Cyclone Tauktae: కొవిడ్‌ ప్రభావిత రాష్ట్రాలపై..తౌక్టే విశ్వరూపం! - cyclone tauktae hits covid severity states
close
Published : 17/05/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cyclone Tauktae: కొవిడ్‌ ప్రభావిత రాష్ట్రాలపై..తౌక్టే విశ్వరూపం!

ఐదు రాష్ట్రాలపై తుపాను ప్రభావం

ముంబయి: ఓవైపు కరోనా వైరస్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోన్న సమయంలోనే.. పలురాష్ట్రాలను ‘తౌక్టే’ తుపాను వణికిస్తోంది. అల్పపీడనం నుంచి తీవ్ర తుపానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.  ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోన్న ఈ తుపాను, మరికొన్ని గంటల్లోనే గుజరాత్‌ వద్ద తీరం దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా అక్కడ 50 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ఈ తుపాను ప్రభావంతో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌ రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రభావిత రాష్ట్రాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టింది.

కేరళ అతలాకుతలం..

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న కేరళను తాజాగా ‘తౌక్టే’ తుపాను అతలాకుతలం చేస్తోంది. తుపాను కారణంగా కురుస్తోన్న భారీ వర్షాలకు వందల సంఖ్యలో ఇళ్లు, చెట్లు నేలకొరిగాయి. దీంతో పలు జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. వర్షాల కారణంగా పలు ప్రధాన నదుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. ఇక నిత్యం అక్కడ 30వేల కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మరణాల సంఖ్యను కేరళ నియంత్రించగలుగుతోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 29 వేల పాజిటివ్‌ కేసులు వెలుగుచూడగా 89 మరణాలు సంభవించాయి.

కర్ణాటకలో భారీ వర్షాలు..

కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న  కర్ణాటకకు ‘తౌక్టే’ రూపంలో మరో ఆపద ముంచుకొచ్చింది. ఇప్పటికే నిత్యం అక్కడ 30వేల పాజిటివ్‌ కేసులు, 400లకు పైగా కొవిడ్‌ మరణాల సంభవిస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో 6లక్షలకు పైగా కరోనా క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇదే సమయంలో ‘తౌక్టే’ తీవ్ర ప్రభావాన్ని చూపెడుతోంది. తుపాను ప్రభావంతో కర్ణాటకలో తీవ్ర గాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. రంగంలోకి దిగిన 20 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

మహారాష్ట్ర అప్రమత్తం..

కొవిడ్‌ 19 సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతికి మహారాష్ట్ర వణికిపోతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ నిత్యం దాదాపు వెయ్యి మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో అక్కడ 34 వేల పాజిటివ్‌ కేసులు బయటపడగా, 974 మంది మృత్యువాతపడ్డారు. ఇదే సమయంలో ‘తౌక్టే’ ప్రభావంతో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. పుణెలోని పులు గ్రామాల్లో దాదాపు 70 ఇళ్లు కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో తుపాను పరిస్థితిను ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సమీక్ష నిర్వహించారు. ముందస్తుగా పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.

గోవా తీరం అల్లకల్లోలం..

దేశంలోని అత్యధిక కొవిడ్‌ పాజిటివిటీ ఉన్న రాష్ట్రాల్లో గోవా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ కరోనా పాజిటివిటీ రేటు దాదాపు 50శాతంగా ఉంది. దీంతో ఇప్పటికే ఆసుపత్రుల పడకలు, ఆక్సిజన్‌ కొరత అక్కడి కొవిడ్ బాధితులను వేధిస్తోంది. ఇదే సమయంలో వచ్చిపడిన ‘తౌక్టే’ తుపాన్‌ తీవ్రతతో గోవా తీరం అల్లకల్లోలం అవుతోంది. తీరంలో సముద్రపు అలలు 2 మీటర్ల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. తుపాను ప్రభావానికి ఇద్దరు మరణించినట్లు సమాచారం. వందల సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి. ప్రస్తుత పరిస్థితిని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్రానికి అన్ని విధాల సహాయం అందజేస్తామని తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని