రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్‌హెచ్‌ఏఐ కసరత్తు

రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్‌ జామ్‌ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి.

Updated : 07 May 2024 07:37 IST

దిల్లీ: రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్‌ జామ్‌ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు ఇవి ప్రధాన కారణమవుతున్నాయి. ఫలితంగా ప్రాణనష్టం కూడా ఎక్కువగా జరుగుతోంది. దీనికి పరిష్కారం కనుగొనేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) సిద్ధమైంది. రహదారిపై గుంత ఏర్పడినప్పుడు దానంతట అదే పూడుకుపోయే సాంకేతికతపై కసరత్తు చేస్తోంది. సాధారణంగా రహదారులపై ఏదైనా గుంత ఏర్పడితే దాన్ని సిబ్బందే పూడ్చాలి. ముఖ్యంగా వర్షాకాలం ఈ గోతుల్లో నీరు నిలిచిపోయి రోడ్లు మరింత దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో రహదారుల మన్నికను పెంచడానికి వినూత్న, సంప్రదాయేతర విధానాలపై ఎన్‌హెచ్‌ఏఐ ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం రోడ్ల నిర్మాణం కోసం తారు, కంకర రాళ్లు, బైండర్‌,    ఫిల్లర్‌తో కూడిన అస్ఫాల్ట్‌ మిశ్రమాన్ని వాడుతున్నారు. కొంతకాలానికి ఆ రోడ్డులోని తారు క్షీణతకు గురవుతుంది. ఫలితంగా అస్ఫాల్ట్‌లో పగుళ్లు ఏర్పడతాయి. అంతిమంగా అవి ప్రమాదకరమైన గుంతలుగా మారిపోతాయి. ఈ క్షీణతను ఎదుర్కొనే ఉద్దేశంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై ఎన్‌హెచ్‌ఏఐ మదింపు జరుపుతోంది. చిన్నపాటి గుంత లేదా పగుళ్లు ఏర్పడగానే వాటంతట అవే పూడుకుపోయేందుకు గానూ రహదారుల నిర్మాణంలో సెల్ఫ్‌ హీలింగ్‌ మెటీరియల్‌ను వాడనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో స్టీల్‌ ఫైబర్స్‌, తారు ఉంటాయి. గుంత ఏర్పడగానే తారు వేడెక్కి, దానంతట అదే పూడుకుపోతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొన్ని జాతీయ రహదారులపై దీన్ని పరీక్షిస్తున్నారు. ఈ మెటీరియల్‌ను వినియోగించడం వల్ల ఎంతమేర ప్రయోజనం కలగనుంది..? దానికయ్యే ఖర్చు ఎంత? వంటివీ అంచనా వేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని