close

తెలంగాణ

మా జిల్లాలో ఇతరుల పెత్తనం అవసరం లేదు

హుజూర్‌నగర్‌లో పద్మావతిని గెలిపిస్తాం
కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతిని గెలిపిస్తామని.. తమ జిల్లాలో ఇతర ప్రాంతాలకు చెందిన వారి పెత్తనం అవసరం లేదని కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తామంతా కూర్చొని మాట్లాడుకుంటామని, ఇతరులు జోక్యం చేసుకొని స్థాయి దిగజార్చుకోవద్దన్నారు. గురువారం శాసనసభ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రేవంత్‌ చెప్పే అభ్యర్థి పేరు నాకే కాదు.. జానారెడ్డికీ తెలియదు. జిల్లాలో ఉత్తమ్‌, జానారెడ్డి దామోదర్‌రెడ్డి, నేను 30ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం. గతంలో మా మధ్య అభిప్రాయ భేదాలుండేవి. ఇప్పుడు కలిసిపోయాం. ఈ మధ్య పార్టీలో చేరిన వాళ్ల సలహాలు మాకవసరం లేదు. కార్యనిర్వాహక అధ్యక్షులకు ఇక్కడ ఏం పని. ఇక్కడ పద్మావతే మంచి అభ్యర్థిని. పీసీసీ చీఫ్‌ రేసులో ఉన్నది నేనే.  పదవి వచ్చినా రాకున్నా పార్టీకి పని చేస్తాం మా తమ్ముడి గురించి ఆయననే అడగండి. కేసీఆర్‌ అన్న కుమార్తె కూడా భాజపాలో చేరారు కదా’’ అని కోమటిరెడ్డి అన్నారు. తాను మాట్లాడిందానికి ‘రేవంత్‌పై కోమటిరెడ్డి కామెంట్లు అని పెట్టకండి.. నా పరువు పోతుంది.’ అని మీడియాను కోరారు.

హుజూర్‌నగర్‌ తెరాసదే: జగదీశ్‌రెడ్డి
హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధిస్తుందని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రాంగణంలోని తన కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘‘పద్మావతి పోటీ చేయటం ఉత్తమ్‌కే ఇష్టం లేదు. అందుకే రేవంత్‌ చేత మాట్లాడించారు. అక్కడి కాంగ్రెస్‌ వాళ్లు తెరాసలో చేరారు. ఓటమి ఖాయమని పద్మావతిని పోటీ నుంచి తప్పించాలని ఉత్తమ్‌ భావిస్తున్నారు. అసలు ఆయనను ఆంధ్రా వ్యక్తి అని స్థానిక ప్రజలు భావిస్తున్నారు.  ఉత్తమ్‌ మానసిక స్థితి బాగోలేదు. గత ఎన్నికల్లో అతి కష్టం మీద గెలిచారు. అది ట్రక్కు గుర్తు వల్లనే జరిగింది. మా పార్టీ అభ్యర్థిని కేసీఆరే ప్రకటిస్తారు.’’ అని జగదీశ్‌రెడ్డి అన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు