ఆదిలోనే ఆగిపోయిన సినిమాలేవో తెలుసా? - these telugu movie are stoped due to some reasons
close
Published : 18/09/2020 23:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆదిలోనే ఆగిపోయిన సినిమాలేవో తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: అభిమాన కథానాయకుడి నుంచి కొత్త చిత్రం వస్తుందంటే అభిమానుల్లో ఉండే సందడే వేరు. ఒకప్పుడు ఆ సినిమా విశేషాలను తెలుసుకునేందుకు పత్రికలు, సినీ మ్యాగజైన్లు తిరగేస్తే... ఇప్పుడైతే వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో వెతికేస్తున్నారు. అలాంటిది ఆ సినిమా ఆగిపోయిందని తెలిస్తే, ఉసూరుమంటారు. ఏ ఇండస్ట్రీలోనైనా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. మన తారలకు సంబంధించి కొన్ని సినిమాలు కొబ్బరికాయ కొట్టాక, ఇంకొన్ని సినిమాలు చర్చలు పూర్తయి ఆఖరి దశలో ఆగిపోయాయి. మరి ఆ చిత్రాలేవో ఓసారి చూసేద్దామా!

ఆగిపోయిన చిరు చిత్రాలు

గ్ర కథానాయకుడు చిరంజీవి డేట్స్‌ కోసం నిర్మాతలు ఆయన ఇంటి ముందు నిలబడేవారు. కొంత విరామం తీసుకున్నా, ఇప్పటికీ అదే జోరు కొనసాగుతోంది. చిరు ఇప్పుడూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, ఆయన కథానాయకుడిగా కొన్ని చిత్రాలు మొదలై ఆగిపోయాయి. అలా షూటింగ్‌ మొదలై ఆగిపోయిన వాటిలో హాలీవుడ్‌ చిత్రం ‘అబు - బాగ్దాద్‌ గజదొంగ’ ఒకటి. డచెన్‌ జెర్సీ, సురేశ్‌కృష్ణ సంయుక్త దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అప్పట్లోనే రూ.50 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీయాలని భావించారు. ఇక సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ‘వినాలని ఉంది’ అనే చిత్రాన్ని మొదలు పెట్టి ఆపేశారు. రెండు పాటల కూడా తెరకెక్కించారు. ఇవే కాదు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘భూలోక వీరుడు’, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఆటో జానీ’ చిత్రాలు స్క్రిప్ట్‌ దశలోనే ఆగిపోయాయి.

ఆ సినిమాలన్నీ పవన్‌ చేయాల్సినవే!

చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయమైనా తన నటన, స్టైల్‌, యాక్షన్‌తో తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్న నటుడు పవన్‌ కల్యాణ్‌. రాజకీయాల్లో రాకముందు పవన్‌తో సినిమా చేయాలని అనేకమంది దర్శకులు ఆయనకు కథలు వినిపించేవారు. ‘అతడు’ దగ్గరి నుంచి ‘ఇడియట్‌’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘సత్యాగ్రహి’, ‘కోబలి’, ‘చెప్పాలని ఉంది’ ఇలా పలు చిత్రాల్లో పవన్‌ నటించాల్సి ఉంది. వీటిలో కొన్ని చిత్రాలు వేరే నటులు చేయగా, ‘సత్యాగ్రహి’, ‘జీసెస్‌ క్రైస్ట్‌’ వంటి చిత్రాలు మొదలు పెట్టినా ముందుకు వెళ్లలేదు.

సౌందర్య లేక ఆగిన ‘నర్తనశాల’

భారీ డైలాగులు, పౌరాణిక పాత్రలు పోషించడంలో తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. ఆ స్ఫూర్తితోనే ‘నర్తనశాల’ పేరుతో పౌరాణిక చిత్రాన్ని మొదలు పెట్టి మధ్యలోనే ఆపేశారు బాలయ్య. అందుకు కారణం సౌందర్య మరణం. ద్రౌపది పాత్రలో మరో నటిని ఊహించడం కష్టమని భావించింది చిత్ర బృందం. దీంతో ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. సౌందర్య లాంటి నటి కనపడితే తప్పకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తానని బాలకృష్ణ పలు సందర్భాల్లో చెప్పారు. ఇవే కాదు, కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘విక్రమ సింహ భూపతి’, బి.గోపాల్‌ దర్శకత్వంలో ‘హర హర మహదేవ’ ఇలా బాలకృష్ణ చిత్రాలు అనుకున్నా, అవి చిత్రీకరణకు నోచుకోలేదు.

వెంకటేశ్‌ ఆ రెండు చిత్రాలు

కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వెంకటేశ్‌. ఆయన కీలక పాత్రలో వంశీ దర్శకత్వంలో ‘గోళీపురం రైల్వేస్టేషన్‌’ అనుకున్నారు. అది కార్యరూపం దాల్చలేదు. మారుతీ దర్శకత్వంలో పొలిటికల్‌ సెటైర్‌ కథతో ‘రాధా’ ప్రకటన చేసినా, ఆ ప్రాజెక్టూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఆ తర్వాత వెంకటేశ్‌తో ‘బాబు బంగారం’ తీశారు. ఇక తేజ-వెంకటేశ్‌ కాంబినేషన్‌లో అనుకున్న ‘సావిత్రి’, కిషోర్‌ తిరుమలతో ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ ఇవ్వన్నీ స్క్రిప్ట్‌ ఫైనల్‌ అయిన తర్వాత ఆగిపోయిన చిత్రాలే!

బ్రిటిష్‌ రాణి ప్రారంభించిన ‘మరుదనాయగమ్‌’

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కీలక పాత్రలో భారీ బడ్జెట్‌తో ‘మరుదనాయగమ్‌’ అనే సినిమా మొదలై ఆగిపోయింది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఏకంగా బ్రిటిష్‌ రాణి క్వీన్‌ ఎలిజిబెత్‌ విచ్చేశారు. కొంతకాలం షూటింగ్‌ జరిగింది. కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించారు. ఆ తర్వాత ఎందుకో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. ఇటీవల ఈ సినిమా మళ్లీ మొదలు పెడతారని టాక్‌ వినిపించినా, దీనిపై కమల్ ‌హాసన్‌ స్పందించలేదు.

వీరే కాదు, రామ్‌చరణ్‌ ‘మెరుపు’, కొరటాల దర్శకత్వంలో మరో చిత్రం, మహేశ్‌-పూరిల ‘జనగణమన’, ఎన్టీఆర్‌-లారెన్స్‌ చిత్రం ‘పేదోడు’... ఇలా పలు సినిమాలు దాదాపు ఒకే అయినా, సెట్స్‌పైకి వెళ్లలేకపోయాయి. ఇవే కాదు, చర్చల దశలోనే ఆగిపోయిన సినిమాలు ఇంకెన్నో ఉంటాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని