డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఓ రాత్రి..: పూరీ - Blind from Puri Musings in puri jagannadh voice
close
Published : 12/10/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఓ రాత్రి..: పూరీ

వారి మాటలకు కన్నీరు పెట్టుకున్నా

హైదరాబాద్‌: జీవితాంతం చీకట్లో బతకడం నరకమని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. ఆయన పూరీ మ్యూజింగ్స్‌లో ‘బ్లయిండ్‌’ గురించి మాట్లాడారు. సాధారణ ప్రజలకంటే అంధులు ఎంతో గొప్ప వారని వివరించారు. తను చదువుకున్న రోజుల్లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.

‘నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో నా పక్క గదిలో ఇద్దరు కుర్రాళ్లుండేవారు. ఇద్దరూ అంధులు, పుట్టుకతోనే చూపు లేదు. రోజూ రాత్రి నేను ఎప్పుడు వస్తానా? అని ఎదురు చూస్తుండేవారు. ఓ రోజు రాత్రి నేను ఫస్ట్‌ షో, సెకండ్‌ షో చూసి రూమ్‌కి వెళ్లా. వాళ్లు నా కోసం బయట ఎదురుచూస్తున్నారు. ‘ఏంటి నిద్రపోలేదా?’ అని అడిగా. ‘మీరు అలసిపోకపోతే.. ఓ సహాయం చేస్తారా? మా కోసం ఈ పుస్తకంలో ఒక పాఠం చదివి వినిపిస్తారా?’ అని అడిగారు. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అన్నీ ఉండి నేను చదవ లేదు, కానీ ఎలాగైనా చదువుకోవాలనే తపన వాళ్లది. ఆ రోజు నుంచి అప్పుడప్పుడూ రాత్రిపూట వాళ్ల పుస్తకాలు నేను చదివితే.. అది విని, పడుకునేవారు. ఆ తర్వాత వాళ్లు బీఏ ఫస్ట్‌క్లాస్‌లో పాస్‌ అయ్యారు. నేను బీఎస్సీ ఫెయిల్‌ అయ్యా. కాలేజీ నుంచి వెళ్తూ.. ‘రైల్వే స్టేషన్‌లో అనౌన్స్‌మెంట్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తాం’ అని చెప్పారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది’.

‘వాళ్లు ఏదైనా ముట్టుకుంటే ఆ టచ్‌ జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. కానీ మనం మద్యానికి బానిసలై ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మనందరి కంటే అంధులకు ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. వాళ్లకు ఉన్న చురుకుదనంలో మనకు 10 శాతం కూడా ఉండదు. మనతో పోలిస్తే వాళ్లు ఎన్నో రెట్లు మేలు. ప్రపంచంలో కళ్లు లేకపోయినా ఎంతో మంది చదువుకోగలుగుతున్నారు. దీనికి కారణం బ్రెయిలీ లిపి.. ఎన్నో ఏళ్ల క్రితం ఫ్రాన్స్‌లో లూయిస్‌ బ్రెయిలీ అనే కుర్రాడు ప్రమాదంలో కళ్లు పోగొట్టుకుని.. తన లాంటి వారి కోసం బ్రెయిలీ లిపి కనిపెట్టాడు. అంధులతో మాట్లాడుతుంటే మనం కూడా భావోద్వేగానికి గురవుతుంటాం. జీవితాంతం చీకట్లో బతకడం అంటే నరకం..’ అని పూరీ చెప్పారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని