అసంపూర్తిగా వదిలేశారు..!
eenadu telugu news
Published : 16/09/2021 03:01 IST

అసంపూర్తిగా వదిలేశారు..!

భూసేకరణ వివాదాల్లో బందరు రహదారి ●

కొత్తగా టెండర్లను పిలిచేందుకు సన్నాహాలు

ఈనాడు అమరావతి


కొణతలపాడు, ప్రొద్దుటూరు మధ్య మిగిలి ఉన్న రోడ్డు పనులు

ఆ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ప్రారంభించారు. టోల్‌ వసూలు చేస్తున్నారు. కానీ అక్కడక్కడా పనులను వదిలేసి గుత్త సంస్థ చెక్కేసింది. భూసేకరణ వివాదాలు, న్యాయస్థానంలో వాజ్యాలతో ఆరు ప్రాంతాల్లో నిర్మాణం వదిలి వేసింది. దీనికి తాజాగా మళ్లీ అంచనాలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. బందరు జాతీయ రహదారి నిర్మాణం భూసేకరణ వివాదంగా మారింది. దీనికి పాత విధానంలో భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ప్రస్తుతం చెల్లింపులు కొత్త విధానంలో చెల్లించాల్సి వచ్చింది. దీంతో మరో రూ.800 కోట్లు కావాలని కేంద్రానికి అంచనాలు పంపారు. ఈ నిధులు ఎప్పుడు మంజూరవుతాయోనని ఎదురు చూస్తున్నారు. కొత్తగా నిధులు మంజూరు అయితేనే మధ్యలో నిలిచిన పనులు తిరిగి పూర్తి చేసే అవకాశం ఉంది.

ఒక శాతం వదిలారు..

బందరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ 65) విస్తరణ పనులు దాదాపు పార్తి చేశారు. కేవలం 750 మీటర్ల దూరం ఆధునికీకరణ మాత్రం మిగిలిపోయింది. న్యాయ సంబంధ కేసులు, చిక్కులు ఎదురుకావడంతో పనుల్లో జాప్యం జరిగింది. మొత్తం 64 కి.మీ నాలుగు వరసల విస్తరణ రహదారి 99శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం ఒక శాతం పనులు వదిలేశారు. గుత్తేదారు చివరి బిల్లులు చేసుకుని రాంరాం చెప్పారు. విజయవాడ నగరం, పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, పమిడిముక్కల, పామర్రు, గూడూరు, బందరు మండలాలను కలుపుతూ జాతీయ రహదారి వెళ్తుంది. మొత్తం 64 కి.మీ రోడ్డు నాలుగు వరసలుగా విస్తరించి నిర్మాణం చేయాల్సి ఉంది. గతంలో ఉన్న రెండు వరసల రోడ్డు ఆధునికీకరణ చేశారు. దీనికి కిలోమీటరుకు వ్యయం రూ.14.36 కోట్లుగా అంచనా వేశారు. బెంజిసర్కిల్‌ పైవంతెనతో సహా మొత్తం 4 మేజర్‌ వంతెనలు, 5 మధ్యతరహా వంతెనలు, 5 అండర్‌పాస్‌లు నిర్మాణం చేయాలి. వీటిలో బెంజిసర్కిల్‌తో సహా అన్ని పూర్తయ్యాయి. 107 ప్రాంతాల్లో కల్వర్టుల నిర్మాణం, బస్‌బేలు 34 ప్రాంతాల్లో ఉన్నాయి. కంకిపాడు దాటిన తర్వాత టోల్‌గేటు ఏర్పాటు చేశారు. కంకిపాడు, మంటాడ, పామర్రు, సుల్తాన్‌బాద్‌ గ్రామాల్లో 15.85 కి.మీ వరకు బైపాస్‌ నిర్మాణం చేశారు. బైపాస్‌ మొత్తం సీసీ రోడ్డుగా నిర్మాణం చేశారు. రోడ్డు నిర్మాణానికి రూ.740 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పరిహారం చెల్లింపులకు భారీగా వ్యయం అవుతోంది. సుమారు రూ.750 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1500 కోట్లు అని అధికారులు వివరించారు. విజయవాడ నుంచి పోరంకి వరకు 8.4 కి.మీ 45 మీటర్ల (150 అడుగులు) వెడల్పు, ఆ తర్వాత 60 మీటర్ల (200అడుగులు) వెడుల్పుతో రోడ్డు నిర్మాణం చేశారు. 2016 నవంబరులో గుత్త సంస్థ దిలీప్‌బిల్డ్‌కాన్‌ రోడ్డు నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభించారు. వాస్తవానికి 2018 నవంబరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. 2019 ఆగస్టు నాటికి పనులు మొత్తం పూర్తయ్యాయి.

