Credit Card: ఇలాంటి క్రెడిట్‌ కార్డు తీసుకుంటే మీకే ఎక్కువ లాభం! - Take such credit cards which gives you more benefits
close

Updated : 31/07/2021 09:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Credit Card: ఇలాంటి క్రెడిట్‌ కార్డు తీసుకుంటే మీకే ఎక్కువ లాభం!

ప్రజల్లో ఆర్థిక అంశాలపై అవగాహన పెరుగుతోంది. డిజిటల్‌ లావాదేవీలకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. క్రెడిట్‌ కార్డుల వినియోగం కూడా ఎక్కువయ్యింది. అయితే, క్రెడిట్‌ కార్డుల్లో చాలా రకాలుంటాయి. సాధారణంగా మనం బ్యాంక్‌ లేదా థర్డ్‌ పార్టీ కంపెనీలు ఏ కార్డుని ఆఫర్‌ చేస్తే ఆ కార్డునే తీసుకుంటుంటాం. కానీ, అది సరైన పద్ధతి కాదు. మీ అవసరం, వినియోగించే తీరును బట్టి కార్డును తీసుకోవాలి. ముఖ్యంగా తక్కువ ఛార్జీలతో ఎక్కువ ప్రయోజనాలుండే వాటిని ఎంపిక చేసుకోవాలి. మరి కార్డును తీసుకునేటప్పుడు ఎయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో ఓ లుక్కేద్దాం!

డిస్కౌంట్లు, ప్రయోజనాలు, రివార్డులు...

కొన్ని కార్డులు రెస్టారెంట్లలో.. మరికొన్ని పెట్రోల్‌ బంకుల్లో.. ఇలా ఒక్కోరకం కార్డు ఒక్కోచోట ప్రత్యేక రాయితీలు ఇస్తాయి. మరికొన్ని కార్డుల్లో రివార్డు పాయింట్లు విమాన ఛార్జీగా మారతాయి. కొన్నేళ్ల క్రితం సిటీ బ్యాంక్‌ ఆఫర్‌ చేసిన ఓ క్రెడిట్‌ కార్డు రివార్డు పాయింట్లను హోటల్‌ రూం బుకింగ్‌కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఇలాంటి ఫీచర్లు కార్డు వినియోగాన్ని పెంచుతాయి. అలాగే మనకూ సౌకర్యంగా ఉంటాయి. వ్యాపారంలో భాగంగా తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి రివార్డు పాయింట్లు హోటల్‌ రూం బుకింగ్‌ ఛార్జీగా మారితే ఎంతో ప్రయోజనం కదా! ఈ నేపథ్యంలో మీ అవసరాన్ని బట్టి మీ కార్డు రకం, అందులోని ఫీచర్లు ఉండాలి. మీరు పెద్దగా ప్రయాణం చేయరనుకోండి.. అలాంటప్పుడు మీ కార్డులోని రివార్డు పాయింట్లు విమాన ఛార్జీగా మాత్రమే మారితే ఏం ప్రయోజనం?

క్యాష్‌బ్యాక్‌ లేదా రివార్డు పాయింట్లు...

మనం కార్డు వినియోగిస్తున్నందుకు ఇచ్చే బోనస్సే రివార్డు పాయింట్లు. మనం ఖర్చు చేసేదాన్ని బట్టి రివార్డు పాయింట్లు ఉంటాయి. తరచూ షాపింగ్‌ చేయాల్సిన అవసరం ఉన్న వారికి ఈ రివార్డు పాయింట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే క్యాష్‌బ్యాక్‌ కూడా. మనం చేసే చెల్లింపులపై ఎంతో కొంత డబ్బు తిరిగి మన ఖాతాలోకి చేరుతుంది. కొన్ని కార్డులు పెట్రోల్‌ బంకుల్లో చేసే లావాదేవీపై క్యాష్‌బ్యాక్‌ ఇస్తుంటాయి. పెట్రో ధరలు మండిపోతున్న ఈ తరుణంలో ఇది ఎంత ప్రయోజనకరమో చెప్పాల్సిన అవసరం లేదు. తరచూ బైక్‌ లేదా కారుపై ప్రయాణం చేసేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

అంతర్జాతీయ ప్రయోజనాలు...

సాధారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు విమానాశ్రయాల్లోనే గంటల తరబడి విశ్రమించాల్సి వస్తుంటుంది. కొన్ని క్రెడిట్‌ కార్డుల వల్ల ఎయిర్‌పోర్టు లాంజ్‌ల్లోకి ఉచిత అనుమతి ఉంటుంది. అలాగే భోజన వసతి సైతం ఉండే అవకాశం ఉంది. తరచూ అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి ఈ కార్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కొన్ని కార్డులను ఇతర దేశాల్లో వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. చాలా మందికి విదేశాల్లో కరెన్సీని మార్చుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి సమయంలో మన దగ్గర ఉన్న కార్డులను వినియోగించి చెల్లింపులు చేయవచ్చు. దీనివల్ల మనం అక్కడ చేసే ఖర్చు భారత కరెన్సీలోకి మారుతుంది. అయితే, కార్డు సంస్థలు మారకం ఛార్జీలను విధిస్తాయి.

బీమా సహా అదనపు ప్రయోజనాలు...

కొన్ని కార్డులు తీసుకోవడం వల్ల మనకు ఆటోమేటిగ్గా బీమా వర్తిస్తుంది. కొన్ని సార్లు మన డిజిటల్‌ లావాదేవీలు, బ్యాంకులో ఉండే మన సొమ్ముకూ బీమా లభిస్తుంది. మరికొన్ని కార్డులు ఆసుపత్రి ఖర్చులను పూర్తిగా చెల్లించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే, ఇవన్నీ ఒక కార్డులో లభించవు. మన అవసరాన్ని బట్టి మనమే మనకు ఉపయోగపడే కార్డును తీసుకోవాలి.

బిల్లు సకాలంలో చెల్లించండి...

పైన చెప్పిన ప్రయోజనాలన్నీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ, క్రెడిట్‌ కార్డుపై తీసుకునే సొమ్ము ఒకరకంగా అప్పులాంటిదే అన్న విషయం మరిచిపోవద్దు. అవసరానికి మించి వాడినా.. సకాలంలో బిల్లు చెల్లించకపోయినా.. కార్డు ప్రయోజనాల్ని అనుభవించలేం. బకాయిపై చెల్లించే వడ్డీ ఎక్కువ మొత్తంలో ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి.. కార్డుని సక్రమంగా ఉపపయోగించుకుంటే వచ్చే రాయితీయే పైన చెప్పిన ప్రయోజనాలని గుర్తుంచుకోవాలి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని