close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పోస్టుమార్టం చేశాక... భయపడేదాన్ని!

పోస్టుమార్టం చేశాక... భయపడేదాన్ని!

‘డాక్టర్‌ ఇతడి తలకు పెద్దగా గాయం కావడం వల్ల చనిపోయాడు. ఈమెది ఆత్మహత్యేనని అనిపిస్తోంది. ఎందుకంటే ఈమె విషం తాగింది. ఇతడిని ఏదో పాము కాటేసినట్లుంది. అందుకే చనిపోయాడు...’ ఈ సంభాషణ అంతా వైద్యుల మధ్య జరుగుతున్నట్లు అనిపిస్తుంది కదూ! కానీ కాదు. పోస్టుమార్టం గదిలో వైద్యుడి సహాయకురాలిగా పనిచేస్తున్న ఓ సాధారణ ఉద్యోగినిది. మామూలుగా ఎవరైనా చనిపోయారంటేనే చూడటానికి ఆలోచిస్తాం. అలాంటిది  పోస్టుమార్టం చేయాలంటే మాటలా... కానీ ఆ పనే చేస్తోంది మంజూ దేవి.

మంజుది బిహార్‌ సంస్థీన్‌పూర్‌ జిల్లా. అక్కడి సదర్‌ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించే వైద్యుల దగ్గర సహాయకురాలిగా పని చేస్తుంది. శవాన్ని కోయడం, పంచనామా చేశాక తిరిగి కుట్లు వేయడం ఆమె పని. దాదాపు పద్దెనిమిది ఏళ్ల నుంచి ఈ పనులు చేస్తోంది. ‘ఇక్కడ ఆసుపత్రి పెట్టినప్పటి నుంచి మా అత్తగారి కుటుంబానికి చెందినవారు ఈ పనే చేస్తున్నారు. మా వారేమో స్థానిక మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసేవారు. మాకు అయిదుగురు పిల్లలు. 2001లో మావారు చనిపోయారు. దాంతో కుటుంబ భారం పెరిగింది. అత్తయ్యతో కలిసి నేను పోస్టుమార్టం పనిలో వైద్యులకు సహాయకురాలిగా చేయడానికి వెళ్లేదాన్ని. వెళ్లిన కొత్తలో ఆ శవాలు, దుర్వాసన, ఆ వాతావరణం చూస్తే వాంతి వచ్చేది. ప్రమాదాలకు గురై, పురుగుల మందులు తాగి, రకరకాల రోగాలతో... ఇలా ఎన్నో శవాలు వచ్చేవి. వాటిని చూస్తే చాలా భయమేసేది. అన్నింటినీ గుర్తుకు తెచ్చుకుంటే అన్నం సహించేది కాదు. రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు. విపరీతంగా భయం వేసేది. ఆ తరువాత మెల్లిగా భయం పోయింది. శవాన్నీ ఎలా పంచనామా చేయాలో మా అత్తయ్య దగ్గర్నుంచి నేర్చుకున్నా. అయితే ఈ పని చేస్తుండటంతో చుట్టుపక్కల వారు మమ్మల్ని ఈసడించుకునేవారు. నేను వస్తుంటే చూసి.. దూరం తప్పుకొనేవారు. అందుకు నాకు చాలా బాధేసేది. చాలారోజులు తొందరపడి ఈ పని ఒప్పుకొన్నానా అని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటివేవి లేవు’ అంటూ ఆ రోజులు గుర్తు చేసుకుంటుంది మంజు.

మొదట్లో మంజుకు ఇందులో ప్రాథమిక విషయాలు కూడా తెలిసేవి కావు. ఇప్పుడు శవ పంచనామాకు సంబంధించిన ప్రతి అంశం ఆమెకు తెలుసు. ఇప్పటి వరకు ఆమె పదమూడు వేల శవాలకు పంచనామా చేసింది. ఆ సమయంలో శవాలను కోయడం, తిరిగి కుట్టడం లాంటి అన్ని పనులు ఆమే చేస్తుంది.

ఆదాయమూ తక్కువే...
మంజు అత్తయ్య 2004లో చనిపోవడంతో ఆ పనులు చేయడం మొదలుపెట్టింది. 2006లో ఆమెను తాత్కాలిక ఉద్యోగినిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. ఆమె పదోతరగతి వరకే చదువుకుంది. ఒకరోజు శవ పంచనామాలో సాయం చేసినందుకు నూట పది రూపాయలు రోజువారీ కూలీగా ఇస్తారు. ఒక్కో రోజు శవం ఉండొచ్చు ఉండకపోవచ్చు. పంచనామా లేని రోజున రూపాయి కూడా ఇవ్వరు. ‘ఇన్ని చేస్తున్నా... ఇప్పటి వరకు నేను తాత్కాలిక ఉద్యోగినే. నా విధుల్ని శాశ్వతం చేయమని అధికారుల్ని అడుగుతున్నా. నా కథ దేశవ్యాప్తంగా అందరికీ తెలియడంతో ఇప్పుడిప్పుడే నాయకులు పరిగణిస్తామని చెబుతున్నారు. ఆర్థికంగా సమస్యలు ఉన్నా... నేను మాత్రం పనిలో సంతృప్తి పొందుతా. ఏదో ఒక రోజు నా డ్యూటీని పర్మినెంట్‌ చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నా.  ప్రస్తుతం మా పెద్దబ్బాయి, మూడో అబ్బాయి  సంగీతం నేర్చుకుని ఇతరులకు శిక్షణ ఇస్తున్నారు. అమ్మాయికి పెళ్లయ్యింది. ఇద్దరు కవలలు. తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వీళ్లందరికోసం ఎంతకష్టమైనా పడటానికి నేను సిద్ధమే...’ అని చెబుతుంది నలభై ఐదేళ్ల మంజూదేవి.


మరిన్ని