మళ్లీ టెండర్లు..

గుత్త సంస్థ ప్రాజెక్టును పూర్తి చేసి తుది బిల్లులు తీసుకుంది. కానీ 750 మీటర్ల వరకు నిర్మాణం వదిలేశారు. కొణతలపాడు ప్రొద్దుటూరు మధ్య కొంత వివాదం ఉంది. ఇటీవల న్యాయస్థానంలో పరిష్కారమైంది. ఇక్కడ నిర్మాణం చేయాల్సి ఉంది. కంకిపాడు బైపాస్‌ వద్ద పడమరలో 300 మీటర్లు.. తూర్పున 100 మీటర్లు నిర్మాణం చేయాల్సి ఉంది. ఉయ్యూరు వద్ద కొంత నిర్మాణం మిగిలిపోయింది. గంగూరు వద్ద కొంత నిర్మాణం నిలిచిపోయింది. వీటిని గుత్తేదారులు నిర్మాణం చేయకుండా వదిలివేశారు. మళ్లీ టెండర్లను పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈపీసీ ప్రకారం మొత్తం గుత్తేదారు నిర్మాణం చేయాల్సి ఉన్నా న్యాయ సంబంధ కారణాలను చూపించి గుత్తేదారు వదిలివేశారు. కంకిపాడు వద్ద మాత్రం టోల్‌ యధావిధిగా జాతీయ రహదారుల సంస్థ వసూలు చేస్తోంది. నిర్మాణం పూర్తి చేయకుండానే టోల్‌ వసూలుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో పాదచారుల వంతెనలను నిలిపివేశారు. కానూరు వద్ద ఒక వంతెన అసంపూర్తిగా నిర్మాణం చేశారు. సర్వీసు రహదారి లేకుండానే నిర్మాణం చేయడంతో కానూరు, తాడిగడప, పోరంకి, పెనమలూరు వద్ద ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.

ప్రతిపాదనలు పంపాం..

-డీవీ నారాయణ, పీడీ జాతీయ రహదారుల సంస్థ

కొన్ని భూసేకరణ సమస్యలు వచ్చాయి. దీంతో జాప్యం జరగడం వల్ల గుత్త సంస్థ వదిలేసింది. వీటిని మినహాయించి బిల్లులు చేశాం. మిగిలిన పనులకు సంబంధించి భూమి అప్పగించిన తర్వాత పనులు ప్రారంభిస్తాం. దీనికి అంచనాలు వేసి మళ్లీ టెండర్ల ద్వారా అప్పగిస్తాం. భూసేకరణ వ్యయం భారీగా పెరింది. రూ.800 కోట్లకు చేరింది. దీనికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. మంజూరు కావాల్సి ఉంది.


ప్రాజెక్టు: బందరు జాతీయ రహదారి విస్తరణ

అంచనా వ్యయం: రూ.740 కోట్లు

భూసేకరణ వ్యయం: రూ.750 కోట్లు

దూరం: 64 కిలోమీటర్లు

విస్తరణ: నాలుగు వరసలు (200అడుగులు)

గుత్త సంస్థ: దిలీప్‌కాన్‌ బిల్డ్‌

పనులు ప్రారంభం: 2016 నవంబరు

పనులు పూర్తి: 2019 నవంబరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని