కేజ్రీవాల్‌పై పోటీగా క్యాబ్‌ డ్రైవర్లు..!
close
Published : 22/01/2020 14:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేజ్రీవాల్‌పై పోటీగా క్యాబ్‌ డ్రైవర్లు..!

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై దాదాపు 93 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈసారి కూడా సీఎం కేజ్రీవాల్‌ న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ నిన్న నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన నామినేషన్‌ దాఖలుకు ఆరుగంటలు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో 93 మంది సీఎంకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. సీఎంపై బరిలోకి దిగిన వారిలో ఐదుగురు క్యాబ్‌ డ్రైవర్లు, పది మంది దిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(డీటీసీ) మాజీ ఉద్యోగులు, నలుగురు సామాజిక కార్యకర్తలతో పాటు ‘ఛక్‌ దే’ చిత్రంలో అతిథి పాత్ర పోషించిన జాతీయ స్థాయి హాకీ అథ్లెట్‌ కూడా ఉండటం విశేషం.

‘డీటీసీ కాంట్రాక్టు ఉద్యోగులందరికీ సమానంగా వేతనం ఇవ్వాలని కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో నేను ఉన్నాను. దీంతో నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. రాజకీయ పరంగా ఆయన్ను ఎదుర్కొనేందుకు మాకున్న ఒకే ఒక్క అవకాశం ఇదే. అందుకే ఆయనపై పోటీ చేస్తున్న’ అని సీఎంకు వ్యతిరేకంగా బరిలోకి దిగిన మనోజ్‌ శర్మ అనే అభ్యర్థి తెలిపారు. క్యాబ్‌ డ్రైవర్‌ పవన్‌ కుమార్‌ కూడా సీఎంకు ప్రత్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నామినేషన్‌ వేసేందుకు కేజ్రీవాల్‌కు 45నెంబరు టోకెన్‌ ఇవ్వగా పవన్‌కు 44 నెంబరు టోకెన్‌ వచ్చింది. ‘ట్యాక్సీ డ్రైవర్లు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రస్తుత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆటోరిక్షా ధరలను సవరించారు. కానీ ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఎటువంటి పథకాలను తీసుకురాలేదు. క్యాబ్‌ డ్రైవర్లు ఎమ్మెల్యేలుగా మారాల్సిన సమయం వచ్చింది’ అని పవన్‌ కుమార్‌ అన్నారు. 
కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా జాతీయస్థాయి అథ్లెట్‌ శైలేంద్ర సింగ్‌ కూడా బరిలోకి దిగారు. ఆయన అంజాన్‌ ఆద్మీ పార్టీ నుంచి బరిలోకి దిగారు. కేజ్రీవాల్‌ కంటే మెరుగైన సిద్ధాంతాలతో పాలన అందించగల సామర్థ్యం తమకుందని నిరూపించేందుకు బరిలోకి దిగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 8న హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని