కరోనాపై పోరు: మోదీకి మాజీ ప్రధాని సూచనలు - devegowda writes a letter to pm modi
close
Updated : 26/04/2021 19:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై పోరు: మోదీకి మాజీ ప్రధాని సూచనలు

బెంగళూరు: దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ పలు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మే 2న నాలుగు రాష్ట్రాలు/ ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయోత్సవ వేడుకలను అదుపుచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, దేశంలో ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఆర్నెల్ల పాటు వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్నెల్ల వరకూ భారీ బహిరంగ సభలనూ నిషేధించాలన్నారు. ఈ కాలంలో ఎన్నికల సంఘం కూడా సురక్షితంగా ఎన్నికలు నిర్వహించేలా కొత్త నిబంధనల్ని తయారు చేసుకోగల్గుతుందన్నారు. అదే సమయంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగవంతం చేయాలని సూచించారు. కరోనాకు కట్టడి, వ్యాక్సినేషన్‌ వేగవంతం, ప్రజల కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొనే నిర్మాణాత్మక నిర్ణయాలు, చర్యలకు తన మద్దతు ఉంటుందని దేవెగౌడ పేర్కొన్నారు.

* మహమ్మారిపై పోరాటంలో వేగంగా పనిచేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య వ్యవస్థ, కొవిడ్‌ నియంత్రణ వ్యవస్థను వికేంద్రీకరించాలి. 

* కొవిడ్‌ నియంత్రణకు రాష్ట్రాల స్థాయిలో రాజధాని నగరాల్లో ఉన్న వార్‌ రూమ్‌లు సరిపోవు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వార్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలి.

* పెద్ద నగరాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. నగరాల్లోనే కాకుండా మిగతా జిల్లాలు, తాలుకా కేంద్రాల్లో వైరస్‌ ప్రమాదం అధికంగా ఉంది. గ్రామస్థాయి క్లస్టర్లపైనా ఎక్కువ దృష్టి సారించడం అవసరం. 

* ఈ పోరాటంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ మంత్రిత్వశాఖలను రంగంలోకి దించి సమన్వయం చేసుకోవాలి. ప్రస్తుతం నెలకొన్న ఆరోగ్య సంక్షోభం నేపథ్యంలో కేవలం వైద్యశాఖ మాత్రమే కాకుండా అన్ని ప్రభుత్వ శాఖల పాత్ర ఎంతో కీలకం.

* సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో గందరగోళం నెలకొంది. రెండు డోసులు వేసుకున్నా కొందరు వైరస్‌ బారిన పడుతుండటంతో ప్రజల్లో దీనిపై కొంత ఆందోళన ఉంది. ఈ సమయంలో టీకాలు వేసుకున్న వారితో పాటు మిగతా వారి ప్రాణాలకు రక్షణగా నిలుస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు వివరించాలి. 

* టీకా నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వాలకు విశ్వాసం ఏర్పడిన తర్వాతే వ్యాక్సినేషన్‌పై ప్రజలకు డెడ్‌లైన్లు విధించాలి. టీకా పంపిణీ పెద్ద ఎత్తున జరిగేందుకు ప్రజా ప్రతినిధులందరికీ నియోజకవర్గాల వారీగా టార్గెట్లు ఇవ్వాలి.

* టీకా ధరలపైనా గందరగోళం నెలకొంది. పేదలను దృష్టిలో పెట్టుకొని ధరలను నిర్ణయించాలి. ఒకవేళ ప్రభుత్వం పౌరులందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని నిర్ణయిస్తే అదో గొప్ప మానవీయ కార్యక్రమంగా నిలుస్తుంది.

* కరోనాపై పోరాటంలో ముందుండి పనిచేస్తున్న కొవిడ్‌ వారియర్లు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.

* రాష్ట్రాల మధ్య సమన్వయం చేసుకొనేందుకు ప్రతి రాష్ట్రం ప్రత్యేక కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులకు ఒక మంత్రిని ఇన్‌ఛార్జిగా పెట్టుకోవాలి. కరోనా వైరస్‌కు రాజకీయ పక్షపాతం ఉండదు. రాజకీయాలకతీతంగా ఈ వైరస్‌పై దేశమంతా యుద్ధం చేయాలి. 

* దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రజారోగ్య మౌలిక వసతులను మెరుగుపరుచుకొనేలా తక్షణమే చర్యలు ప్రారంభించాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని