జీవిత బీమాను కలిపిస్తూ, దాంతో అనుబంధంగా అదనపు భరోసా కల్పించే సదుపాయాన్నే రైడర్ అంటారు. ఈ రైడర్ల కోసం అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వీటిని విడిగా పొందే మార్గం లేదు. కేవలం మనకున్న బీమాతో అదనంగా రైడర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటిని సాధారణ జీవిత బీమా పాలసీలు లేదా పెట్టుబడి ఆధారిత జీవిత బీమా పాలసీలతో కలిపి తీసుకోవచ్చు.
ఈ రైడర్లను జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో తీసుకోవచ్చు లేదా తర్వాతైనా పొందేందుకు వీలుంది.
మార్కెట్లో అందుబాటులో ఉన్న రైడర్లు
యాక్సిడెంటల్ డెత్ రైడర్ :
ప్రమాదం వల్ల అనుకోకుండా బీమాదారుడు మృతిచెందితే ప్రాథమిక జీవిత బీమా పాలసీలో కల్పించే సొమ్ము కంటే రైడర్లతో కలిపి అందించే బీమా సొమ్ము అధికంగా ఉంటుంది. ఈ రైడర్ ముఖ్యోద్దేశం అదనపు బీమా సొమ్మును కల్పించడమే.
ఉదాహరణకు ఒక పాలసీదారుడు రూ.కోటి టర్మ్ పాలసీ చేయించుకున్నారనుకుందాం. దీనికి అదనంగా రూ.25లక్షల యాక్సిడెంటల్ డెత్ రైడర్ కొనుగోలు చేశాడనుకుందాం. ఒక వేళ అనుకోకుండా ప్రమాదం జరిగి మృతిచెందితే రూ.కోటితోపాటు అదనంగా రూ.25లక్షల బీమా సొమ్మును బీమా కంపెనీ మృతుడి కుటుంబసభ్యులకు లేదా నామినీకి అందజేస్తుంది.
పాక్షిక /శాశ్వత వైకల్య రైడర్లు (పర్మనెంట్/టెంపరరీ డిసేబిలిటీ రైడర్) :
ప్రమాదం కారణంగా గాయాలపాలై పాక్షికంగా లేదా శాశ్వత వైకల్యం కలిగితే బీమా కంపెనీ బీమా మొత్తంలో కొంత భాగాన్ని క్రమానుగతంగా బీమాదారుడికి కోలుకునే వరకు లేదా నిర్ణీత సమయం వరకు చెల్లిస్తుంది. ఆర్జించ లేని పరిస్థితుల్లో ఈ సొమ్ము ఆదాయ మార్గంగా ఉంటుంది. ఈ రైడర్ సాధారణంగా యాక్సిడెంట్ రైడర్‌తో కలిపి ఇస్తారు. రైడర్ కొనుగోలు చేసే ముందు నియమనిబంధనలను ఓసారి పరిశీలించడం మంచిది.
తీవ్రమైన అనారోగ్యానికి వర్తింపజేసే ( క్రిటికల్ ఇల్నెస్) రైడర్:
బీమా కలిగి ఉన్న సమయంలో ఏదైనా ప్రాణాంతక లేదా తీవ్ర అనారోగ్యాన్ని గుర్తిస్తే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉపయోగపడుతుంది. రైడర్‌కు వర్తించే బీమా సొమ్మును అందజేస్తారు. సహజంగా తీవ్ర అనారోగ్యానికి సంబంధించిన చికిత్సలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. అలాంటి సమయంలో ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్లు ఆసరాగా ఉంటాయి. సాధారణంగా గుండె జబ్బులు, క్యాన్సర్, మూత్రపిండాల జబ్బులు, పక్షవాతం, అంధత్వం, అవయవ మార్పిడి, బైపాస్ సర్జరీ, గుండె కవటాల మార్పిడులు ఈ రైడర్ పరిధిలోకి వస్తాయి. కొన్ని బీమా కంపెనీలు ఒక్కో వ్యాధికి అందించే సొమ్ముకు పరిమితిని విధిస్తాయి. అందువల్ల పాలసీ కొనేముందు ఏయే జబ్బులకు ఈ రైడర్ వర్తిస్తుందో వాటి పరిమితులేమిటో తెలుసుకొని ఉండడం మంచిది. ఈ రైడర్‌ను ఒక్కసారికి మాత్రమే క్లెయిం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ రైడర్ సమయం ముగిసిపోతుంది.
ప్రీమియం మినహాయింపు ( ప్రీమియం వైవర్ ) రైడర్:
బీమా పొందిన వ్యక్తి ప్రమాదంలో గాయపడి సంపాదించలేని పరిస్థితి ఏర్పడితే పాలసీ ప్రీమియం చెల్లించడం భారంగా మారుతుంది. ఇలాంటి సమయంలో భరోసా కల్పించేందుకు రూపొందించిందే ప్రీమియం మినహాయింపు(ప్రీమియం వైవర్) రైడర్. ఈ రైడర్ పొంది ఉంటే ప్రీమియంలో కొంత భాగం లేదా ప్రీమియం మొత్తం చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంటుంది. ఎంచుకునే రైడర్‌ను బట్టి మినహాయింపు ఉంటుంది.
మేజర్ సర్జికల్ బెనిఫిట్ రైడర్ :
ఏదైనా పెద్ద శస్త్రచికిత్స అవసరమైనప్పుడు ఈ రైడర్ పొందవచ్చు. దీంట్లో అత్యవసర వైద్య సహాయానికి చేసే శస్త్రచికిత్సలకు అయ్యే ఖర్చును అందిస్తారు. ఈ రైడర్ పరిధిలో వచ్చే శస్త్రచికిత్సలు, వాటికి కల్పించే బీమా మొత్తం, ఇతరత్రా సమచారం పాలసీ డాక్యుమెంట్లలో లభిస్తుంది.
టర్మ్ రైడర్:
ఈ రైడర్ అదనపు బీమా సొమ్మును పొందే వీలును కల్పిస్తుంది. పాలసీదారుడు అనుకోకుండా మృతిచెందితే బీమా సొమ్ముతోపాటు రైడర్ సొమ్మును సైతం అందిస్తారు. సాధారణంగా ప్రాథమిక బీమా సొమ్ముకు సమానంగా రైడర్ సొమ్మును హామీ ఇస్తారు.
జీవితభాగస్వామికి కల్పించే రైడర్:
ఈ రైడర్ జీవిత భాగస్వామికి కూడా బీమా అందిస్తుంది. జీవిత భాగస్వామికి ప్రత్యేక బీమా చేయించని సందర్భంలో ఈ రైడర్ ఉపయోగపడుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
ప్రధాన పాలసీ ఉన్నంతకాలం వరకే రైడర్లు పనిచేస్తాయి. ఏ కారణం చేతైనా ప్రధాన పాలసీ కాలపరిమితి ముగిసినా లేదా స్వాధీనపరిచినా లేదా ప్రీమియం చెల్లించకుండా రద్దయినా అటువంటి పాలసీలకు రైడర్లు పనిచేయవు.
కొన్ని రైడర్లకు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. రైడర్లు తీసుకునేముందు వాటి నియమనిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలి.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?