ఎడాపెడా కొనేస్తున్నారా? 30 రోజులు ఆగండి! - Try the 30 day Rule to control your expenses
close

Updated : 17/06/2021 16:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎడాపెడా కొనేస్తున్నారా? 30 రోజులు ఆగండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో ఆఫర్లు కనిపించగానే కొందరు ఆకర్షితులవుతుంటారు. అవసరం లేకపోయినా కొనడానికి సిద్ధపడిపోతుంటారు. కేవలం ఆఫర్లు బాగున్నాయనే ఒకే ఒక్క కారణంతో కొనేస్తుంటారు. సరే ఎప్పుడైనా అయితే ఓకే.. ప్రతిసారీ ఇలానే అనిపిస్తే..? వెనుకా ముందు చూడకుండా ఎడాపెడా కొనేస్తే? మీ ఆర్థిక ప్రణాళికే ప్రమాదంలో పడొచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి ఇందుకు ఏం చేయాలి? 

మీరు నెల‌కు రూ.60,000-70,000 కంటే ఎక్కువ‌ సంపాదిస్తుంటే అందులో కొంత మొత్తాన్ని మీ ఇష్టాలు, విలాసాల కోసం ఖర్చు చేయడం పెద్ద త‌ప్పు కాదు. అయితే అత్య‌వ‌స‌రం కాని వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌డం మాత్రం మంచిది కాదు. మీకు బాగా న‌చ్చిన‌ప్పుడు లేదా మంచి ఆఫ‌ర్ ఉన్న‌ప్పుడు మీకు అవ‌స‌ర‌మ‌య్యే వాటినే కొనుగోలు చేయాలి. ఇటువంటి అనుకోకుండా చేసే కొనుగోళ్లు.. మీకు తెలీకుండానే మీ ఆర్థిక ప్రణాళికను కాలక్రమేణా దెబ్బ‌తిస్తాయి. అయితే ఇక్క‌డ ఎంత డబ్బు వెచ్చించామన్నది కాదు.. అదో అలవాటుగా మారుతోందన్న విషయాన్ని మీరు ముందుగా గుర్తించాలి. అలాంటి వారి కోసమే.. 30 రోజుల నియమం. ఇది ఆలోచించకుండా ఖర్చు చేసే అలవాటును అధిగమించడంతో పాటు ఆర్థిక క్రమశిక్షణను నేర్పుతుంది. భవిష్యత్‌లో మంచి నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఎలా పనిచేస్తుంది?

ఈ నియమం చాలా సులభం. మీరు ఏదైనా కొనాల‌నుకుంటే దాన్ని కొనుగోలును ఓ 30 రోజులు వాయిదా వేయండి. అప్పటికీ మీరు ఆ వస్తువును కొనాలనుకుంటే అప్పుడు తీసుకోండి. ఆ 30 రోజుల త‌ర్వాత‌ మీరు దాని గురించి మరిచిపోతే లేదా మీకు అది అవసరం లేదని నిపిస్తే ఆ డబ్బు ఆదా అయినట్లే. ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు చూసి ఆక‌ర్షితులై ఖ‌ర్చుల నియంత్రించ‌లేక‌ వస్తువులను కొనుగోలు చేసేవారైతే మీకు ఈ 30 రోజుల నియమం సాయపడుతుంది.

దీన్ని మ‌రింత క‌చ్చితంగా పాటించాల‌నుకుంటే వస్తువు ధరకు స‌మాన‌మైన‌ డబ్బును ఒక‌ కవరులో పెట్టి 30 రోజులు ప‌క్క‌న పెట్టండి. లేదంటే 30 రోజుల పాటు డిపాజిట్‌ చేయండి. మీకు అవసరం లేని డ‌బ్బును ఇందుకు కేటాయించాలి. ఒక విధంగా, మీరు కొనుగోలు కోసం బడ్జెట్‌ను ప‌క్క‌న పెట్టారు. 30 రోజుల త‌ర్వాత ఆ వ‌స్తువు మీకు అవ‌స‌రం లేదనుకుంటే ఆ మొత్తాన్ని మీ భవిష్యత్‌ లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టండి. ప్రారంభంలో ఈ నియమం నచ్చకపోవచ్చు. కానీ ఇలాంటి కొన్ని సందర్భాలు ఎదురైతే దాని లాభం మీరే తెలుసుకుంటారు. దీంతో కాలక్రమేణా మీరు అనుకోకుండా చేసే కొనుగోళ్ల‌ను, ఖ‌ర్చుల‌ను నియంత్రించుకోగలుగుతారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని