Instagram: DM చేస్తేనే స్టోరీ.. షేక్‌ చేస్తే ఫొటో.. ఇన్‌స్టాలో 4 కొత్త ఫీచర్లు

Instagram: ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా నాలుగు ఫీచర్లను యాడ్‌ చేసింది. అవేంటో చూసేయండి.

Published : 07 May 2024 16:53 IST

Instagram | ఇంటర్నెట్‌డెస్క్‌: మెటాకు చెందిన సోషల్‌మీడియా యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇప్పటికే కంటెంట్‌ క్రియేటర్ల కోసం సరికొత్త ఎడిట్‌ ఆప్షన్లు తీసుకొచ్చిన ఈ యాప్.. తాజాగా మరో నాలుగు ఫీచర్లను జోడించింది. ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ ఫాలోవర్లతో కనెక్ట్‌ అయ్యేందుకు వీలుగా వీటిని పరిచయం చేసినట్లు పేర్కొంది. ఇంతకీ ఏంటా ఫీచర్లు? ఎలా ఉపయోగించాలి?

సాధారణంగా ఇన్‌స్టాలో స్టోరీ పెట్టే ముందు స్టిక్కర్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే లొకేషన్‌, క్విజ్‌, హ్యాష్‌ట్యాగ్‌, అవతార్‌.. లాంటి పలు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇకపై అందులో ‘REVEAL’ అనే మరో ఆప్షన్‌ కూడా దర్శనమివ్వనుంది. దాన్ని ఎంచుకోగానే ‘Message to reveal’ ఆనే ఒక మెసేజ్‌ బాక్స్‌ ఓపెన్ అవుతుంది. అందులో స్టేటస్‌కు సంబంధించిన హింట్‌ ఇవ్వొచ్చు.. లేదా మీకు నచ్చిన అంశాన్ని టైప్‌ చేసి స్టోరీగా పోస్ట్‌ చేయొచ్చు. మీ అనుచరులందరికీ స్టోరీపై క్లిక్‌ చేయగానే మొదట మీరు పెట్టిన హింట్‌ కనిపిస్తుంది. వారు డీఎం చేస్తేనే స్టోరీ రివీల్‌ అవుతుందన్నమాట. మీ స్టోరీ ఫాలోవర్లకు ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడానికి ఎడమవైపు కింద ‘Preview’ ఆప్షన్‌ ఉంటుంది. స్టోరీ చూసేందుకు ప్రతి డీఎంను అప్రూవ్‌ చేయాల్సిన అవసరం లేదు. 

మీ స్టోరీకి ఫాలోవర్ల పాట 

ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో మ్యూజిక్‌ యాడ్ చేయాలంటే ప్రత్యేకంగా మ్యూజిక్‌ సింబల్‌తో ఒక ఐకాన్‌ ఉండేది. దాని సాయంతో ఫొటో, వీడియోకు నచ్చిన పాటను యాడ్‌ చేసేవాళ్లం. అయితే ఇదే స్టోరీకి ఇతరులు కూడా సాంగ్‌ యాడ్‌ చేసేలా కొత్త ఫీచర్‌ని ఇన్‌స్టా తాజాగా తీసుకొచ్చింది. స్టోరీ యాడ్‌ చేసే ముందు స్క్రీన్‌పై కనిపించే స్టిక్కర్‌ ఐకాన్‌ని క్లిక్‌ చేయగానే ‘Add Yours Music’ అనే ఐకాన్‌ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్‌ చేయగానే ‘+ / Add Music’ పేరుతో ఒక మెసేజ్‌ బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. దానిపై క్లిక్‌ చేసి నచ్చిన పాటను ఎంచుకొని స్టోరీ పోస్ట్‌ చేయొచ్చు. ఫాలోవర్లు ఆ స్టోరీని చూసే సమయంలో ‘Add Yours’ అనే బటన్‌ కనిపిస్తుంది. దాని సాయంతో వారికి నచ్చిన పాటను యాడ్‌ చేయొచ్చు.

షేక్‌ చేస్తే ఫొటో

స్టిక్కర్‌ ఐకాన్‌లో ‘Frames’ని ఎంచుకోగానే మీ ఫొటో గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. అందులో మీకు నచ్చిన ఫొటోను ఎంచుకోగానే ఒక ఫ్రేమ్‌గా డిజైన్‌ అవుతుంది. దానికిందనే టైమ్‌, డేట్‌ ఆటోమెటిక్‌గా అప్‌డేట్‌ అవుతాయి. కావాలనుకుంటే క్యాప్షన్‌ జోడించి స్టోరీ పోస్ట్‌ చేయొచ్చు. ఫాలోవర్లు ఈ స్టోరీ పై క్లిక్‌ చేయగానే ‘shake to reveal’ బటన్‌ కనిపిస్తుంది. ఫోన్‌ షేక్‌ చేయగానే ఫొటో కనిపిస్తుంది.

కటౌట్లు

మీకు నచ్చిన ఫొటోను లేదా వస్తువును కటౌట్‌ స్టిక్కర్‌గా మార్చే సదుపాయాన్ని వాట్సప్‌ తీసుకొచ్చింది. తాజాగా అదే ఫీచర్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ కూడా జోడించింది. స్టోరీ సెలెక్ట్‌ చేయగానే స్క్రీన్‌పై కనిపించే స్టిక్కర్‌ ఐకాన్‌లో ‘Cutouts’ని ఎంచుకోగానే గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. అందులో ఫొటో/వీడియోను ఎంచుకుంటే కటౌట్‌ స్టిక్కర్‌ క్రియేట్‌ అవుతుంది. అది మీకు నచ్చకపోతే ఎడమవైపు కింద కనిపించే ‘Select manualy’ ఆప్షన్‌ ఎంచుకోండి. మీకు నచ్చిన వస్తువును సెలెక్ట్‌ చేసి తిరిగి స్టికర్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని