స్కోరు తగ్గకుండా...కార్డు.. రద్దు చేసుకోండిలా.. - credit score
close

Updated : 07/05/2021 10:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్కోరు తగ్గకుండా...కార్డు.. రద్దు చేసుకోండిలా..

మీ దగ్గర నాలుగైదు క్రెడిట్‌   కార్డులున్నాయా? అందులో ఒకటి రెండు రద్దు చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? దీన్ని ఆచరణలో పెట్టేముందు పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. మరి అవేమిటో చూద్దామా..

మీ దగ్గర ఉన్న క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకోవడం సులువే. కానీ, ఏ కార్డును రద్దు చేసుకోవాలనేది నిర్ణయించడం అంత సులభం కాకపోవచ్చు. ముఖ్యంగా క్రెడిట్‌ స్కోరు తగ్గకుండా చూసుకోవాలి. క్రెడిట్‌ కార్డును వెనక్కి ఇచ్చేందుకు పలు కారణాలు ఉండొచ్చు.. వడ్డీ అధికంగా ఉండటం, ఆ కార్డుతో వచ్చే ప్రయోజనాలు మీకు అంత ఉపయోగపడకపోవడం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ హామీతో వచ్చిన కార్డును సాధారణ కార్డుగా మార్చడం, వార్షిక రుసుములు అధికం, ఎక్కువ క్రెడిట్‌ కార్డులుండటం వల్ల  వాటి నిర్వహణ కష్టం కావడం తదితర కారణాలతో కార్డును వెనక్కి ఇచ్చేయొచ్చు. 

క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం..

క్రెడిట్‌ కార్డును రద్దు చేస్తున్నామంటే.. ఒక క్రెడిట్‌ ఖాతాను మూసేస్తున్నట్లే. అంటే.. మీ దగ్గర అందుబాటులో ఉన్న రుణ మొత్తం తగ్గిపోతుంది. దీనివల్ల ఇతర కార్డుల్లో ఉన్న రుణ వినియోగ నిష్పత్తి పెరుగుతుంది. ఉదాహరణకు మీ దగ్గర నాలుగు క్రెడిట్‌ కార్డులున్నాయి.. ఒక్కోదాని పరిమితి రూ.50వేలు. మీరు నెలకు ఈ కార్డులన్నింటిలో కలిపి రూ.50,000 ఖర్చు చేస్తారనుకుందాం. అప్పుడు మీ రుణ వినియోగ నిష్పత్తి 25శాతం. ఒకవేళ మీరు ఇందులో ఒక కార్డును వెనక్కి ఇచ్చేస్తే అప్పుడు మీ రుణ వినియోగ నిష్పత్తి 33శాతానికి చేరుకుంటుంది.

మీ రుణ వినియోగ నిష్పత్తి 30శాతం కన్నా మించితే.. మీరు అప్పులపై అధికంగా ఆధారపడతారని బ్యాంకులు భావిస్తాయి. దీంతోపాటు మీ రుణ వినియోగం ఎక్కువగా ఉన్నప్పుడు క్రెడిట్‌ స్కోరూ తగ్గుతుంది. 

పాత క్రెడిట్‌ కార్డు ఉన్నప్పుడు.. దాని బిల్లుల చెల్లింపుల చరిత్ర అధికంగా ఉంటుంది. వాటిని క్రమం తప్పకుండా చెల్లిస్తే.. మీ రుణ చరిత్రపై ఒక అవగాహన వస్తుంది. అందుకే, 10 ఏళ్లకు మించి ఉపయోగిస్తున్న కార్డులను రద్దు చేసుకోకపోవడమే మంచిది.

వద్దు అనుకుంటే..
1.కార్డుపైన ఉన్న రివార్డు పాయింట్లను ముందే వాడుకోండి. ఆ తర్వాతే రద్దు చేసుకోండి.

2.కార్డు బిల్లును అణాపైసలతో సహా తీర్చేయండి. రూపాయి బకాయి ఉన్నా.. కార్డు వివరాల్లో అది కనిపిస్తూనే ఉంటుంది. 

3.కార్డు ఖాతాను ముగించేయడం.. సెటిల్‌మెంట్‌ చేసుకోవడం.. ఈ రెండింటి మధ్య ఎంతో తేడా ఉంది. పూర్తి బిల్లు బకాయి చెల్లించి, కార్డును రద్దు చేసుకోవడాన్ని ముగించేయడంగా చెప్పొచ్చు. కానీ, చెల్లించాల్సిన బిల్లులో కొంత రాయితీ అడిగి, మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు బేరమాడితే.. దాన్ని సెటిల్‌ అంటారు. ఇది క్రెడిట్‌ స్కోరుపై, రుణ చరిత్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. వీలైనంత వరకూ కార్డు బిల్లును పూర్తిగా చెల్లించేయడమే మేలు.

