పదేపదే రోడ్లు మూసేస్తున్నారు: కేటీఆర్‌ - telugu-news-minister ktr letter to defence minister rajnath singh
close
Updated : 15/07/2021 19:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పదేపదే రోడ్లు మూసేస్తున్నారు: కేటీఆర్‌

లోకల్ మిలిటరీ అథారిటీ వైఖరిపై రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడం పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లోకల్ మిలిటరీ అథారిటీ పరిధిలో ఉన్న కీలకమైన అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్డు, వెల్లింగ్టన్ రోడ్డు, ఆర్డినెన్స్ రోడ్డును కొవిడ్ నిబంధనలు కారణంగా చూపించి మూసేశారన్నారు. నిబంధనల పేరుతో రోడ్లను మూసివేయటం వల్ల లక్షలాది మంది నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కేటీఆర్‌ లేఖ రాశారు. కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలిటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

కంటోన్మెంట్ బోర్డుతో సంబంధం లేకుండా లోకల్ మిలిటరీ అథారిటీ రోడ్ల మూసివేతకు పాల్పడుతోందని.. కంటోన్మెంట్ యాక్ట్‌ సెక్షన్-258కి ఇది పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. కంటోన్మెంట్ బోర్డు చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల మేరకు మాత్రమే రోడ్లు మూసివేసే ప్రక్రియ ఉండాలన్నారు. చిన్న చిన్న కారణాలు చూపింది పదేపదే రోడ్లు మూసివేస్తున్నారన్నారు. గతంలోనూ ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం మే, జూన్ నెలల్లో తీసుకున్న కొవిడ్ నియంత్రణ చర్యల వలన రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వరకు తగ్గాయన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నప్పటికీ కరోనా పేరు చెప్పి తాజాగా మరోసారి రోడ్ల మూసివేతకు పాల్పడటం అత్యంత బాధాకరమన్నారు.

స్థానిక మిలిటరీ అధికారుల పరిధిలో ఉన్న రోడ్ల పైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ఇప్పటికే రక్షణ శాఖ కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని రాజ్‌నాథ్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమావేశంలో ఇందుకు సూచనప్రాయంగా అంగీకరించారని, ఈ దిశగా రక్షణ శాఖ తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నామన్నారు. ఈ లోగా మిలిటరీ అధికారులు పదే పదే రక్షణ శాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారన్నారు. రోడ్లు మూసివేయకుండా అదేశాలిచ్చి లక్షలాది మంది హైదరాబాద్ నగర వాసులకు ఊరట కల్పించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని