close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కరోనా కాలంలో... నేనున్నానంటూ!  

ఆ అమ్మాయికి అమ్మమ్మ నేర్పిన చక్కని అలవాట్లు... చిన్నతనం నుంచే ఆమెను సేవా పథంలో నడిపిస్తున్నాయి. ఓవైపు అనాథ వృద్ధులకు చేయూతనిస్తూనే, మరోవైపు గ్రామీణ నిరుపేద విద్యార్థులకు సోలార్‌లైట్లను ఉచితంగా అందిస్తోంది. భవిష్యత్తులో పేద విద్యార్థుల కోసం సైన్స్‌ స్కూల్‌నీ నిర్మిస్తానంటోంది అన్వితా కొల్లిపర.
అమెరికాలో పుట్టి పెరిగింది అన్విత. మూడేళ్ల కిందట ఆమె కుటుంబం అక్కడి నుంచి తిరిగొచ్చి హైదరాబాద్‌లో స్థిరపడింది. యూఎస్‌లో ఉన్నప్పుడు తరచూ సెలవులకు ఇండియా వచ్చేది. అప్పుడు కపిలేశ్వరపురంలోని నానమ్మ దగ్గర ఎక్కువగా గడిపేది అన్విత. అక్కడ ఆవిడ ‘తోటివారిని ప్రేమించడం, ఎదుటివారి కష్టాల్ని గుర్తించి సాయం అందించగలగడమే మానవత్వమని’ తరచూ ఆ అమ్మాయికి చెప్పేవారు. ఆ మాటలు అన్వితపై ప్రభావం చూపించాయి. దాంతో చిన్నప్పటి నుంచే తన పాకెట్‌మనీతో ఇతరులకు సాయం చేసేది. ఇక్కడకి వచ్చాక సమీపంలోని వృద్ధాశ్రమాలకు వెళ్లి అక్కడి వృద్ధులతో గడపడం, వారి అవసరాలను తీర్చడం వంటివాటిని అలవాటుగా మార్చుకుందామె. కొవిడ్‌ సమయంలో వివిధ ఆశ్రమాలకు వెళ్లినప్పుడు అక్కడ సౌకర్యాల లేమి, నిధుల కొరత వంటివాటిని గుర్తించింది. అలాగే చాలామంది అనారోగ్యంతో ఉండటాన్నీ గమనించింది. వారందరికీ సాయం చేయాలనుకుంటున్నట్లు అమ్మానాన్నలకు చెప్పింది. వారి ప్రోత్సాహంతోనే గతేడాది ఏప్రిల్‌లో ‘కేర్‌ గుడ్‌ ఫౌండేషన్‌’ను స్థాపించింది. వృద్ధులకు కావాల్సిన మందులూ, పోషకాహారం అందించే దిశగా ‘కొవిడ్‌ కేర్‌’ పేరుతో ఓ పాజెక్టునూ ప్రారంభించింది. నిధుల సేకరణకు ఆన్‌లైన్లో క్రౌడ్‌ ఫండింగ్‌ మొదలుపెట్టింది. దానికి బంధువులు, స్నేహితులూ తెలిసినవారి నుంచి స్పందన వచ్చింది. దాంతో రెండు వారాల్లోనే ఏడు లక్షల రూపాయల్ని సేకరించింది అన్విత. వాటితో తొమ్మిది నెలల నుంచి అక్కడి వృద్ధులకు మందులతోపాటు పోషకాహారాన్నీ అందిస్తోంది. నెలకు సుమారు రూ.70 వేలను ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం 200 మంది వృద్ధులు ఈమె ప్రారంభించిన సంస్థ సేవలను అందుకుంటున్నారు. అలాగే అనాథ వృద్ధులు ఎక్కడ కనిపించినా వారిని ఆశ్రమంలో చేర్పించాలని పోలీసులను కోరింది.
విద్యార్థులకు సోలార్‌లైట్లు... నిరుపేద విద్యార్థుల కోసం అన్విత ‘సోలార్‌ పవర్‌ ప్యానెల్‌’ పేరుతో మరో ప్రాజెక్టును ప్రారంభించింది. దీనిద్వారా కపిలేశ్వరపురం, కూచిపూడి, బట్నాగులపల్లి లాంటి 40 గ్రామాల్లోని 200 మంది విద్యార్థులకు సోలార్‌ల్యాంప్‌ తయారీ కిట్లను అందించింది. ‘భవిష్యత్తులో నిరుపేద చిన్నారులకు సైన్స్‌ స్కూల్‌ను ఏర్పాటుచేసి సాంకేతికత మీద ఆసక్తి పెంచడానికి ప్రయత్నిస్తా’ అంటోంది అన్విత.


మరిన్ని