4.మీరు రద్దు చేయబోతున్న కార్డుపై ఏవైనా అనుబంధ కార్డులున్నాయా చూడండి. వాటినీ కలిపి రద్దు చేయండి.

5.మీ కార్డుతో ఏమైనా ఆటోమేటిక్‌ చెల్లింపులు చేస్తున్నారా.. ముందు వాటిని నిలిపి వేయండి. వేరే కార్డుతో ఆ చెల్లింపులు జరిగే ఏర్పాటు చేయండి.

6.బ్యాంకుకు మీరు కార్డును రద్దు చేసుకుంటున్న సమాచారాన్ని ఇవ్వండి. లిఖిత పూర్వకంగా ఆ విషయాన్ని తెలియజేయండి. మీ పేరు, చిరునామా, కార్డు ఖాతా సంఖ్య, ఫోన్‌ నెంబరు తదితర వివరాలన్నీ అందులో ఉండేలా చూసుకోండి. బ్యాంక్‌ ఆన్‌లైన్‌ ఖాతాద్వారా కార్డు రద్దుకు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.

7.కార్డు రద్దు చేసిన సమాచారం అందిన నెల తర్వాత మరోసారి దీన్ని ధ్రువీకరించుకోండి.  మీ క్రెడిట్‌ స్కోరు నివేదికను తెప్పించుకోండి. అందులో మీ కార్డు దగ్గర ‘క్లోజ్డ్‌’ అని ఉందా లేదా చూసుకోండి.

8.ఒకవేళ ఇంకా కార్డు అమల్లోనే ఉంది అని పేర్కొంటే.. బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రానికి ఫిర్యాదు చేయండి.

మీరు వచ్చే ఆరు నెలల్లో ఏదైనా రుణం తీసుకునే విషయాన్ని ఆలోచిస్తుంటే.. అప్పటి వరకూ కార్డులను రద్దు చేసుకోకపోవడమే మంచిది. - అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

పరిహారం నెలనెలా వచ్చేలా... 

కొత్తతరం పాలసీదారులకు ఆర్థిక అండ అందించే లక్ష్యంతో మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వినూత్న జీవిత బీమా పాలసీని ఆవిష్కరించింది. ఈ మ్యాక్స్‌ లైఫ్‌ స్మార్ట్‌ సెక్యూర్‌ ప్లస్‌ ప్లాన్‌.. పూర్తి రక్షణకే పరిమితమయ్యే టర్మ్‌ ప్లాన్‌. వ్యవధి తీరిన తర్వాత చెల్లించిన ప్రీమియంలో కొంత భాగం వెనక్కిచ్చే వీలుంది. దీంతోపాటు పాలసీదారుడు నిర్ణీత వ్యవధి తర్వాత పాలసీ నుంచి వెనక్కి వెళ్లిపోయే అవకాశాన్నీ కల్పిస్తోంది. ఈ సమయంలో చెల్లించిన మొత్తం ప్రీమియాలూ వెనక్కిచ్చేస్తారు. పాలసీని క్లెయిం చేసుకున్న సందర్భంలో నామినీ ఇష్టాన్నిబట్టి పరిహారాన్ని ఒకేసారి చెల్లిస్తారు. నిర్ణీత కాలం పాటు పరిహారాన్ని నెలనెలా అందుకోవచ్చు. మరో ఆప్షన్‌లో కొంత మొత్తం తీసుకొని, మిగతా మొత్తాన్ని కొన్ని నెలలపాటు చెల్లించే ఏర్పాటు చేసుకోవచ్చు. డిజేబిలిటీ రైడర్, ప్రీమియం వైవర్, తీవ్ర వ్యాధులకు, యాక్సిడెంటల్‌ కవర్‌లాంటి అనుబంధ పాలసీలనూ ఎంచుకునే వీలుంది. 18ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు వారి వరకూ ఈ పాలసీని తీసుకోవచ్చు. దంపతులిద్దరూ కలిసి ఉమ్మడిగానూ ఈ పాలసీలో చేరొచ్చు. మొత్తం 40 రకాల క్రిటికల్‌ ఇల్‌నెస్‌లకు పరిహారం ఇచ్చేలా అనుబంధ పాలసీని తీసుకోవచ్చు. ఇవేకాకుండా సమయానుకూలంగా పాలసీ విలువ పెరిగే ఆప్షనూ ఉంది. పాలసీదారులకు ప్రీమియం చెల్లించడంలో ఇబ్బంది ఎదురైతే 12 నెలల తర్వాత చెల్లించే వెసులుబాటునిస్తుంది. పాలసీ కొనసాగింపులో ఎలాంటి ఇబ్బందీ ఉండదు.  ఇలా పాలసీ వ్యవధిలో 10 ఏళ్ల తర్వాత నుంచి రెండుసార్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. 


 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని