకు చదువుకోవచ్చు. ఆ తరువాత పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తుంది. అదయ్యాక వసతి సదుపాయం ఉన్న కళాశాలలో చేర్పిస్తారు. అప్పుడే తల్లిదండ్రులు వాళ్లకు పెళ్లిళ్లు చేయరని అనుకుంది రేవతి. ఆ పిల్లలు చదువుకున్నంతవరకూ  ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమైంది. మూడు పూటలా రుచికరమైన పోషకాహారం, దుస్తులు, స్టేషనరీ, చదువుకు కావాల్సిన ఆర్థికసాయం అందిస్తోంది. ఇప్పటివరకూ మొత్తం వెయ్యి మంది పిల్లల్ని యాచక వృత్తినుంచి బయట పడేలా చేసింది. ప్రస్తుతం ఇక్కడ 500 మంది పిల్లలుంటున్నారు. పెద్ద వాళ్లకు ఉపాధిమార్గాలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

చదువొస్తుందా అన్నారు...
మొదట్లో రేవతి ఆలోచనను చాలామంది విమర్శించారు. ‘వాళ్లకు చదువొస్తుందా... ఆ పిల్లలు మారరు. సమయం వృథా’ అని చెప్పేవారు. ‘మా తలరాత ఇంతేనమ్మ, నువ్వేం చేస్తావులే’ అని పిల్లల తల్లిదండ్రులు అనేవారు. ఎవరు ఎన్ని అన్నా రేవతి కష్టపడింది. బడిని నిర్వహించేందుకు అప్పు చేసింది. తెలిసినవారి సాయం తీసుకుంది. ఇప్పుడు ‘నా దగ్గర చదువుకున్న పిల్లల్లో కొందరికి ఉద్యోగాలు వచ్చి స్థిరపడ్డారు. ఈ పిల్లలు పాఠశాలల టాపర్లుగా నిలుస్తున్నారు...’ అని ఆనందంగా చెబుతుంది రేవతి. ఒకప్పుడు ఆమె డిగ్రీ తరువాత కొన్ని రోజులు పాత్రికేయురాలిగా చేసింది. ఆ తరువాత  ‘ఘర్షణ’, ‘ఏం మాయ చేశావె
’ సినిమాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసింది. సినీ రంగాన్ని, వానవిల్‌ను సమన్వయం చేసుకోలేక చివరకు బడి నిర్వహణపైనే దృష్టి పెట్టింది.


మరిన్ని