ఇక ‘హ్యూమన్‌ ఛాలెంజ్‌’కి వ్యాక్సిన్‌ సిద్ధం! - Human Challenge Trials
close
Updated : 24/09/2020 14:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇక ‘హ్యూమన్‌ ఛాలెంజ్‌’కి వ్యాక్సిన్‌ సిద్ధం!

వ్యాక్సిన్‌ ప్రయోగాలు జరిపేందుకు బ్రిటన్‌ ఏర్పాట్లు!

లండన్‌: వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో భాగంగా బ్రిటన్ మరో ముందడుగు వేయనుంది. ఇప్పటివరకు ఆరోగ్యవంతులపై ప్రయోగాలు జరుపుతుండగా.. తాజాగా ‘హ్యూమన్‌ ఛాలెంజ్’‌ ప్రయోగాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తద్వారా వ్యాక్సిన్‌ సమర్థతను కచ్చితంగా పరీక్షించే వీలుంటుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే తుదిదశకు చేరుకున్న వ్యాక్సిన్‌ ప్రయోగాలకు, తాజా విధానం మరో ముందడుగు కానుంది.

ఈ ప్రయోగాల్లో భాగంగా క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనే వాలంటీర్లకు ఉద్దేశపూర్వకంగా వైరస్‌ వ్యాపింపజేసి, వ్యాక్సిన్‌ సమర్థతను పరీక్షిస్తారు. ‘హ్యూమన్‌ ఛాలెంజ్’‌గా పిలిచే ఈ ప్రయోగాలను ప్రత్యేక క్వారంటైన్‌ వసతుల మధ్య జరుపుతారు. లండన్‌లో జరిపే ఈ ప్రయోగాల్లో దాదాపు 2వేల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్లు అమెరికాకు చెందిన ‘1డే సూనర్’‌ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. లండన్‌ ప్రభుత్వ ఆర్థిక సాయంతో చేపట్టనున్న ఈ ప్రయోగాల్లో, దాదాపు 100నుంచి 200మంది వాలంటీర్లకు కావాల్సిన బయోక్వారంటైన్‌ సౌకర్యాలను 1డే సూనర్‌ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

బ్రిటన్‌లో జరిగే ఈ ‘హ్యూమన్‌ ఛాలెంజ్‌’ ప్రయోగాలను ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రయోగాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కరోనా వైరస్‌పై పరిశోధనలో భాగంగా ఇప్పటికే వివిధ సంస్థల భాగస్వామ్యంతో చర్చలు కొనసాగిస్తున్నామని..ప్రస్తుతానికి ఈ ప్రయోగాలకు సంబంధించి ఇంతకుమించి సమాచారం వెల్లడించలేమని ఇంపీరియల్‌ కాలేజీ అధికార ప్రతినిధి అభిప్రాయపడ్డారు. యూకే నియంత్రణ సంస్థలు కూడా ఇప్పటివరకు వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ప్రయోగాల్లో భాగస్వామిగా ఉండనున్న 1డే సూనర్‌ మాత్రం హ్యూమన్‌ ఛాలెంజ్‌ కోసం ప్రయోగాల ఏర్పాట్లను ధృవీకరించింది. వీటిని జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్న బ్రిటన్‌ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని, ఆసక్తి ఉన్న వాలంటీర్లు తమ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చని ప్రకటించింది.

ఏమిటీ ఛాలెంజ్‌ ట్రయల్స్‌..?

ఇప్పటివరకు జరుగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌లో కేవలం ఆరోగ్యవంతులపైనే వ్యాక్సిన్‌ను ప్రయోగిస్తున్నారు. తద్వారా శరీరంలో యాంటీబాడీల స్థాయిని అంచనా వేస్తున్నారు. కానీ, ఛాలెంజ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో మాత్రం, వీటిలో పాల్గొన్న వాలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చిన తరువాత వారికి వైరస్‌ సోకేలా చేస్తారు. అనంతరం వైరస్‌ సమర్థతను పరీక్షిస్తారు. దీంతో వ్యాక్సిన్‌ పనితీరు కచ్చితంగా తెలిసే ఆస్కారం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రయోగాల కోసం ప్రత్యేకంగా బయో కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాన్ని ఏర్పాటుచేస్తారు. ఇప్పటికే ఫ్లూ, మలేరియా, కలరా వంటి వ్యాధుల చికిత్స, వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఇటువంటి ప్రయోగాలను చేపట్టారు. తాజాగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌, చికిత్స పరిశోధనల్లో ఈ తరహా ప్రయోగాలు ఎంతవరకు సత్ఫలితాలిస్తాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేయనున్నారు. జనవరి నెలలో వీటిని చేపట్టడానికి ప్రయత్నాలు జరుగుతుండగా.. ఈ ప్రయోగాల్లో ఏ కంపెనీ తయారుచేసిన వ్యాక్సిన్‌ను పరీక్షిస్తున్నారనే విషయం తెలియరాలేదు. అయితే, బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికా, ఫ్రాన్స్‌కు చెందిన సనోఫికి చెందిన వ్యాక్సిన్‌లు మాత్రం ఈ ప్రయోగాల్లో వాడడం లేదని సమాచారం.

ఇదిలాఉంటే, హ్యూమన్‌ ఛాలెంజ్ ప్రయోగాలపై అంతర్జాతీయంగా నిపుణుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. అమెరికాలో ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచీ కూడా ఈ ప్రయోగాలను గతంలోనే వ్యతిరేకించారు. అయితే, వ్యాక్సిన్‌ సమర్థతను పరీక్షించేందుకు మాత్రం ఇటువంటి ప్రయోగాలు దోహదపడతాయని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని