close

సంపాదకీయం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పంట రుణాలందక పుట్టెడు కష్టాలు

పేద రైతులకు బ్యాంకుల రుణాలు అందడం లేదు. జాతీయస్థాయిలో కేంద్రం చెప్పే గణాంకాలకు, గ్రామస్థాయిలో రైతులకు అందే రుణాలకు పొంతనే ఉండటం లేదు. ఏటా లక్షల కోట్ల రూపాయలను రుణాలుగా ఇస్తున్నట్లు బ్యాంకులు లెక్కలు చూపుతున్నాయి. కానీ సగానికి పైగా రైతాంగానికి రుణాలు అందకుండానే పంట కాలం ముగుస్తోంది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ తొలి రెండు నెలల్లో రుతుపవనాలు ముఖం చాటేయడంతో పంటల సాగు ప్రారంభం కాలేదు. దీంతో పంటలే వేయలేదంటూ బ్యాంకులు మొండిచేయి చూపాయి. బంగారాన్ని తాకట్టు పెట్టి వ్యవసాయం పేరుతో రైతులు బ్యాంకు రుణం పొందే  సదుపాయాన్ని వచ్చే అక్టోబరు ఒకటి (రబీ) నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ తరహా రుణాలకు పంటరుణాలకిచ్చే వడ్డీ రాయితీ వర్తించదని పేర్కొంది. ఇది కౌలు రైతులకు శరాఘాతంవంటిదే. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నట్లుగానే ఇప్పుడిక బ్యాంకుల్లోనూ అధిక వడ్డీకి బంగారం తాకట్టు పెడితేనే రైతులకు రుణసాయం లభిస్తుంది.

సగం మందికే సాయం
నాబార్డు జాతీయ ఆర్థిక సమ్మిళిత అధ్యయనం (2016-17) ప్రకారం దేశంలో సంస్థాగత రుణాలు పొందుతున్న గ్రామీణ కుటుంబాల సంఖ్య తక్కువగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో 26, మధ్యప్రదేశ్‌లో 35, రాజస్థాన్‌లో 31 శాతం గ్రామీణ కుటుంబాలకే 2015-16లో రుణాలు అందినట్లు తేలింది. వీరిలో సంస్థాగత రుణాలు పొందినవారు ఛత్తీస్‌గఢ్‌లో 16, మధ్యప్రదేశ్‌లో 21, రాజస్థాన్‌లో 19 శాతమేనని గుర్తించారు. దీన్నిబట్టి పంట రుణమాఫీ పథకం వల్ల లబ్ధిపొందిన పేదరైతుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. పలు రాష్ట్రాల్లో పంటరుణాలు బ్యాంకుల నుంచి పొందుతున్న రైతుల శాతం మొత్తం వ్యవసాయదారుల్లో సగానికి మించడం లేదు. వాస్తవంగా పొలం దున్ని పంట పండించే రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వ పథకాల రాయితీలను భూముల యజమానులకు ఇస్తున్నట్లుగానే బ్యాంకులు సైతం పంటరుణాలను వారికే ఇస్తున్నాయి. కౌలు రైతులకు పూచీకత్తు లేదనే పేరుతో ఏ బ్యాంకూ రుణం ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండేవి సహకార బ్యాంకులు, సహకార సంఘాలే. కానీ వాటి ద్వారా రుణాల పంపిణీ నానాటికీ తీసికట్టుగా ఉంది. 2015-16లో దేశవ్యాప్తంగా ఇచ్చిన రుణాల్లో సహకార బ్యాంకుల ద్వారా పంపిణీ అయినవి 17 శాతముంటే గతేడాది 12 శాతానికి తగ్గిపోయాయి. అంటే సహకార బ్యాంకుల నుంచి రైతులకు అందే సహకారం తగ్గుతోందని స్పష్టమవుతుంది. 2015-16లో సహకార బ్యాంకులు మొత్తం రూ.లక్షా యాభై మూడు వేల కోట్లను వ్యవసాయ రుణాలుగా ఇస్తే 2018-19లోనూ అంతే మొత్తం ఇచ్చాయి. ఇదే కాలవ్యవధిలో దేశవ్యాప్తంగా ఇచ్చిన వ్యవసాయ రుణాల మొత్తం ఏకంగా రూ.3.39 లక్షల కోట్లు పెరిగినా సహకార బ్యాంకులు మాత్రం అదనంగా రూ.వెయ్యి కోట్లు కూడా ఇవ్వలేకపోయాయి. గతేడాది వాణిజ్య బ్యాంకులే మొత్తం 76 శాతం రుణాలిచ్చాయి.

పలు రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాల అమలు వల్ల పంట రుణాల పంపిణీ పడిపోయింది. రుణమాఫీ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో నిధులు సమకూర్చడం లేదు. ప్రభుత్వం మాఫీ చేసింది కదా అని రైతులు బకాయిలు కట్టడం లేదు. అటు ప్రభుత్వం నుంచి నిధులు రాక, ఇటు రైతులు కట్టక బకాయిలు పేరుకుపోతున్నాయి. దీంతో రైతుల పేర్లను ‘ఎగవేతదారుల జాబితా’లో బ్యాంకులు చేరుస్తున్నాయి. ఉదాహరణకు తెలంగాణలో గత డిసెంబరు 11 నాటికి రైతులకున్న బ్యాంకు రుణ బకాయిల్లో రూ.లక్ష వరకూ మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఖరీఫ్‌ సీజన్‌ ముగియనుంది. ఇంతవరకూ మాఫీ విషయమై ప్రభుత్వం ఏమీ ప్రకటించలేదు. మాఫీ కింద ప్రభుత్వం రూ.లక్ష వరకూ చెల్లిస్తుందని ఎదురుచూస్తున్నారు. రైతులు పాత బకాయిలు కట్టడం లేదని కొత్తగా రుణాలను బ్యాంకులు ఇవ్వడం లేదు. ప్రస్తుత ఖరీఫ్‌ రుణ పంపిణీ లక్ష్యం రూ.29,285 కోట్లలో ఆగస్టు చివరికి రూ.14,589 కోట్లు మాత్రమే ఇచ్చాయి. ఇక ఈ ఒక్క నెలలో మిగిలిన సగం మొత్తం ఇవ్వడం సాధ్యమేనా? గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఖరీఫ్‌ పంటరుణ పంపిణీ లక్ష్యాల సాధనలో బ్యాంకులు విఫలమయ్యాయి.

పంటరుణాలను రిజర్వుబ్యాంకు నిబంధనల ప్రకారం పేద రైతులకు ఇవ్వకపోతే బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పూచీకత్తు లేకుండా ఎంతమంది రైతులకు రుణాలు ఇచ్చారనే అంశంపై లోతుగా విచారణ చేస్తే నిబంధనలు ఎలా అమలు అవుతున్నాయన్నది తేలుతుంది. కౌలు రైతులు ‘సంయుక్త పూచీకత్తు సంఘం’ (జేఎల్‌జీ-జాయింట్‌ లయబులిటీ గ్రూప్‌)గా ఏర్పడితే పంటరుణం ఇవ్వాలి. కానీ వారికీ ఇవ్వడం లేదు. తొలకరి వానలు పడగానే విత్తనాలు వేయడం ద్వారా పనులు ప్రారంభిస్తారు. కానీ ఖరీఫ్‌ రుణాలను సెప్టెంబరు ఆఖరు వరకూ ఇవ్వవచ్చనే విధానాన్ని బ్యాంకులు పాటిస్తున్నాయి. జూన్‌లో వేసిన కొన్ని పంటలు సెప్టెంబరు ఆఖరుకు కోతకు వస్తాయి. పంట కోతకు వచ్చే సమయంలో ఇచ్చే రుణం రైతులకు ఉపయోగపడుతుందని బ్యాంకులు ఎలా భావిస్తున్నాయో వాటికే తెలియాలి. ఖరీఫ్‌ సాగుకు రుణాల పంపిణీ ఆర్థిక సంవత్సరం ఆరంభ మాసం ఏప్రిల్‌ నుంచి మొదలుపెట్టి జూన్‌కల్లా పూర్తిచేస్తేనే రైతులకు ఉపయోగపడుతుంది. రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులిస్తే వాటి ఆధారంగా వెంటనే బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వాలి. ప్రభుత్వం నిధులు ఇచ్చేదాకా కొత్త పంటరుణం ఇవ్వం అనే బ్యాంకుల విధానంతో రుణాల పంపిణీ లక్ష్యాలు నెరవేరడం లేదు.

అమలుకాని ఆర్‌బీఐ నిబంధనలు

దేశంలో మొత్తం 12 కోట్ల రైతులకు ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకం కింద ఏటా రూ.ఆరు వేలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. కానీ పంటరుణాలు తీసుకునే రైతులకు గత ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి ఇచ్చిన ‘రూపే కిసాన్‌ క్రెడిట్‌ కార్డు’(కేసీసీ)లు రూ.3.17 కోట్లేనని నాబార్డు తాజా వార్షిక నివేదికలో తెలిపింది. ఈ కార్డుతో నగదు అవసరం లేకుండా ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేయడానికి అవకాశముంటుంది. కానీ మొత్తం రైతుల్లో మూడో వంతు మందికి కూడా ఈ కార్డులు అందలేదు. గత దశాబ్దకాలంలో వ్యవసాయ రుణాల పంపిణీ వార్షిక సంచిత వృద్ధి రేటు(సీఏజీఆర్‌) 15.1 శాతంగా నమోదైంది. 2008-09లో రూ.3.50 లక్షల కోట్లుండగా గతేడాది (2018-19) రూ.12.55 లక్షల కోట్లను పంపిణీ చేసినట్లు బ్యాంకుల నివేదికలు వెల్లడించాయి. పంటల సాగుకు పెట్టుబడి ఖర్చుల కింద ఇచ్చే స్వల్పకాలిక పంటరుణం సీఏజీఆర్‌ 13.4 శాతముంటే వ్యవసాయ యంత్రాలు వంటి ఆస్తుల కొనుగోలుకిచ్చే దీర్ఘకాలిక రుణాల వృద్ధి రేటు 18.9 శాతానికి పెరిగింది. స్వల్పకాలిక పంటరుణం రూ.లక్షన్నర వరకూ ఇవ్వడానికి రైతు నుంచి ఎలాంటి పూచీకత్తు అడగరాదని రిజర్వుబ్యాంకు నిబంధన విధించింది. కానీ రైతుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకోకుండా ఏ బ్యాంకూ రుణం ఇవ్వడం లేదు. పట్టాదారు పాసుపుస్తకాలు వారికి ఉండనందునే భూమి లేని కౌలు రైతులకు ఈ పంటరుణం బ్యాంకులివ్వడం లేదు. రైతుల భూములు, ఆస్తులు తనఖా పెట్టుకుని దీర్ఘకాలిక రుణాలను బ్యాంకులిస్తాయి. ఇందువల్లనే గతేడాది ఇచ్చిన మొత్తం    రూ.12.55 లక్షల కోట్లలో 40.2 శాతం (రూ.5 లక్షల కోట్లు) దీర్ఘకాలిక రుణాలే ఉన్నాయి. ఇంత భారీగా గత దశాబ్ద కాలంలో ఎన్నడూ దీర్ఘకాలిక రుణాలివ్వలేదు. 2011-12లో 22.5 శాతముంటే గతేడాది ఇవి 40.2 శాతానికి పెరిగాయి.

విధానాలు మారితేనే మేలు...
పంటరుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల విధానాలూ మారాలి. వడ్డీ లేని రుణాల పథకం అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ వడ్డీ సొమ్మును బ్యాంకులకు విడుదల చేయడం లేదు. అదే సమయంలో రైతుల నుంచి బ్యాంకులు నిక్కచ్చిగా వడ్డీతో సహా పాత బకాయిలు వసూలు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వడ్డీ లేని పంటరుణం పథకం ఎక్కడ అమలవుతున్నదో ప్రభుత్వాలకే తెలియాలి. రైతుల నుంచి వడ్డీ వసూలు చేసిన తరవాత ప్రభుత్వం తీరిగ్గా వడ్డీ నిధులు విడుదల చేస్తే అవి రైతులకు అందాయా లేదా అన్నది ఎవరికీ తెలియదు. వ్యవసాయ రుణాల పేరుతో భూములు తాకట్టు పెట్టుకుని దీర్ఘకాలిక రుణాలను అధికంగా ఇవ్వడం వల్ల కొందరు పెద్ద రైతులకు, పంట సాగుచేయని భూముల యజమానులకే మేలు జరుగుతోంది. అయిదెకరాల్లోపు భూమి ఉన్న ప్రతి రైతుకు తప్పనిసరిగా జూన్‌కల్లా రుణం ఇవ్వాలి. పంట సాగుచేయకుండా భూమి ఉందనే సాకుతో రుణం తీసుకునేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాంటి వారి రుణాలకు వడ్డీ రాయితీ ఇవ్వకుండా ఆపివేయాలి. పంట సాగుచేయని వారు వ్యక్తిగత అవసరాలకు తీసుకుని వాడుకునే రుణాలను పంట లేదా వ్యవసాయ రుణాలుగా చూపే విధానాలు మారాలి. దీనివల్ల నిజంగా సాగుచేసే రైతులకే ఆర్థిక సాయం అందే అవకాశాలు పెరుగుతాయి. ఎన్ని రూ.లక్షల కోట్లు ఇచ్చామనే విషయాన్ని ఘనంగా చాటడం మాని, ఎంత త్వరగా ఎంతమంది రైతులకు రుణాలు, వడ్డీ రాయితీలు ఇచ్చామన్న విషయంపైనే ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. అప్పుడే రైతులకు మేలు జరుగుతుంది. సకాలంలో రుణ సాయం అందితే రైతులకు సాగువ్యయం 15 శాతం వరకు తగ్గుతుందని అంచనా. తద్వారా పంటల దిగుబడి పెరిగి దేశానికి ఆహార భద్రత లభిస్తుంది!

- మంగమూరి శ్రీనివాస్‌

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు