ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం

లోక్‌సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్‌ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు.

Updated : 07 May 2024 06:07 IST

జిల్లాలో 60 చోట్ల ఏర్పాటు
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

లోక్‌సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్‌ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాలు సైతం కల్పిస్తున్నారు. తాజాగా ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన చోట్ల ఆదర్శ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. యువత, మహిళలు, దివ్యాంగులు ఉత్సాహంగా ఓటువేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

నియోజకవర్గానికి 12 చొప్పున..

జిల్లాలో ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోలు, మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 60 చోట్ల ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలుగా సిద్ధం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. పోలింగ్‌ రోజు ఆయా కేంద్రాలకు ఓటు వేసేందుకు వచ్చే వారికి కొత్త అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తారు. వాటిలో మౌలిక వసతులు కల్పిస్తారు. కొత్త ఓటర్లకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలకనున్నారు. ఇవే కాకుండా మహిళలు, దివ్యాంగులు, యువత నిర్వహించే కేంద్రాలు కూడా ఉంటాయి.

శాసనసభ ఎన్నికల్లో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్‌ కేంద్రం

మహిళలే నిర్వహించేవి 25..

జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండగా రెండు చోట్ల మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. వారు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చేలా పొదుపు సంఘాల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మహిళలు మాత్రమే నిర్వహించే పోలింగ్‌ కేంద్రాలు జిల్లాలో 25 ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఓటర్లలో మహిళలు ఎక్కువగా ఉన్న పోలింగ్‌ కేంద్రాలను గుర్తిస్తున్నారు. నియోజకవర్గానికి 5 చొప్పున ఉంటాయి. ఆయా కేంద్రాల్లో ఎన్నికల విధులను మహిళలు మాత్రమే నిర్వహిస్తారు.  

దివ్యాంగులకు సైతం..

దివ్యాంగులు అంతా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం  ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఓటు హక్కు వినియోగంపై కలెక్టరేట్‌లో అవగాహన కల్పించారు. గ్రామాల్లోనూ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి దివ్యాంగుల వివరాలు సేకరించారు. ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటున్న వారి నుంచి ఫారం 12డి దరఖాస్తులను స్వీకరించి ఇంటివద్దకే వెళ్లి ఓటు వేయించారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చోట్ల ర్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున వీరి కోసం ఆదర్శ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ నిర్వహణ చూసే వారంతా దివ్యాంగులే.

యువతపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో మొత్తం ఓటర్లలో సగానికి పైగా యువతే ఉన్నారు. వీరు ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనేలా, ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు స్వీప్‌ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువ ఓటర్లను ఆకట్టుకునేలా ప్రతి నియోజకవర్గంలో ఒక కేంద్రాన్ని గుర్తించారు. ఈ కేంద్రాల్లో పోలింగ్‌ విధులు నిర్వహించే వారంతా యువతే ఉంటారు.

జిల్లాలో మొత్తం నియోజకవర్గాలు: 5
ఓటర్లు: 14,27,421
మహిళలు: 7,11,873
దివ్యాంగులు: 18,137
యువత(18-19 ఏళ్లు): 27,482

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని