చకచకా పైవంతెన
logo
Published : 18/06/2021 02:56 IST

చకచకా పైవంతెన

280 మంది కార్మికులతో పనులు

ఈనాడు, అమరావతి

పిల్లర్లపై వేసిన స్లాబ్‌

కొవిడ్‌ వైరస్‌ ఉద్ధృతి కారణంగా కర్ఫ్యూ విధించడంతో విజయవాడ నగరం నిర్మానుష్యంగా మారింది. సడలింపు వేళల్లో మినహా మిగతా సమయాల్లో అంబులెన్సుల హారన్లు మాత్రమే వినిపించేవి. వాటితో పాటు.. బెంజిసర్కిల్‌ వద్ద హడావుడి కనిపించేది. హెల్మెట్లు, రక్షణ కవచాలు, బూట్లు ధరించి కార్మికులు నిత్యం పని చేసేవారు. పగలు, రాత్రి పని జరిగేది. కాంక్రీట్‌, వెల్డింగ్‌ పనులతో ఉండేవారు. నగరంలో కర్ఫ్యూ విధింపు ఒకరకంగా వారికి కలిసొచ్చింది. దీంతో 18 నెలల్లో పూర్తి చేయాల్సిన బెంజి పైవంతెన 11 నెలలకే పూర్తి కాబోతోంది. వచ్చే అక్టోబరు 15 నాటికి అందుబాటులోకి రానుంది.

వారంతా ఇతర రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం వచ్చారు. మొత్తం 280 మంది. రెండు ప్రాంతాల్లో వారికి శిబిరాలు ఏర్పాటు చేశారు. కనీసం 140 మంది చొప్పున నివాసం ఉంటున్నారు. పగలు పనులు రాత్రి సేదతీరతారు. అంతమందిలో కొందరికి జ్వరం వచ్చిందే తప్ఫ. ఒక్కరికి కరోనా పాజిటివ్‌ రాలేదు. జ్వరం వచ్చిన వారిని ఐసొలేషన్‌లో ఉంచి మందులు అందించారు. వారికి పాజిటివ్‌ రాలేదు. గత మూడు నాలుగు నెలలుగా కరోనా సమయంలో వారు కష్టపడుతున్నా వైరస్‌ వారి దరి చేరలేదు. వీరు బెంజిసర్కిల్‌ పైవంతెనకు రాళ్లు ఎత్తుతున్న కూలీలు. పశ్చిమబంగ, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు. కరోనా, లాక్‌డౌన్‌, కర్ఫ్యూ తమ ఉపాధి దెబ్బతీయలేదని విశ్వాసంతో పనిచేస్తున్న ముఠా కూలీలు.

* కీలకమైన నిర్మాణాలు కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేశారు. ప్రుస్తుతం 72శాతం పనులు పూర్తయ్యాయి. బెంజి పార్టు2 పైవంతెనకు ప్రస్తుతం స్లాబ్‌లు వేస్తున్నారు. ఇవి కూడా దాదాపు 80శాతం పూర్తయ్యాయి. గడ్డర్లను బిగించారు. కూడలి వద్ద మాత్రం గడ్డర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. మొత్తం 2.47 కి.మీ దూరం పైవంతెన ఉంటుంది. దీనిలో 1.700 కి.మీ పైవంతెన, 770 మీటర్లు అప్రోచ్‌ రహదారి ఉంటుంది. గత ఏడాది నవంబరులో పనులు ప్రారంభమయ్యాయి. ఏడు నెలల్లో 72 శాతం పనులు పూర్తి కావడం విశేషం. మొత్తం 49 పిల్లర్లు ఉంటాయి. స్లాబ్‌ల నిర్మాణం వేగంగానే జరుగుతోంది. ఒకవైపు వంతెన నిర్మాణం జరిగినా బెంజికూడలి వద్ద ట్రాఫిక్‌ జాం తప్పడం లేదు. ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు పైవంతెన అందుబాటులో ఉన్నా తెలియక కిందివైపు వస్తున్నారు. ఏలూరు వైపు ఎలాంటి సమాచార నామఫలకం ఏర్పాటు లేదు. కొన్ని భారీ వాహనాలు కింది నుంచే వస్తున్నాయి. స్టార్‌ హోటల్‌వైపు నామఫలకం ఏర్పాటు చేస్తే రద్దీ తగ్గించే అవకాశం ఉంది.

అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం..!

-బ్రహ్మయ్య, డీపీఎం, లక్ష్మీ ఇన్‌ఫ్రా

బెంజి సర్కిల్‌ పార్టు2 పైవంతెన నిర్మాణంలో 280 మంది కార్మికులు పాల్గొంటున్నారు. వీరిలో నైపుణ్యం కలిగిన వారు, సెమి స్కిల్డ్‌ కార్మికులు ఉన్నారు. ఎక్కువగా పశ్చిమ్‌బంగ, యూపీ, ఒడిశా నుంచి వచ్చారు. రెండు ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేశాం. రోజూ క్యాంపుల వద్ద శానిటేషన్‌ చేస్తున్నాం. ప్రతి వారం కరోనా పరీక్షలు చేస్తున్నాం. యాంటీజెన్‌ టెస్టులు నిర్వహిస్తున్నాం. క్యాంపుల్లో కార్మికులకు జ్వరాలు వచ్చాయి. కానీ కొవిడ్‌ పాజిటివ్‌ ఇంతవరకు ఒక్కరికి రాలేదు. జ్వరం వచ్చిన వారిని ఐసొలేషన్‌లో ఉంచి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించాం. నెగెటివ్‌ వచ్చాయి. మేం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మాస్క్‌లు, శానిటైజర్లు అందజేశాం. అందుకే త్వరితగతిన పూర్తి చేయగలిగాం. అక్టోబరు 15 నాటికి అందుబాటులోకి తెస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని